Polavaram : పోలవరం తొలిదశ ఫలితం అంతంతే!
ABN, First Publish Date - 2023-12-10T03:47:40+05:30
పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల కాంటూరుకు పరిమితం చేస్తే తీరని నష్టమేనని ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. దీనివల్ల లక్షలాది ఎకరాలకు సాగునీరు అందకుండా పోతుందని కేంద్ర జలశక్తి శాఖకు ఇటీవల రాష్ట్ర జల వనరుల ..
41.15మీ. కాంటూరులో 3లక్షల ఎకరాలకే నీరు
45.72మీ. కాంటూరులో 7,20,000 ఎకరాలకు
కేంద్రానికి ఇచ్చిన నివేదికలో రాష్ట్రం స్పష్టీకరణ
ముందునుంచీ ‘ఆంధ్రజ్యోతి’ చెబుతున్నది ఇదే
ఎత్తు తగ్గిస్తే మినీ రిజర్వాయరేనని ఆందోళన
అప్పట్లో సీఎం నుంచి మంత్రుల వరకూ సెటైర్లు
ప్రాజెక్టుపై అలవోకగా అబద్ధాలు అల్లేసిన నేతలు
ఇప్పుడు జల వనరుల శాఖ నివేదికతో బట్టబయలు
అమరావతి, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల కాంటూరుకు పరిమితం చేస్తే తీరని నష్టమేనని ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. దీనివల్ల లక్షలాది ఎకరాలకు సాగునీరు అందకుండా పోతుందని కేంద్ర జలశక్తి శాఖకు ఇటీవల రాష్ట్ర జల వనరుల శాఖ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో స్పష్టం చేసింది. ప్రాజెక్టును గరిష్ఠ స్థాయిలో 45.72 మీటర్ల కాంటూరులో కాకుండా 41.15 మీటర్ల కాంటూరుకే పరిమితం చేస్తే ఫలితం అంతంతమాత్రమేనని తెలిపింది. ఢిల్లీలో కేంద్ర జలశక్తి కార్యదర్శి దేబర్షి ముఖర్జీ అధ్యక్షతన ఈ నెల 5న జరిగిన సమీక్షలో రాష్ట్ర జల వనరుల శాఖ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. తొలిదశకే పోలవరాన్ని పరిమితం చేస్తే ఏం జరుగుతుందో, గరిష్ఠ స్థాయిలో నిర్మిస్తే ఎంత ప్రయోజనమో అందులో స్పష్టం చేసింది. కాగా, తొలిదశలో 41.15 మీటర్ల కాంటూరుకే పోలవరం ప్రాజెక్టును పరిమితం చేస్తే మినీ రిజర్వాయరుగా మారిపోతుందని ‘ఆంధ్రజ్యోతి’ ఇప్పటికే పలుమార్లు కథనాలు ప్రచురించింది. పోలవరంపై నిర్మిస్తున్న జల విద్యుచ్ఛక్తి ప్రాజెక్టు నిరుపయోగంగా మారిపోతుందని కూడా వెల్లడించింది.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి పూర్తిస్థాయిలో గోదావరి జలాలు చేరబోవని గతంలోనే ఆందోళన వ్యక్తం చేసింది. అప్పట్లో ఇవన్నీ అర్థం లేని వాదనలుగా సీఎం జగన్ నుంచి మంత్రుల వరకూ కొట్టిపారేశారు. పైగా ‘పోలవరం ఎత్తు తగ్గిస్తున్నాం అంటూ రాధాకృష్ణ చెవిలో షెకావత్ చెప్పారా?’ అంటూ అసెంబ్లీ సాక్షిగా వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లుగా ప్రాజెక్టుపై అలవోకగా అబద్ధాలు చెబుతూ, సులువుగా ప్లేట్లు తిప్పేశారు. ఇప్పుడు ఈ భయాలను నిజం చేస్తూ .. కేంద్ర జలశక్తి నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర జల వనరుల శాఖ అందించిన పీపీటీలో 41.15మీటర్ల కాంటూరుకూ, 45.72 మీటర్ల కాంటూరుకూ మధ్య వ్యత్యాసాన్ని స్పష్టంగా వివరించింది. తొలిదశలో 135 టీఎంసీల నిల్వకే పోలవరం పరిమితమవుతుందని నిపుణులు చెబుతున్నారు. పోలవరాన్ని తొలిదశకే పరిమితం చేస్తే శ్రీశైలం, నాగార్జున సాగర్ కంటే చిన్న ప్రాజెక్టుగా మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2023-12-10T03:47:41+05:30 IST