మత్స్యకారుల వలలో అరుదైన చేప
ABN, First Publish Date - 2023-11-29T00:38:58+05:30
పూడిమడక శివారు కడపాలెం మత్స్యకారు వలలో అరుదైన చేప చిక్కింది. కచ్చిలి జాతికి చెందిన ఈ చేపను ఎగుమతి వ్యాపారి ఒకరు రూ.3.9 లక్షలకు కొనుగోలు చేసి హౌరాకు పంపారు.
కడపాలెం జాలర్లకు చిక్కిన కచ్చిలి జాతి మత్స్యం
రు.3.9 లక్షలకు కొనుగోలు చేసిన వ్యాపారి, హౌరాకు ఎగుమతి
అచ్యుతాపురం, నవరంబరు 28: పూడిమడక శివారు కడపాలెం మత్స్యకారు వలలో అరుదైన చేప చిక్కింది. కచ్చిలి జాతికి చెందిన ఈ చేపను ఎగుమతి వ్యాపారి ఒకరు రూ.3.9 లక్షలకు కొనుగోలు చేసి హౌరాకు పంపారు. వివరాల్లోకి వెళితే... కడపాలెం గ్రామానికి చెందిన మేరుగు నూకయ్య, మరికొంతమంది మత్స్యకారులు ఆదివారం సాయంత్రం పూడిమడక-చిప్పాడ సరిహద్దు ప్రాంతంలోని సముద్రంలో చేపల వేట కోసం అలివి వల (3-4 కి.మీ.ల పొడవు వుంటుంది) వేశారు. రాత్రి పది గంటలకు వలను తీయగా సుమారు 27 కిలోల బరువున్న కచ్చిలి జాతి చేప కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న పూడిమడక శివారు కొండపాలెం గ్రామానికి చెందిన చేపల వ్యాపారి ఉమ్మిడి కొండయ్య సోమవారం ఉదయం కడపాలెం వెళ్లి నూకయ్యకు రు.3.9 లక్షలకు కచ్చిలి చేపను కొనుగోలు చేశాడు. ఇతను పూడిమడక తీరంలో మత్స్యకారుల నుంచి చేపలు కొనుగోలు చేసి హౌరాలో ఒక కంపెనీకి ఎగుమతి చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో మేరుగు నూకయ్య వలలో పడిన అరుదైన కచ్చిలి జాతి చేప ఫొటోను తీసి హౌరాలోని కంపెనీ యాజమాన్యానికి పంపాడు. వారు చెప్పిన ధరకు నూకయ్య నుంచి చేపను కొనుగోలు చేశాడు. అనంతరం ప్యాకింగ్ చేసిన హౌరాకు పంపాడు. సగటున కిలో రూ.14,444 ధర పలకడంతో నూకయ్య, ఇతర మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2023-11-29T00:38:59+05:30 IST