పోరుబాట వీడం
ABN, Publish Date - Dec 28 , 2023 | 12:11 AM
తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకూ పోరాటం వీడే ప్రసక్తే లేదని అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ తేల్చిచెప్పారు.
తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకూ పోరాటం వీడే ప్రసక్తే లేదని అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ తేల్చిచెప్పారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో అంగన్‌వాడీ వర్కర్లు నిర్వహిస్తున్న నిరవధిక దీక్షా శిబిరాలు బుధవారం నాటికి 16వ రోజుకు చేరాయి. నియోజకవర్గ కేంద్రాల్లో అధికార పార్టీ శాసన సభ్యుల ఇళ్లను ముట్టడించి తమ నిరసన తెలిపారు. ప్రభుత్వం దిగి వచ్చేదాకా పోరుబాట వీడేది లేదని మోరోసారి తేల్చిచెప్పారు.
కొత్తపల్లి, డిసెంబరు 27: వైసీపీ ప్రభుత్వం సమస్యలను పరిష్కరించాల్సింది పోయి.. బెదిరింపులకు దిగడం అన్యాయమని అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు హరిత, మండల నాయకులు నాగమణి, శ్రీదేవి అన్నారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేబట్టిన సమ్మె 16వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి బస్టాండు సెంటరు వరకు ర్యాలీగా వెళ్లి గాంధీ విగ్రహం ఎదుట ఖాళీ గిన్నెలు, గరిటెలతో మోత మోగిస్తూ నిరసన తెలిపారు. యూనియన్ నాయకురాలు హరిత మాట్లాడుతూ సమస్యను పరిష్కరించకుండా సమ్మెను విరమించాలని చెప్పడం ప్రభుత్వానికి తగదన్నారు. కార్యక్రమంలో లక్ష్మమ్మ, రాణెమ్మ, లలితమ్మ, పద్మావతమ్మ, తదితరులు పాల్గొన్నారు.
గోస్పాడు: స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో 16వ రోజు అంగన్‌వాడీల నిరవధిక దీక్ష కొనసాగింది. అంగన్‌వాడీలు నంద్యాలకు వెళ్లి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో రమణమ్మ, నిర్మల, సువర్ణ, చెన్నమ్మ, సారమ్మ, తదితరులు పాల్గొన్నారు.
వినూత్న నిరసన
గడివేముల: అంగన్‌వాడీ వర్కర్లు బుధవారం వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. గడివేములలో బర్రెలకు వినతి పత్రం అందజేసి తమ డిమాండ్‌లను పరిష్కరించాలని కోరారు. యూనియన్ మండల నాయకులు వసంతమ్మ, రామచెన్నమ్మ మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యూటీ ఇవ్వాలని అన్నారు. వేతనాలను పెంచాలని కోరారు. అద్దెభవనాల బిల్లులను తక్షణమే చెల్లించాలని, జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Updated Date - Dec 28 , 2023 | 12:11 AM