ఊకనూ వదల్లేదు!
ABN, First Publish Date - 2023-12-11T01:19:53+05:30
విజయనగరం జిల్లాలో వైసీపీకి చెందిన ఓ కీలక నేత ఊక వ్యాపారంలో రాటుతేలిపోయారు. ‘‘అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తాం.. ఊకను తక్కువ ధరకు ఇవ్వాల’’ంటూ మిల్లర్లకు హుకుం జారీచేసి లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. గతేడాది మిల్లర్లను భయపెట్టి వందల కొద్దీ ఊక
విజయనగరంలో వైసీపీ కీలక నేత దందా
మిల్లర్లను భయపెట్టి వందలాది లోడ్‌లు స్వాహా
అతి తక్కువ ధరకే సొంతం చేసుకునే వ్యూహం
ఫార్మా పరిశ్రమకు తరలించి సొమ్ము చేసుకున్న నేత
గతేడాది ఎత్తుగడే మరోసారి అమలుకు సిద్ధం
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
విజయనగరం జిల్లాలో వైసీపీకి చెందిన ఓ కీలక నేత ఊక వ్యాపారంలో రాటుతేలిపోయారు. ‘‘అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తాం.. ఊకను తక్కువ ధరకు ఇవ్వాల’’ంటూ మిల్లర్లకు హుకుం జారీచేసి లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. గతేడాది మిల్లర్లను భయపెట్టి వందల కొద్దీ ఊక లోడులను తక్కువ ధరకే కైవసం చేసుకున్నాడు. ఈ ఏడాదీ అదే ఫార్ములా ఉపయోగించి మళ్లీ తనకే ఊక అమ్మాలని హుకుం జారీ చేసినట్లు సమాచారం. నిరుడు సేకరించిన నిల్వలను ఫార్మా పరిశ్రమలకు తరలించి నిండా దండుకున్నారు. ధాన్యం కొనుగోళ్లు, సకాలంలో సీఎంఆర్ ఇవ్వకపోయినా పౌర సరఫరాలశాఖ అధికారుల నుంచి ఒత్తిడి లేకుండా చేయడం, గోనె సంచులు, రవాణా చార్జీల విషయంలో సహకరించడం, అదనంగా ధాన్యం తూకం వేసినా రైతుల పక్షాన కాకుండా మిల్లర్లకు సహకరించడం ద్వారా వారికి తెరచాటుగా సహకారం అందించారు. ఇదే వ్యూహాన్ని ఈ ఏడాది కూడా అమలుచేసేందుకు సిద్ధమయ్యారు. ఊకను కొల్లగొట్టేందుకు కొంతమంది మిల్లర్ల సహకారం తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఇది ఎన్నికల ఏడాది కావడంతో ఆచుతూచి అడుగేయాలని ఆ నాయకుడికి కొంతమంది అనుచరులు సూచిస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి విజయనగరం జిల్లాలో గతేడాది 4.5 లక్షల టన్నుల పైబడి ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఆ ధాన్యాన్ని మిల్లింగ్ కోసం జిల్లాలోని 210 మిల్లులకు అందించారు. ప్రతి క్వింటా ధాన్యానికి 64 కిలోల బియ్యాన్ని మిల్లర్లు తిరిగి పౌర సరఫరాల శాఖకు అందివ్వాలి. ఊక, తవుడు, నూక వంటివి మిల్లర్లకే ఉంటాయి. దీనిని గుర్తించిన వైసీపీ నాయకుడు ఊకను తనకు తక్కువ ధరకే ఇవ్వాలని పట్టుబట్టారు. సాధారణంగా టన్ను ఊకను రూ.3,500 నుంచి 4వేల వరకూ అమ్మకాలు చేస్తుంటారు. కానీ ఆ నేతకు టన్ను రూ.1,500కే మిల్లర్లు విధిలేక అందించినట్లు సమాచారం. ఈ ఏడాది కూడా అదే కార్యాచరణ కోసం మిల్లర్లతో మంతనాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. జిల్లాలో ప్రతిపక్ష నాయకులకు చెందిన రైసు మిల్లుల నుంచి కూడా గతేడాది ఊకను అధికార పార్టీ నేత తోడుకుపోవడంతో వారంతా కళ్లప్పగించి చూడాల్సి వచ్చింది.
ఊకతోనూ వైసీపీ వ్యాపారం: కళావెంకట్రావు
రైతుల కష్టపడి పండించే ధాన్యంలో మిల్లర్లకు 5కేజీలు ఎందుకు కట్టబెట్టాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకట్రావు ప్రశ్నించారు. ఆదివారం ఆయన విజయనగరంలో విలేకర్లతో మాట్లాడారు. 5కేజీలు ఆశ చూపి.. మిల్లర్ల నుంచి వైసీపీ నేతలు ఊకను కారు చౌకగా కొట్టేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో వైసీపీ నేతలు ఊక వ్యాపారం ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జించి నేతలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారని, రైతులు మాత్రం నష్టాల ఊబిల్లోకి కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Updated Date - 2023-12-11T01:19:54+05:30 IST