రెండేళ్లు కుమ్ముడే!
ABN, First Publish Date - 2023-11-06T04:54:23+05:30
బిడ్డింగ్‌కు ముందే నదులు, జిల్లాల వారీగా రీచ్‌ల అప్పగింతలు పూర్తయ్యాయన్నది విశ్వసనీయ సమాచారం. షరతులకు అంగీకరించి, ఎక్కువ కప్పం కట్టే వారికే జిల్లాలను అప్పగించారు.
‘ఇసుక దోపిడీ’కి అంతా రెడీ
ఒకవైపు ఇసుక ఉచితంగా ఇచ్చి చంద్రబాబు నేరం, ఘోరం చేశారంటూ కేసు పెట్టి... మరోవైపు ఇంకో రెండేళ్లపాటు రాష్ట్రంలోని ఇసుకను భోంచేసేందుకు రంగం సిద్ధం చేశారు. ‘పండగ చేసుకో తమ్ముడూ’ అంటూ రెండేళ్లపాటు ఇసుకను సోదరుడికి అప్పగించేస్తున్నారు.
టెండర్లకు ముందే జిల్లాలవారీగా అప్పగింతలు
ఏ జిల్లాకు ఎంత కప్పం కట్టాలో నిర్ణయం
ఇసుక బిడ్‌ల దాఖలుకు నేడు గడువు
కోల్‌కతా కేంద్రంగా బిడ్‌ల పరిశీలన
‘తమ్ముడి’కే దక్కేలా పకడ్బందీ వ్యూహం
రిజర్వ్ ధరపై గనుల శాఖ విన్యాసాలు
రెండేళ్ల కిందట రూ.1,535 కోట్లకు టెండర్
ఇప్పుడు రిజర్వు ధర రూ.1,529 కోట్లే
కనీసం 10 వేల కోట్ల ఇసుక దందాకు వీలు
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
బిడ్డింగ్‌కు ముందే నదులు, జిల్లాల వారీగా రీచ్‌ల అప్పగింతలు పూర్తయ్యాయన్నది విశ్వసనీయ సమాచారం. షరతులకు అంగీకరించి, ఎక్కువ కప్పం కట్టే వారికే జిల్లాలను అప్పగించారు. వీరిలో అత్యధికులు అధికార పార్టీ నాయకులే! ‘ఫిక్స్’ చేసిన కప్పం కడితే చాలు. ఇక ఇసుక ఎంతైనా తవ్వుకోవచ్చు. ఎంతకైనా అమ్ముకోవచ్చు. ఇప్పుడు మిగిలింది... తూతూమంత్రంగా నిర్వహించే టెండర్ల ప్రక్రియ మాత్రమే! మెటల్ స్ర్కాప్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంఎ్‌సటీసీ) ఇండియా సంస్థ ద్వారా, కోల్‌కతా కేంద్రంగా గుట్టుచప్పుడు కాకుండా ఇసుక టెండర్లను పిలిచారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర కింద మూడు ప్యాకేజీలుగా విభజించారు. బిడ్‌ల దాఖలుకు సోమవారం మధ్యాహ్నంతో గడువు ముగుస్తుంది. సోమవారం సాయంత్రానికి టెండర్‌కు సంబంధించిన సాంకేతిక బిడ్‌లను ఓపెన్ చేస్తారు. ఫైనాన్షియల్ బిడ్‌లను తెరిచే సమయాన్ని తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. అయితే, టెండర్లలో ఎన్ని కంపెనీలు పాల్గొన్నా... ముఖ్యమంత్రి సోదరుడు ప్రమోట్‌చేసే కంపెనీకి మాత్రమే బిడ్డింగ్ దక్కుతుందని, కేవలం ఇసుక టెండర్లలో భాగస్వామిని చేసేందుకే ఢిల్లీ కేంద్రంగా ఓ కంపెనీని ఏర్పాటు చేయించారని స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటి వరకు 13 కంపెనీలు బిడ్‌లు దాఖలు చేసినట్లు సమాచారం. అందులో ఢిల్లీ కేంద్రంగా ఉన్న కంపెనీలు రెండు ఉన్నట్లు తెలిసింది.
టెండర్లలో విన్యాసాలు...
మూడు ప్యాకేజీలకు కలిపి రెండేళ్లకు రిజర్వ్ ప్రైస్ 1529 కోట్లు. అంటే, ఒక్కో ఏడాదికి 764.5 కోట్లు! ఈ ధరపై ఎవరు ఎక్కువ కోట్‌చేస్తే వారికే టెండర్ దక్కనుంది. అయితే, ఇప్పుడున్న ఇసుక వ్యాపారంలో ఇదేం పెద్ద బడ్జెట్‌కాదని అధికార వర్గాలు చెబుతున్నాయి. 2021 మే 13 నుంచి 2023 మే 13 వరకు రెండేళ్ల గడువుతో టెండర్లు పిలిచినప్పుడు రిజర్వ్ ధర 1510 కోట్లు. జేపీ వెంచర్స్ దీనికి అదనంగా 25 కోట్లు పాడి... 1535 కోట్లకు టెండర్ దక్కించుకుంది. మరి... ఇప్పుడు రిజర్వ్ ధర ఎంత ఉండాలి? 1535 కోట్లపైనే ఉండాలి. కానీ... 1529 కోట్లదగ్గరే ఆగిపోయారు. ఎవరికి మేలు చేయడానికి తక్కువ ధరను నిర్ణయించారు? ఇది ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడం కాదా? చంద్రబాబు హయాం కంటే జగనన్న పాలనలోనే గనులపై ఎక్కువ ఆదాయం వస్తోందని, అభివృద్ధి కనిపిస్తోందని ఆ శాఖ అధికారి వెంకటరెడ్డి రాజకీయ ప్రసంగాలు చేశారు. ఇసుకతో సంబంధం లేని గనులపై ఆదాయం 2021-22లో 1800 కోట్లు! 2022-23లో దీనిని రూ.3500 కోట్లకు, 2023-24లో 4500 కోట్లకు పెంచాలని జగన్ సర్కారు గొప్పగా చెప్పింది. ఆ దిశగా గనుల ఫీజులను ఎడాపెడా పెంచేసింది. అదే దూకుడు ఇసుక విషయంలో మాత్రం చూపడంలేదు. ఇసుకను ‘తమ్ముడి’కి అప్పగిస్తున్నందునే టెండర్లలో రిజర్వు ప్రైస్‌ను తగ్గించారనే ప్రచారం జరుగుతోంది. నిజానికి... గత రెండేళ్లలో ఇసుకపై 10వేల కోట్లపైనే వ్యాపారం జరిగింది. కప్పం కింద తాడేపల్లికి వెళ్లిన సొమ్మే 3500 కోట్లుగా ఇసుక కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఇక నేతలు తవ్వుకున్నది ఎంతో అంచనా వేయడం కష్టమే. అంటే... ఈ లెక్కన వచ్చే రెండేళ్లకు టెండర్ రిజర్వ్ ధర కనీసం 4500 కోట్లపైనే ఖరారు చేయాల్సి ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. కానీ, అందుకు భిన్నంగా, 2021-2023 ధరపై కేవలం 19 కోట్లు పెంచి 1529 కోట్ల వద్ద ఆగిపోయారు. ఇసుక టెండర్ల ద్వారా సర్కారుకు భారీ ఆదాయం తీసుకురావాలన్న ఆలోచనే ఉంటే, రిజర్వ్ ధరను తాజా పరిస్థితులకు తగినట్లుగా పెంచే వాళ్లు. ‘కొత్త కాంట్రాక్టరును ఇబ్బంది పెట్టకూడదు’ అన్నట్లుగా ధరను కిందికి దించేశారు. రిజర్వు ధరపై అంతో ఇంతో ఎక్కువ పాడి, ఇతరులెవరు పోటీలేకుండా చూసుకుని... జిల్లాల వారీగా ఇసుక రీచ్‌లను అప్పగించేసి... కప్పం వసూలు చేసుకోవడమే! హాయిగా కూర్చుని కోట్లు కుమ్మేయడమే మిగిలింది! బిల్లులు మాత్రమే బిడ్డింగ్ దక్కించుకున్న కంపెనీ పేరుతో ఇస్తారు. తవ్వకాలు, అమ్మకాలు మాత్రం వైసీపీ నేతల ద్వారానే జరుగుతాయి.
Updated Date - 2023-11-06T05:30:37+05:30 IST