తెలంగాణ ఫలితాలతో.. వైసీపీలో గుబులు
ABN, First Publish Date - 2023-12-04T00:34:58+05:30
తెలంగాణ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో.. వైసీపీ నేతలు గుబులు రేగుతోంది. నెలరోజుల కిందట తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని, మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే కొనసాగుతుందని వైసీపీ నేతలు భావించారు.
- ఇక్కడా అధికారం మారుతుందేమోనని అంతర్మథనం
- మార్పు తప్పదంటున్న తెలుగుతమ్ముళ్లు
- రానున్న ఎన్నికల్లో టీడీపీదే విజయమని ఆశాభావం
(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)
తెలంగాణ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో.. వైసీపీ నేతలు గుబులు రేగుతోంది. నెలరోజుల కిందట తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని, మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే కొనసాగుతుందని వైసీపీ నేతలు భావించారు. ఈసారి బీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ తప్పదని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ చెప్పినా కొట్టిపారేశారు. కేసీఆర్ వ్యూహానికి అడ్డు ఉండదని... ఇక్కడి మాదిరిగా సంక్షేమ పథకాల పేరిట డబ్బులు పంచే కార్యక్రమాలు అక్కడ అమలవుతున్నాయని... అవన్నీ ఓట్ల రూపంలో బీఆర్‌ఎస్‌కు వస్తాయని అనుకున్నారు. కానీ ఆదివారం వెలువడిన ఎన్నికల ఫలితాలు ఖంగు తినిపించాయి. బీఆర్‌ఎస్‌ను ఓడించి.. కాంగ్రెస్‌పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. దీంతో అవే ఫలితాలు ఆంధ్రాలోనూ పునరావృతమవుతాయని, వైసీపీని సాగనంపి.. ప్రజలు టీడీపీని ఆదరిస్తారని తెలుగు తమ్ముళ్లు సంబరపడుతున్నారు. అదే నిజమవుతుందేమోనని వైసీపీ నేతలు గుబులు చెందుతున్నారు. తెలంగాణలో ప్రతిపక్షనాయకుల ఇళ్లల్లో సోదాలు.. కేసులు వంటివి నమోదైనా ఓటింగ్ చెక్కు చెదరలేదు. ఇక్కడ కూడా మాజీముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్ట్ నుంచి నిరసనల విషయంలోనూ అధికార పార్టీనేతలు విమర్శలు చేశారు. అక్కడ సీన్ మారింది. అక్రమాలన్నీ బయటకు తీస్తామని.. ఎవరినీ విడిచిపెట్టబోమని కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు. అదేరీతిన కొద్దినెలల్లో ఇక్కడ ఎన్నికలు జరుగనున్నాయి. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో అధికార పార్టీపై ఇప్పటికే అత్యధిక మంది ప్రజల్లో వ్యతిరేక భావన ఏర్పడింది. ఇప్పుడు అదే కొంపముంచుతుందేమోనని.. తెలంగాణ మాదిరి ఇక్కడ కూడా అధికారం మారితే.. తమ పరిస్థితేంటని వైసీపీ నేతలు మథనపడుతున్నారు. ఈసారి అధికారం చేజారితే తమ అక్రమాలు బయటపడే అవకాశం ఉందని, ప్రస్తుతం ప్రతిపక్షం ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ తాము కూడా రుచిచూడాల్సి ఉంటుందని భీతి చెందుతున్నట్లు తెలుస్తోంది.
జిల్లా విషయానికొస్తే... ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఈ పదిహేను రోజుల వ్యవధిలో శంకుస్థాపనలు హడావిడి మొదలైంది. నాలుగున్నరేళ్లు వదిలేసి.. ఇప్పుడు అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందులో ఆమదాలవలస-శ్రీకాకుళం రోడ్డు, ఫిషింగ్ హార్బర్, కేఆర్ స్టేడియం, ఎత్తిపోతల పథకాలు.. ఇలాంటివన్నీ వాటిపై దృష్టి పెట్టారు. ఇదిలా ఉండగా.. జిల్లాలో ఇసుకరీచ్‌ల వద్ద అధికార పార్టీనేతల దందా నడుస్తోంది. రద్దుచేసిన పాత ఏజెన్సీతోనే బిల్లులు ఇచ్చేస్తున్నారు. అధికారులు సైతం అడ్డగించలేని స్థితిలో ఉన్నారు. గ్రామాల్లో బెల్ట్ దుకాణాలు ఉన్నాయి.. 2024 ఎన్నికల నాటికి మద్యం దుకాణాలు లేకుండా చేసి ఓట్లను అడుగుతానని పాదయాత్రలో జగన్మోహనరెడ్డి ప్రకటించారు. ఇప్పుడు మద్యం దుకాణాలు పుష్కలంగా ఉన్నాయి. బ్రాండెడ్ మద్యం కంటే.. వేర్వేరు కంపెనీలకు చెందినవే లభ్యమవుతున్నాయి. ఇక సర్వేల విషయంలోనూ కీలక నాయకులు వెనుకంజలోనే ఉన్నారు. 2019లో హవా... ఇప్పుడు కుదరదు. తెలంగాణ ప్రజల ఇచ్చినట్లే.. రానున్న ఎన్నికల్లో ఆంరఽధా ప్రజలు తీర్పు ఇస్తారని.. తెలుగు తమ్ముళ్లు ఆనందంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో తమకు ఎదురీత తప్పదని అధికార పార్టీనాయకులు భావిస్తున్నారు.
ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో కాంగ్రెస్ సంబరాలు
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించడంతో జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఆదివారం శ్రీకాకుళంలోని ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో డీసీసీ అధ్యక్షుడు పేడాడ పరమేశ్వరరావు ఆధ్వర్యంలో మిఠాయిలు పంచారు. కాంగ్రెస్ పార్టీ వర్థిల్లాలంటూ నినాదాలు చేశారు. అనంతరం పరమేశ్వరరావు మాట్లాడుతూ.. తెలంగాణలోని ఫలితాలే ఆంధ్రాలోనూ పునరావృతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో తమ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు, పార్టీ శ్రేణుల క్రమశిక్షణ ఈ విజయానికి కారణమన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే విభజన హామీలు అమలవుతాయని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు డి.గోవింద మల్లిబాబు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రెల్ల సురేష్, వివిధ విభాగాల నాయకులు కేవీఎల్, ఎస్.ఈశ్వరి, తెంబురు మధుసూదన్‌రావు, ఎస్.శ్యామసుందరరావు, కొత్తకోట సింహాద్రి నాయుడు, లక్ష్మీ పాల్గొన్నారు.
Updated Date - 2023-12-04T00:34:59+05:30 IST