యువగళం.. ఎన్నికల శంఖారావం
ABN, Publish Date - Dec 18 , 2023 | 12:15 AM
‘యువగళం.. ముగింపు సభ కాదు. 2024 ఎన్నికల శంఖారావంగా నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామ’ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
- భోగాపురంలో సభకు ఐదారు లక్షలు జనం వస్తారు
- ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ఎదుర్కొందాం
- ఆర్టీసీ, ప్రైవేటు బస్సులను కూడా ఇవ్వకుండా ఇబ్బందులు
- నాటుబళ్లు, సైకిళ్లు, ట్రాక్టర్లపై తరలిరండి
- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపు
శ్రీకాకుళం, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి) : ‘యువగళం.. ముగింపు సభ కాదు. 2024 ఎన్నికల శంఖారావంగా నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామ’ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సభ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై ఆదివారం శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీమంత్రి కొల్లు రవీంద్రతో కలిసి జిల్లా టీడీపీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ‘యువగళం పాదయాత్ర ముగింపు సభకు ఐదారు లక్షల మంది జనం హాజరవుతున్నారని అంచనా వేస్తున్నాం. బస్సులు మంజూరు చేయాలని ఆర్టీసీ ఎమ్‌డీకి లేఖ రాయగా.. ఆంక్షలు పెడుతున్నారు. ఆర్డీవోలపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి.. ప్రైవేటు బస్సులను కూడా వినియోగించకుండా ఉండేందుకు కుట్రలకు పాల్పడుతోంది. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే నాటుబళ్లు, ట్రాక్టర్లు, సైకిళ్లతో సభకు తరలిరావాలి’ అని ప్రజలు, పార్టీ శ్రేణులు, అభిమానులకు అచ్చెన్న పిలుపునిచ్చారు. యువగళం పాదయాత్రకు ప్రజలు నీరాజనం పడుతుండడంతో ప్రభుత్వంలో వణుకు తీవ్రమైందని వెల్లడించారు.
- ‘వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. రాజధాని కూడా ఏదో చెప్పుకోలేని దుస్థితికి దిగజార్చారు. జిల్లాలో టీడీపీ హయాంలో భావనపాడు పోర్టుకు టెండర్లు పిలిచ్చే వాటిని రద్దు చేశారు. ఇప్పుడు సొంత మనషులకు కాంట్రాక్ట్ పనులు అప్పగించుకున్నారు. టీడీపీ హయాంలో 84 శాతం పూర్తిచేసిన వంశధార ప్రాజెక్టు పనులను.. ఈ నాలుగున్నరేళ్లలో ఐదు శాతం కూడా పూర్తిచేయలేదు. సీఎం జగన్ ఇప్పటివరకూ సాధించింది ఏమీ లేకపోయినా.. రాష్ట్రం అభివృద్ధి చెందిందంటూ యాత్రలు నిర్వహిస్తుండడం విడ్డూరంగా ఉంది. వైసీపీ పాలనలో ఉత్తరాంధ్రకు చేసిన మేలు శ్వేతపత్రం విడుదల చేయాల’ని అచ్చెన్న డిమాండ్ చేశారు. ‘వంద రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించినా టీడీపీ-జనసేన అధికారంలోకి రావడం ఖాయం’ అని స్పష్టం చేశారు. సమావేశంలో టీడీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, మాజీఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, కలమట వెంకటరమణ, బగ్గు రమణమూర్తి, అన్ని నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - Dec 18 , 2023 | 12:15 AM