బలిమెల నీటి వినియోగంపై సమీక్ష
ABN, Publish Date - Dec 13 , 2023 | 11:02 PM
ఆంధ్ర, ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నీటి వినియోగంపై ఇరు రాష్ర్టాల అధికారులు బుధవారం జీకేవీధి మండలం సీలేరు ఏపీ జెన్కో అతిథి గృహంలో సమావేశమై చర్చించారు.
నీటి పంపకాలపై చర్చించిన ఆంధ్ర, ఒడిశా అధికారులు
సీలేరు, డిసెంబరు 13: ఆంధ్ర, ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నీటి వినియోగంపై ఇరు రాష్ర్టాల అధికారులు బుధవారం జీకేవీధి మండలం సీలేరు ఏపీ జెన్కో అతిథి గృహంలో సమావేశమై చర్చించారు. 2023-2024 నీటి సంవత్సరం (2023 జూలై నుంచి)లో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం ఎన్ని టీఎంసీల నీటిని వినియోగించుకుందో లెక్కకట్టారు. ఆంధ్ర 2022- 23 నీటి సంవత్సరంలో ఒడిశా కంటే అదనంగా వాడుకున్న 13.7578 టీఎంసీలతో కలిపి ఈ ఏడాది (2023- 24 నీటి సంవత్సరంలో) నవంబరు 30 నాటికి 33.4957 టీఎంసీల నీటిని వినియోగించుకున్నట్టు నిర్ధారించారు. ఒడిశా ఇప్పటి వరకు 31.3932 టీఎంసీలను వినియోగించినట్టు లెక్కించారు. దీని ప్రకారం ఆంధ్ర.. ఒడిశా కంటే ఇప్పటి వరకు 2.1025 టీఎంసీలు అదనంగా వినియోగించుకున్నట్టు ఇరు రాష్ర్టాల అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం బలిమెల జోలాపుట్ జలాశయాల్లో 64.1397 టీఎంసీలు నీటి నిల్వలు ఉన్నట్టు లెక్కలు కట్టారు. ఇందులో ఆంధ్ర వాటాగా 31.0186 టీఎంసీలుగా, ఒడిశా వాటా 33.1211 టీఎంసీలుగా పంపకాలు జరిపారు. ఇరు రాష్ర్టాల గ్రిడ్ డిమాండ్, ఇరిగేషన్ అవసరాల నిమిత్తం ఆంరఽధకు 2500 క్యూసెక్కుల నీటిని, ఒడిశాకు 1500 క్యూసెక్కుల నీటిని బలిమెల జలాశయం నుంచి నీటిని విడుదల చేయడానికి ఇరు రాష్ర్టాల అధికారుల మధ్య ఏకగ్రీవంగా ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో ఒడిశా తరఫున పొట్టేరు ఇరిగేషన్ ప్రాజెక్టు చీఫ్ కన్స్ట్రక్షన్ ఇంజనీర్(సివిల్) పితబాస్ శెట్టి, చిత్రకొండ ఎర్త్డ్యామ్ డివిజన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రమాకాంతపాత్రో, ఎర్త్ డ్యాం డివిజన్ ఏఈఈ తుషార్ రాజన్ కుంత, ఏఈ (కంట్రోల్ బోర్డు సెల్) గడాధర్ ప్రథాన్, ఒడిశా హైడ్రో ప్రాజెక్టు డిప్యూటీ జనరల్ మేనేజర్ జ్యోతిర్మయిదాస్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ప్రపుల్కుమార్ జీనా, మేనేజర్ (ఎలక్ర్టికల్) ఎం. ప్రకాష్నాయక్, అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ర్టికల్), రాకేష్ పాణిగ్రాహిలు పాల్గొనగా, ఆంధ్ర తరఫున సీలేరు కాంప్లెక్సు ఏపీ జెన్కో అధికారులు సూపరింటెండెంట్ ఇంజనీర్ కేకేవీ ప్రశాంత్కుమార్, ఈఈ జి.ప్రభాకరరావు, ఏడీఈ (డ్యాం అండ్ పవర్హౌస్) టి.అప్పలనాయుడు, ఏఈఈ సీహెచ్ సురేశ్ పాల్గొన్నారు.
Updated Date - Dec 13 , 2023 | 11:02 PM