ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tidco Houses : పేదల గూడు.. పాడు

ABN, First Publish Date - 2023-11-22T04:35:29+05:30

టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా వైసీపీ సర్కారు నిలువునా ముంచేసింది. తాగునీరు, రోడ్లు, కరెంటు, వీధి లైట్లు వంటి కనీస సదుపాయాలు కూడా కల్పించలేదు.

టిడ్కో లబ్ధిదారులను ముంచేసిన జగన్‌ సర్కారు

నాలుగున్నరేళ్ల క్రితమే ఇళ్లు పూర్తయినా

అందజేయకుండా కాలయాపన

కనీస సౌకర్యాలూ కల్పించని వైనం

తాగునీరు, రోడ్లు, వీధి లైట్లు లేవు

గృహ సామగ్రిని ఎత్తుకెళ్తున్న దొంగలు

పిచ్చి మొక్కలతో అడవిలా కాలనీలు

పలు చోట్ల నిర్మాణాలు శిథిలావస్థకు

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా

ఇప్పుడు నివాసం ఉండలేని దుస్థితికి

‘అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి’... ఆటోవాలా సైతం ఇదే కోరుకుంటారు. కానీ... పేదలకు పెత్తందార్లకూ మధ్య యుద్ధం గురించి మాట్లాడే ముఖ్యమంత్రి ఫిలాసఫీ వేరు అనిపిస్తోంది. ‘నా లోట్‌సపాండ్‌,

నా తాడేపల్లి ప్యాలెస్‌ బాగుండాలి. రుషికొండలో రూ.450 కోట్ల జనం డబ్బుతో కట్టుకుంటున్న ప్యాలెస్‌ ఇంకాఇంకా బాగుండాలి! పేద, మధ్య తరగతి కోసం కట్టిన టిడ్కో ఇళ్లు మాత్రం పాడై, పనికిరాకుండా పోవాలి!’’ బహుశా... జగన్‌ కోరుకుంటున్నది ఇదే! తెలుగుదేశం హయాంలో వేలాది టిడ్కో ఇళ్లను నిర్మించారు. వాటి నిర్మాణం 70 నుంచి 90 శాతం పూర్తయింది. కొన్నిచోట్ల గృహ ప్రవేశానికి కూడా సిద్ధమయ్యాయి. కానీ... ‘చంద్రబాబు కట్టిన ఇళ్లు’ అనే ముద్ర పడుతుందనే దుగ్ధతో జగన్‌ సర్కారు వీటిని పక్కనపెట్టేసింది. ‘షీర్‌వాల్‌’ టెక్నాలజీతో నిర్మించడంతో నిర్మాణాలు బలంగానే ఉన్నాయి. కానీ... కిటికీలు, తలుపులు, విద్యుత్‌ వైరింగ్‌, కుళాయిల వంటి ఫిటింగ్స్‌ పాడైపోతున్నాయి. అసాంఘిక శక్తులకు నిలయాలుగా, మందుబాబులకు అడ్డాలుగా మారుతున్నాయి.

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా వైసీపీ సర్కారు నిలువునా ముంచేసింది. తాగునీరు, రోడ్లు, కరెంటు, వీధి లైట్లు వంటి కనీస సదుపాయాలు కూడా కల్పించలేదు. పలు చోట్ల ఇంటి నిర్మాణ సామగ్రిని దొంగలు ఎత్తుకెళ్తున్నారు. ఇళ్ల మధ్యలో పిచ్చి మొక్కలు పడి కాలనీలు అడవిని తలపిస్తున్నాయి. చాలా చోట్ల ఇళ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. మద్యం తాగడం, జూదం ఆడటంతో పాటు అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. జగన్‌ సర్కారు నిర్లక్ష్యం కారణంగా టిడ్కో ఇళ్లు నిరుపయోగంగా మారిపోయాయి. పలుచోట్ల గృహ ప్రవేశాలు చేయకనే నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అక్కడక్కడా ఇళ్లు అందుకున్న లబ్ధిదారులు కూడా నివాసం ఉండలేని పరిస్థితి. సరైన రోడ్లు, వీధి లైట్లు కూడా లేకపోవడంతో చీకటి పడిందంటే భయపడే పరిస్థితి.

అమ్మకాలకు ఇళ్లు

అమరావతిలోని దొండపాడు టిడ్కో ఇళ్లను ఈ ఏడాది మే తరువాత లబ్ధిదారులకు ఇచ్చారు. మొత్తం 1100 ఫ్లాట్లు ఉండగా, గడిచిన ఐదు నెలల్లో వంద మంది కూడా అక్కడ నివాసం ఉండడం లేదు. అక్కడికి వెళ్లాలంటే గుంతలమయంగా ఉన్న మట్టి రోడ్డే దిక్కు. నిర్మానుష ప్రదేశంలో, దట్టంగా పెరిగిన తుమ్మ పొదల మధ్య వెళ్లడానికి భయపడుతున్నారు. కనీసం వీధిలైట్లు కూడా లేవు. నాలుగేళ్లుగా తాగుబోతులు, పేకాటరాయుళ్లకు స్థావరాలుగా మారిపోయాయి. అక్కడ తమకు రక్షణ లేదని మహిళలు వాపోతున్నారు. అధికారులు, ప్రభుత్వం ఎలాంటి భద్రత చర్యలు తీసుకోవడం లేదు. చాలామంది ఇళ్లను అమ్మకానికి పెట్టినట్టు తెలుస్తోంది.

పిచ్చి మొక్కలతో..

ఎన్టీఆర్‌ జిల్లాలో 15 వేల టిడ్కో ఇళ్లలో పూర్తిచేసిన 8 వేల ఇళ్లలోకి ఒక్క లబ్ధిదారుడు కూడా గృహ ప్రవేశం చేయలేని దుస్థితి నెలకొంది. మౌలిక సదుపాయాలు కల్పించలేదు. విజయవాడ శివారు జక్కంపూడిలో ఇళ్లు పాడు పడిపోయినట్టుగా ఉన్నాయి. మధ్యలో మట్టిగుట్టలు, పిచ్చిమొక్కలు, ఏపుగా పెరిగిన దుబ్బులతో భయంకరంగా కనిపిస్తున్నాయి. జిల్లాలో నందిగామ, తిరువూరు, జగ్గయ్యపేటలలో కూడా నివాసానికి అనుకూలంగా లేవు. తిరువూరులో టిడ్కో గృహాలపైకి పిచ్చి తీగలు పెనవేసుకుపోయే పరిస్థితి ఏర్పడింది.

ఇళ్లు ఇవ్వకుండానే శిథిలం

గుంటూరు నగరంలో టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు దక్కకుండానే శిథిలమైపోతున్నాయి. అడవితక్కెళ్లపాడులోని గృహ సముదాయం పూర్తిగా పొదల మయమైపోయింది. ఇళ్లలోకి వెళ్లేందుకు దారి కూడా లేనంతగా పొదలు అల్లుకుపోయాయి. చాలా ఫ్లాట్లకు తలుపులు, కిటికీలు దెబ్బతిన్నాయి. కొన్నింటికి కిటికీల అద్దాలు పగిలిపోగా, కొన్నింటికి ఏకంగా కిటికీ కూడా లేకుండా దొంగలు దోచుకుపోయారు. గదుల్లో టైల్స్‌ మట్టి కుప్పలతో నిండిపోగా, బాత్‌రూముల తలుపులు, కమోడు మూతలు దొంగలు ఎత్తుకెళ్లారు.

వృథాగా ఇళ్లు

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని బొమ్మూరు, తొర్రేడు, నామవరం, ధవళేశ్వరం తదితర ప్రాంతాల్లో టీడీపీ ప్రభుత్వం 6,304 ఇళ్లను నిర్మించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రంగులు మార్చింది కానీ లబ్ధిదారులకు పూర్తిగా అందివ్వలేదు. గృహ సముదాయంలో డొంకలు మొలిశాయి. చెత్తాచెదారం పెరిగింది. జనం లేకపోవడంతో ఇళ్లు పాడైపోతున్నాయి.

విషపురుగులకు నివాసాలుగా

ఒంగోలు నగర సమీపంలోని చింతల వద్ద టిడ్కో ఇళ్ల సముదాయం అడవిని తలపిస్తోంది. కొన్నిచోట్ల గోడలు పడిపోయాయి. విషపురుగులకు నివాసాలుగా మారాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. కొప్పోలు వద్ద నిర్మించిన గృహాలు అసంపూర్తిగానే ఉండటంతో మిగిలిన సామగ్రి తుప్పుపట్టిపోతోంది. అటు ఇల్లు దక్కక, ఇటు అప్పులు చేసి మరీ కట్టిన డబ్బులు తిరిగి రాక, నెలనెలా బ్యాంకులు ఇచ్చే నోటీసులతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.

తాగునీరు, రోడ్లు లేక..

విజయనగరం జిల్లాలో మొత్తం 4,368 ఇళ్లను మంజూరు చేశారు. సారిపల్లి వద్ద 2,720 ఇళ్లు పూర్తయ్యాయి. ఇందులో 1,280 మంది లబ్ధిదారులకు ఏడాదిన్నర క్రితమే పంపిణీ చేశారు. నేటికీ వాటిలో లబ్ధిదారులు చేరలేదు. తాగునీటి సౌకర్యాలు కల్పించక పోవడం.. లింక్‌ రోడ్లు నిర్మాణం చేపట్టక పోవడంతో లబ్ధిదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ముళ్ల పొదల మధ్య..

ఉమ్మడి అనంతపురం జిల్లాలో టిడ్కో ఇళ్ల సముదాయాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. గృహ సముదాయాల చుట్టూ ముళ్ల పొదలు పెరిగాయి. ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. జూదరులు పేకాటకు సురక్షిత ప్రాంతాలుగా ఎంచుకున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో బహిర్భూమికి వాడుకుంటున్నారు. మందుబాబులు పోలీసుల కంటపడకుండా మద్యం సేవించేందుకు అడ్డాగా మార్చుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో చీకటి పడితే అనైతిక కార్యకలాపాలకు వాడుకుంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వద్దు బాబోయ్‌

ఆ ఇళ్లు నెల్లూరు నగరం, కావలి పట్టణాల్లో టిడ్కో ఇళ్లలో ఉండాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు. ఖాళీగా ఉన్న టిడ్కో ఇళ్లలో ఒక్కదానిలో కూడా వైరింగ్‌ లేదు. వైర్లు, స్విచ్‌బోర్డులు మొత్తం దొంగలించుకుపోయారు. కొళాయిలు విప్పుకొనిపోయారు. తలుపులు, కిటికీలను సైతం తీసుకెళ్లారు. వీధి దీపాలు లేవు. మంచి నీటి సౌకర్యం లేదు. కావలిలో పాముల బెడద విపరీతంగా ఉంది. నెల్లూరులో సంఘ విద్రోహశక్తులకు ఈ ఇళ్లు అవాసాలుగా మారిపోయాయి. గంటసేపు ఇంటికి తాళం వేసినా ఇంట్లోని వస్తువులకు గ్యారెంటీ లేని పరిస్థితి. \

చిట్టడవిలా టిడ్కో

సముదాయంపశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణ శివారున నిర్మించిన టిట్కో గృహాల్లో గృహప్రవేశాలు జరిగి మూడు నెలలు కావస్తోంది. సుమారు 2వేల మంది కాపురాలు పెట్టారు. అయితే ఇక్కడ కాలనీ చుట్టూ పిచ్చిమొక్కలు చిట్టడివిలా పెరగడంతో పాములు వస్తున్నాయి. అపార్ట్‌మెంట్ల మధ్యలో చెత్త పేరుకుపోతోంది. దీన్ని తొలగించకపోవడంతో వాతావరణం అధ్వాన్నంగా తయారైంది. చెత్త, ప్లాస్టిక్‌ వ్యర్థాలు కొన్నిచోట్ల మురుగు నీరు నిలిచి దుర్వాసన వస్తోంది.

ఇదీ దుస్థితి..

గుంటూరు నగరంలోని టిడ్కోల ఇళ్లలో గదుల బయట వరండాలో టైల్స్‌, పని సామాగ్రి అస్తవ్యస్తంగా పడేశారు. గృహ సముదాయం ముఖద్వారానికి అడ్డంగా భారీ సిమెంటు పైపులు పడవేసి వాటిని అక్కడే వదిలేశారు. దీంతో ప్లాట్లలోకి వెళ్లే దారి కూడా లేకుండాపోయింది.

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని బొమ్మూరులో ఫేజ్‌-1లో నిర్మఇంచిన 2,528 ఇళ్లలో ప్రస్తుతం 800 కుటుంబాలు మాత్రమే ఉంటున్నాయి. తొర్రేడులోనూ కొంతమందే ఉంటుండగా.. ఖాళీగా ఉన్న ఇళ్లన్నీ పాడైపోతున్నాయి.

నెల్లూరు టిడ్కో గృహ సముదాయాల్లో దాదాపు 50 శాతం ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. నివాసం ఉంటున్న ఇళ్లలో కూడా వస్తువులకు గ్యారెంటీ లేకపోవడంతో ఒక్కొక్కరూ ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు.

తొలిదశలో ఒంగోలు నగర సమీపంలోని చింతల వద్ద ఉన్న నిర్మాణం పూర్తయిన గృహాలు దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. రెండో దశలో కొప్పోలు వద్ద నిర్మించిన గృహాలు అసంపూర్తిగానే ఉండటంతో మిగిలిన సామగ్రి తుప్పుపట్టిపోతోంది.

అనంతపురం నగర శివారులోని చిన్మయనగర్‌లో నిర్మాణంలో ఉన్న టిడ్కో ఇళ్ల సముదాయంలో భారీగా ఖాళీ మద్యం బాటిళ్లు దర్శనమిస్తున్నాయి. గుంతకల్లు సమీపంలోని టిడ్కో ఇళ్లు కూడా మందుబాబులకు అడ్డాగా మారాయి.

కర్నూలు జిల్లాలో కర్నూలు నగరం, ఆదోని, ఎమ్మిగనూరు పట్టణాల్లో గత టీడీపీ ప్రభుత్వం ఇళ్లు19,992 టిడ్కో ఇళ్లు మంజూరు చేసి వాటిలో 16,945 ఇళ్లు పూర్తిచేసింది. జగన్‌ ప్రభుత్వం వచ్చాక వాటికి రంగులు వేసిందే తప్ప వాటిని లబ్ధిదా రులకు ఇవ్వలేదు. నాలుగున్నర ఏళ్లుగా నిరుప యోగంగా మారడంతో దొంగలు, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి.

Updated Date - 2023-11-22T04:35:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising