టీటీడీ నిధులతో తిరుపతిలో పనులుకొత్తేమీ కాదు..
ABN, Publish Date - Dec 28 , 2023 | 03:59 AM
ఏళ్లుగా టీటీడీ నిధులను తిరుపతిలో పారిశుధ్యం, ఇతర పనులకు వినియోగిస్తున్నామని, ఇదే మొదటిసారి కాదని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)ఈవో ధర్మారెడ్డి హైకోర్టుకు నివేదించారు.
గతంలోనూ నిధుల మంజూరు
హైకోర్టులో టీటీడీ ఈవో ధర్మారెడ్డి కౌంటరు
విచారణ మూడువారాలకు వాయిదా
అమరావతి, డిసెంబరు27 (ఆంధ్రజ్యోతి): ఏళ్లుగా టీటీడీ నిధులను తిరుపతిలో పారిశుధ్యం, ఇతర పనులకు వినియోగిస్తున్నామని, ఇదే మొదటిసారి కాదని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)ఈవో ధర్మారెడ్డి హైకోర్టుకు నివేదించారు. భక్తుల రాకపోకలు ఎక్కువగా ఉండే టీటీడీ దేవస్థానాలు, రైల్వేస్టేషన్లు, బస్‌స్టాండ్లు, టీటీడీ ఆస్పత్రులు, విద్యాసంస్థల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత టీటీడీపై ఉందన్నారు. పారిశుధ్య పనులకు సహకారం అందించాలని తిరుపతి మున్సిపల్ కమిషనర్ కోరిన మీదట పాలకమండలిలో చర్చించి సహకారం అందించాలని తీర్మానం చేశారని వివరించారు. తిరుపతికి వచ్చే భక్తుల విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని టీటీడీ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. తిరుపతి నగరంలోని రోడ్డు విస్తరణ పనులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం, మంచినీటి సరఫరా కోసం గతంలోనూ నిధులు ఇచ్చామన్నారు. కేవలం రాజకీయ, స్వీయ ప్రయోజన దృష్టితోనే పిటిషనర్ పిల్ దాఖలు చేశారని పేర్కొన్నారు. భారీ జరిమానా విధించి వ్యాజ్యాన్ని కొట్టివేయాలని కోరారు. టీటీడీ నిధులను తిరుపతి కార్పొరేషన్‌లోని రోడ్లు, కాలనీల పారిశుధ్య పనులకు వినియోగించే విషయంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, టీటీడీ ఈవో వేసిన కౌంటర్‌కు రిప్లై వేసేందుకు సమయం ఇవ్వాలన్న పిటిషనరు తరఫు న్యాయవాది అభ్యర్థనకు హైకోర్టు ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. విచారణను మూడువారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది.
మరోవైపు పారిశుధ్య పనులకు టెండర్ ప్రక్రియను కొనసాగించుకోవచ్చని, కాంట్రాక్ట్‌ను మాత్రం ఎవరికీ కేటాయించవద్దని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలన్న టీటీడీ తరఫు న్యాయవాది అభ్యర్థనను తోసిపుచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను తిరుపతి కార్పొరేషన్‌లోని రోడ్లు, కాలనీల పారిశుధ్యం పనులకు వినియోగించడాన్ని సవాల్ చేస్తూ తిరుపతికి చెందిన బీజేపీ నేత, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు జి.భానుప్రకాశ్ హైకోర్టులో పిల్ దాఖలుచేశారు. ఏటా రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు ఈవో ఆమోదం తెలుపుతూ పనుల నిర్వహణకు టెండర్లు పిలవడాన్ని చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ చేపట్టిన ధర్మాసనం... టీటీడీ నిధులను తిరుపతి కార్పొరేషన్ పరిధిలో పారిశుధ్యం పనులకు వినియోగించడాన్ని ఆక్షేపించింది. పారిశుధ్య పనులకు టెండర్ ప్రక్రియను కొనసాగించుకోవచ్చని, కాంట్రాక్ట్‌ను మాత్రం ఎవరికీ కేటాయించవద్దని మధ్యంతర ఉత్తర్వులను జారీచేసింది. ఈ వ్యాజ్యం బుధవారం మరోసారి విచారణకు రాగా, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వుల కారణంగా పారిశుధ్య పనులపై ప్రభావం పడుతోందని వివరించారు. టీడీపీ తరఫున సీనియర్‌న్యాయవాది సి.రఘు వాదనలు వినిపించారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న అనంతం తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంటూ విచారణను 3వారాలకు వాయిదా వేసింది.
Updated Date - Dec 28 , 2023 | 03:59 AM