ఎందుకింత నిర్లక్ష్యం?
ABN, First Publish Date - 2023-12-04T00:30:19+05:30
ఓటర్ల నమోదు, జాబితాలో మార్పులు, చేర్పులపై అప్రమత్తంగా ఉండాలని పదేపదే చెబుతున్నా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ బీఎల్‌వోల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
- బీఎల్‌వోల పనితీరుపై కలెక్టర్ ఆగ్రహం
- 7వ పోలింగ్ కేంద్రం బీఎల్‌వో సస్పెండ్‌కు ఆదేశం
పలాస/ కాశీబుగ్గ, డిసెంబరు 3: ఓటర్ల నమోదు, జాబితాలో మార్పులు, చేర్పులపై అప్రమత్తంగా ఉండాలని పదేపదే చెబుతున్నా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ బీఎల్‌వోల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన కాశీబుగ్గ 7వ పోలింగ్ కేంద్రం బీఎల్‌వో సీహెచ్ యుగంధర్‌ను సస్పెండ్ చేయాలని తహసీల్దార్ ఎల్.మధుసూదన్‌రావుకు ఆదేశించారు. ఆదివారం పలాస ఉన్నత పాఠశాలలో 64, 65, 74, 75 పోలింగ్ కేంద్రాలు, కాశీబుగ్గ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 4,5,6,7,16,17 పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. 7వ పోలింగ్ కేంద్రం బీఎల్‌వో సీహెచ్ యుగంధర్ వద్ద ఉన్న ఓటరు జాబితా పూర్తిస్థాయిలో లేకపోవడం, జాబితాలో చాలామంది ఓటర్ల ఫొటోలు తిరగబడడం తదితర అంశాలను గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. తక్షణమే ఆయనను సస్పెండ్ చేసి కొత్త బీఎల్‌వోను నియమించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ‘ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులపై జిల్లాలోని 2,357 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 9 వరకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నాం. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈ నెల 9 తర్వాత కూడా తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. 18 ఏళ్లు నిండిన వారంతా ఓటర్లుగా నమోదు కావాలి. ఓటర్ల నమోదుపై ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా రాజకీయపార్టీలు ఫిర్యాదు చేయాలి. జిల్లాలో ఒకే ఇంటి నెంబర్‌తో 8వేల ఓట్లు ఉన్నట్టు గుర్తించాం. వాటిలో వివిధ ఓట్లను తొలగించాం. ఇప్పటికి 222 ఓట్లు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని కూడా సరిచేసే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు’ అని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో భరత్ నాయక్, ఎలక్షన్ డీటీ రాంబాబు, ఆర్‌ఐ నిరంజన్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2023-12-04T00:30:20+05:30 IST