నీరూ లేదు... కరెంటూ లేదు..
ABN, First Publish Date - 2023-12-11T00:34:27+05:30
హుద్‌హుద్ ఇళ్లలో కనీస సౌకర్యాలు లేక లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టెక్కలి గోపినాథపురం సమీపంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో హుద్‌హుద్ ఇళ్లను నిర్మించారు
- ఇళ్లు ఇచ్చారు... సదుపాయాలు మరిచారు
- హుద్‌హుద్ గృహాల్లో కనీస సౌకర్యాలు కరువు
- విరిగిపోయిన అద్దాలు, తలుపులు
- లబ్ధిదారుల ఆగ్రహం
(టెక్కలి రూరల్)
- టెక్కలి చిన్నబజారు సమీపంలో నివాసముంటున్న ఒక మహిళకు టెక్కలిలోని హుద్‌హుద్ కాలనీలో అధికారులు ఇల్లు కేటాయించారు. దీంతో ఆ మహిళ ఆనందంతో ఆ ఇంటిని సందర్శించింది. అయితే అక్కడి పరిస్థితిని చూసి ఖంగుతింది. ఇల్లు పూర్తిగా అధ్వానంగా ఉంది. ఇంటి లోపల మద్యం సీసాలు పగిలి ఉన్నాయి. కిటికీ అద్దాలు, స్విచ్ బోర్డులు విరిగిపోయి కనిపించాయి. తాగునీటి సదుపాయం కానీ, విద్యుత్ సదుపాయం కానీ లేకపోవడంతో ఆ మహిళ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
.................
- టెక్కలికి చెందిన ఓ వితంతువు తనకు మంజూరైన హుద్‌హుద్ ఇంటిని చూసేందుకు వెళ్లింది. అక్కడ ఇంటి తలుపులు, కిటికీలు విరిగిపోయి ఉన్నాయి. లోపల కనీసం అడుగు పెట్టడానికి కూడా వీలులేకుండా గాజుపెంకులు దర్శనమిచ్చాయి. మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. దీంతో ఏంచేయాలో పాలుపోని ఆ మహిళ అక్కడ నుంచి వెనుదిరిగింది.
.................
హుద్‌హుద్ ఇళ్లలో కనీస సౌకర్యాలు లేక లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టెక్కలి గోపినాథపురం సమీపంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో హుద్‌హుద్ ఇళ్లను నిర్మించారు. వీటిని లబ్ధిదారులకు కేటాయించే సమయంలో సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా ఈ ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల టెక్కలి సబ్‌కలెక్టర్ నూరుల్‌కమర్ ఆదేశాల మేరకు హుద్‌హుద్ కాలనీలోని సుమారు 192 ఇళ్లకుగాను అధికారులు 92 గృహా లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. దీంతో ఎంతో సంతోషంగా అక్కడకు వెళ్తున్న లబ్ధిదారులు తమ ఇళ్లను చూసి ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కాలనీలో పూర్తిస్థాయిలో విద్యుత్, తాగునీటి సౌకర్యం లేదు. ఇళ్లు పూర్తిగా అధ్వానంగా ఉన్నాయి. తలుపులు, కిటికీలు విరిగిపోయాయి. విద్యుత్ మీటర్లు సైతం లేవు. ఇళ్ల లోపల బ్రాందీ సీసాల ముక్కలు, కాల్చిన సిగరెట్ పీకలు, చెత్తాచెదారంతో దర్శనమిస్తున్నాయి. కనీసం ఇళ్లను శుభ్రం చేసుకునేందుకు దగ్గరలో నీటి వనరులు కూడా లేకపోవడంతో లబ్ధిదారులు అధికారులపై మండిపడుతున్నారు. 2014లో వచ్చిన హుద్‌హుద్ తుఫాన్‌కు ఇళ్లను కోల్పోయామని, అప్పటి నుంచి అద్దె కొంపల్లో గడుపుతున్నామని, నాలుగున్నరేళ్ల నిరీక్షణ అనంతరం అధికారులు కేటాయించిన హుద్‌హుద్ ఇళ్లు నివాసయోగ్యంగా లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా కొన్నినెలల కిందట కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కాలనీలో ఏడు కుటుంబాలకు ఇళ్లు కేటాయించారు. కానీ, ఇప్పటివరకు వారికి ఇంటి పత్రాలు ఇవ్వలేదు. ఇక్కడ ఉన్న 192 ఇళ్లకు గానూ మొదటి విడతగా 92గృహాలను అధికారులు కేటాయించారు. మిగతా ఇళ్ల పంపిణీకి సంబంధించి లబ్ధిదారుల వివరాల కోసం సర్వే చేపడుతున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి సమన్వయంతో పంపిణీకి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రతిపాదనలు పంపించాం
టెక్కలిలోని హుద్‌హుద్ ఇళ్ల మరమ్మతుల కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం.
- వి.నర్సింగరావు, గృహ నిర్మాణ శాఖ డీఈఈ, టెక్కలి
Updated Date - 2023-12-11T00:34:28+05:30 IST