వామ్మో.. పోర్టు వాహనాలు
ABN, Publish Date - Dec 24 , 2023 | 12:30 AM
పోర్టు వాహనాలు వస్తున్నాయంటే చాలు.. టెక్కలి ప్రాంత ప్రజలు హడలిపోతున్నారు. సంతబొమ్మాళి మండలంలో మూలపేట గ్రీన్‌ఫీల్ట్ పోర్టు నిర్మాణ పనులకు సంబంధించి పలు రకాల టిప్పర్లతో గ్రానైట్ క్వారీలలో మిగిలిన వేస్ట్ మెటీరియల్ రాళ్లను తరలిస్తున్నారు.
- పరిమితికి మించి లోడుతో రాకపోకలు
- రాళ్లు పడి.. తరచూ ప్రమాదాలు
- భయాందోళనలో ప్రజలు
(టెక్కలి)
- టెక్కలి-తెంబూరు రోడ్డు జంక్షన్ సమీపంలో ఈ నెల 17న సాయంత్రం గ్రానైట్ వేస్ట్ రాళ్లతో వెళ్తున్న మూలపేట పోర్టు వాహనం(టిప్పర్) వెనుక చక్రం ఊడింది. పక్కనే ఆగి ఉన్న ఓ కారును ఆ చక్రం గుద్దడంతో.. కారు ముందు భాగం నుజ్జయింది.
......................
- ఇటీవల ఎన్‌ఎం రోడ్డులో చిన్ననారాయణపురం వద్ద ఓ టిప్పర్ వాహనం నుంచి ఒక రాయి జారిపడి వెనుక నుంచి వస్తున్న కారుకు తగిలింది. దీంతో కొంతమేర కారు దెబ్బతింది. కారులో ప్రయాణిస్తున్న వారు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
......................
- రెండు నెలల కిందట టెక్కలి శ్రీరామా కాలనీకి చెందిన కెల్లి చంద్రశేఖర్‌ను పోర్టు వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
......................
- కొన్నాళ్ల కిందట సంతబొమ్మాళి మండలం సీతాపురం గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా పోర్టు వాహనం ఢీకొంది. దీంతో కాళ్లు నుజ్జయి.. దివ్యాంగుడిగా మారాడు.
......................
పోర్టు వాహనాలు వస్తున్నాయంటే చాలు.. టెక్కలి ప్రాంత ప్రజలు హడలిపోతున్నారు. సంతబొమ్మాళి మండలంలో మూలపేట గ్రీన్‌ఫీల్ట్ పోర్టు నిర్మాణ పనులకు సంబంధించి పలు రకాల టిప్పర్లతో గ్రానైట్ క్వారీలలో మిగిలిన వేస్ట్ మెటీరియల్ రాళ్లను తరలిస్తున్నారు. ఈ వాహనాలు పరిమితికి మించిన లోడుతో.. మితిమీరిన వేగంతో రాకపోకలు సాగిస్తుండడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. టెక్కలి చుట్టుపక్కల ఉన్న పలు గ్రానైట్ క్వారీల నుంచి రోజూ వందలాది టిప్పర్లతో రాళ్లను తరలిస్తున్నారు. టెన్ టైర్, 12 టైర్, 14 టైర్ టిప్పర్‌లు, వాల్వా రకం టిప్పర్, పలు రకాల వాహనాలు 28 నుంచి 40టన్నుల వరకు తీసుకెళ్లాల్సి ఉంది. కానీ పరిమితికి మించిన ఓవర్‌లోడుతో గ్రానైట్ వేస్ట్ రాళ్లను పోర్టుకు తరలిస్తున్నారు. టెక్కలిలో పాఠశాలలు, కళాశాలలు, మార్కెట్ రద్దీ సమయాల్లోనూ, ఉద్యోగుల రాకపోకల వేళల్లో వాహనాలు అతివేగంగా వెళ్తుండడం మరింత భయం కలిగిస్తోంది. మరోవైపు ట్రాఫిక్ అంతరాయం నెలకొంటోంది. స్థానిక ఇందిరాగాంధీ కూడలి, టెక్కలి-తెంబూరు రోడ్డు జంక్షన్, పాతబస్టాండ్, అంబేద్కర్ కూడలి, ఎన్‌ఎం రోడ్డు ప్రాంతాల్లో గోతులు ఏర్పడి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పలువురు మృతి చెందగా, కొందరు గాయాల బారిన పడుతున్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
కేసులు నమోదు చేస్తున్నాం
ఓవర్‌లోడుతో గ్రానైట్ వేస్ట్‌రాళ్లను తరలిస్తున్న వాహనాలపై కేసులు నమోదు చేస్తున్నాం. ఇప్పటికే కొన్ని వాహనాలు సీజ్ చేశాం. రద్దీ సమయాలను దృష్టిలో పెట్టుకుని రాకపోకలు సాగించాలని వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నాం. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం.
- చంద్రమౌళి, సీఐ, టెక్కలి
Updated Date - Dec 24 , 2023 | 12:30 AM