TDP-Jana Sena : టీడీపీ - జనసేన ఉమ్మడి భేరి
ABN, First Publish Date - 2023-11-10T04:24:59+05:30
ఈ నెలలో వరుసగా నాలుగు ఉమ్మడి కార్యక్రమాలు చేపట్టాలని తెలుగుదేశం, జనసేన పార్టీలు నిర్ణయించాయి. విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో ఈ రెండు పార్టీల రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ భేటీ జరిగింది. ఒక్కో పార్టీ నుంచి ఏడుగురు
మేనిఫెస్టో ఖరారుకు 13న సమావేశం
14, 15, 16ల్లో రాష్ట్రవ్యాప్త ఆత్మీయ భేటీలు
17 నుంచి ఇంటింటి పర్యటనలు
18, 19 తేదీల్లో రోడ్ల దుస్థితిపై ఆందోళనలు
టీడీపీ, జనసేన పార్టీల సమన్వయ కమిటీ భేటీ నిర్ణయం
అమరావతి, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): ఈ నెలలో వరుసగా నాలుగు ఉమ్మడి కార్యక్రమాలు చేపట్టాలని తెలుగుదేశం, జనసేన పార్టీలు నిర్ణయించాయి. విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో ఈ రెండు పార్టీల రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ భేటీ జరిగింది. ఒక్కో పార్టీ నుంచి ఏడుగురు చొప్పున నేతలు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలను వివరించారు. దీని ప్రకారం దీపావళి పండగ తర్వాత ఈ నెల 14, 15, 16 తేదీల్లో రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు పార్టీల నేతలు కలిసి ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తారు. స్థానికంగా కలిసి పనిచేయడం, ఉమ్మడిగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం, ప్రభుత్వ దమన నీతిపై కలిసి పోరాడటం వంటి వాటిని ఇందులో చర్చిస్తారు. ఏ తేదీన ఏ నియోజకవర్గంలో సమావేశం నిర్వహించేది కొద్ది రోజుల్లో ప్రకటిస్తారు. రెండు పార్టీల తరఫున ఉమ్మడి మేనిఫెస్టో ఖరారు నిమిత్తం ఈ నెల 13న ఒక సమావేశం నిర్వహిస్తారు. ఒకో పార్టీ నుంచి ముగ్గురేసి నేతలు ఇందులో పాల్గొంటారు. టీడీపీ బృందానికి యనమల రామకృష్ణుడు, జనసేన బృందానికి నాదెండ్ల మనోహర్ నాయకత్వం వహిస్తారు. మినీ మేనిఫెస్టో పేరుతో టీడీపీ గతంలో ఆరు హామీలను ప్రకటించింది. తమ తరఫున నాలుగు లేదా ఐదు ఇస్తామని, వాటిని కూడా కలిపి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించాలని జనసేన నాయకత్వం కోరింది. 13న జరిగే సమావేశంలో జనసేన నుంచి వచ్చే ప్రతిపాదనలను చర్చించి ఖరారు చేస్తారు. ఈ నెల 17 నుంచి రెండు పార్టీల నేతలు ఇంటింటి పర్యటనలు ప్రారంభిస్తారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ప్రజలకు వివరిస్తాయి. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై కొన్ని ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. మొదటగా రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై ఈ నెల 18, 19 తేదీల్లో ఆందోళన చేపడతారు.
వరుస ఆందోళనలు..
మరి కొన్ని అంశాలపై రెండు పార్టీలు కలిసి వరుస ఆందోళనలు నిర్వహిస్తాయని అచ్చెన్నాయుడు తెలిపారు. ‘‘రాష్ట్రంలో కరువు సమస్య తీవ్రంగా ఉంది. కరువును ఆహ్వానించాలని ఒక సభలో ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. మరో సభలో కరువు లేనేలేదని చెప్పాడు. క్షేత్ర స్థాయిలో పరిస్థితి దారుణంగా ఉంది. నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలి. పంట బీమా చెల్లింపు బాధ్యత ప్రభుత్వమే తీసుకొన్నందువల్ల దెబ్బ తిన్న పంటలకు పరిహారం ప్రభుత్వమే చెల్లించాలి. ఈ డిమాండ్లపై త్వరలో ఒక ఉద్యమ కార్యాచరణ చేపడతాం’’ అని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారి సమస్యలపై విడిగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని ఈ సమావేశం నిర్ణయించింది. ప్రస్తుతం బీసీ వర్గాల వారితో టీడీపీ అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తోంది. అందులో జనసేన కూడా పాలుపంచుకొంటుంది. ప్రతిపక్ష పార్టీ నాయకులపై ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులపై బలంగా పోరాడాలని, న్యాయస్థానాల దృష్టికి కూడా తీసుకువెళ్లాలని నిర్ణయించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాక, ఇటు ఉద్యోగాల భర్తీ లేక యువత భవిష్యత్తు ప్రమాదంలో పడటం, ఉద్యోగుల సమస్యలు, ఓటర్ల జాబితా అవకతవకలపై పోరాడాలని నిశ్చయించారు. దిశ చట్టం లేకుండానే యాప్ పేరుతో ప్రభుత్వం మోసం చేస్తోందని సమావేశం ధ్వజమెత్తింది.
ఎన్డీయే భాగస్వామిగా తెలంగాణలో పోటీ
తాము ఎన్డీయే కూటమి భాగస్వామిగా ఉన్నాం కాబట్టి తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నామని జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘‘బీజేపీ జాతీయ నేతలు కలిసి పోటీచేద్దామని ప్రతిపాదించారు. మా పార్టీ కూడా తెలంగాణలో బలంగా ఉంది. అందుకే అక్కడ పోటీ చేయాలని నిర్ణయించాం’’ అని వివరించారు. ఏపీలో బీజేపీ కలిసి రాకపోతే ఏం చేస్తారన్న ప్రశ్నకు... ‘ఊహాజనిత ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేను’ అని మనోహర్ బదులిచ్చారు. ‘‘సీట్ల గురించి మేం చర్చించలేదు. మా పార్టీ అధినేత చంద్రబాబుకు పూర్తి స్థాయి బెయిల్ వచ్చిన తర్వాత రెండు పార్టీలు కలిసి రాష్ట్రంలో రెండు మూడు ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తాయి’’ అని అచ్చెన్నాయుడు చెప్పారు. సమావేశంలో టీడీపీ తరఫున లోకేశ్, అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పితాని సత్యనారాయణ, రామానాయుడు, పయ్యావుల కేశవ్, తంగిరాల సౌమ్య... జనసేన తరఫున నాదెండ్ల మనోహర్, మహేందర్‌రెడ్డి, కందుల దుర్గేశ్, బొమ్మిడి నాయకర్, కొటికలపూడి గోవిందరావు, పాలవలస యశస్విని తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-11-10T04:25:01+05:30 IST