ప్రాధాన్య భవనాలకూ.. నిధుల కొరతే!
ABN, Publish Date - Dec 18 , 2023 | 12:15 AM
వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఎంతో గొప్పగా చెప్పుకునే అభివృద్ధి పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి. గ్రామ గ్రామాన మంజూరు చేసిన ప్రాధాన్య భవనాల నిర్మాణాలపై నీలినీడలు కమ్ముకున్నాయి.
- నిలిచిన సచివాలయాలు, ఆర్బీకేలు నిర్మాణాలు
- అసంపూర్తిగా పాల కేంద్రాల, డిజిటల్ లైబ్రరీలు
- బిల్లుల కోసం ఎదురుచూపులు
(ఇచ్ఛాపురం రూరల్)
వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఎంతో గొప్పగా చెప్పుకునే అభివృద్ధి పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి. గ్రామ గ్రామాన మంజూరు చేసిన ప్రాధాన్య భవనాల నిర్మాణాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. అభివృద్ధితోపాటు సుపరిపాలనే ప్రధాన లక్ష్యంగా గ్రామాల్లో సచివాలయం, రైతుభరోసా కేంద్రం(ఆర్బీకే), హెల్త్‌క్లీనిక్, బల్క్‌మిల్క్ కూలింగ్ యూనిట్లతో పాటు కొన్ని ప్రాంతాల్లో డిజిటల్ గ్రంథాలయాలు, అంగన్‌వాడీ కేంద్ర నిర్మాణాలను చేపట్టింది. ప్రభుత్వ ప్రాధాన్య భవనాల పేరుతో పెద్ద సంఖ్యలో చేపట్టాల్సిన ఈ భవన నిర్మాణాలకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం నిధులను వెచ్చించాల్సి ఉంది. కాగా ప్రస్తుతం నిధుల కొరత కారణంగా పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
ఆది నుంచి అస్తవ్యస్తమే..
జిల్లాలో ఐదు కేటగిరీల్లో 2,230 భవనాలు మంజూరయ్యాయి. వాటిలో ఒక్కో సచివాలయ భవనానికి రూ.40 లక్షలు, ఆర్బీకేకు రూ.21.80 లక్షలు, వైఎస్సార్ హెల్త్‌క్లీనిక్‌కు రూ.17.50 లక్షలు మంజూరు చేశారు. ఇప్పటివరకు కేవలం 799 భవనాలు మాత్రమే పూర్తి చేశారు. ఉపాధిహామీ నిధులతో చేపట్టే పనులకు 60 శాతం లేబర్, 40శాతం మెటీరియల్ కాంపొనెంట్‌తో అంచనాలు రూపొందించాలన్న నిబంధనలను అధికారులు గాలికొదిలేశారు. ఉపాధి నిధులతో చేపట్టాల్సిన పనులను.. అదే ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాలన్న విషయాన్ని పట్టించుకోలేదు. పనుల విషయంలో పెద్ద ఎత్తున అంచనాలు రూపొందించి అనుమతులు ఇచ్చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నగదు చెల్లింపులు ఉండటంతో గ్రామ పంచాయతీ ఖాతాల ద్వారా వినియోగించాల్సిన నిధులను కేంద్రమే చెప్పుచేతల్లో పెట్టుకుంది. దీంతో కొన్నిచోట్ల పాఠశాలల ప్రాంగణాలు, వివాదాస్పద స్థలాల్లో చేపట్టిన నిర్మాణాలు నిలిచిపోయాయి. భవన నిర్మాణాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అధికారపార్టీ ప్రజా ప్రతినిధులు పనులు చేపట్టే బాధ్యతను తమ అనుచరులకు అప్పగించారు. ఎంతో కొంత ఆర్థిక లబ్ధి చేకూరుతుందనే ఆశతో పనులు ప్రారంభించిన వారికి బిల్లులు సకాలంలో మంజూరు కావడంలేదు. పనుల్లో జాప్యం కారణంగా నిర్మాణ సామగ్రి ధరలు బాగా పెరిగిపోవడంతో కొందరు ఈ పనులు మధ్యలోనే నిలిపివేశారు.
అయోమయంలో కాంట్రాక్టర్లు
పనులను అంతంత్య ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని కలెక్టర్ పలుమార్లు నిర్వహించిన సమీక్షల్లో అధికారులను ఆదేశించారు. పనుల్లో ఆశించిన ప్రగతి కనబరచని సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కొందరిని సస్పెండ్ కూడా చేశారు. దీంతో పనులు వేగవంతం చేసేందుకు మండలస్థాయి అధికారులు చర్యలు చేపట్టినా బిల్లుల చెల్లింపుల్లో జాప్యం కారణంగా మధ్యలోనే నిలిచిపోయాయి. లక్ష్యాల మేరకు పనులు జరగవని నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం ఇప్పటివరకు ప్రారంభంకాని, పునాది లోపల, పునాదిస్థాయి దాటని పనులను పూర్తిగా నిలిపి వేయాలని ఈ ఏడాది జూన్‌లో ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి వివిధ దశలలో ఉన్న పనులు కూడా ముందుకు సాగడం లేదు. ఇప్పటివరకు చేపట్టిన పనులకు బిల్లులు ఎప్పుడు మంజూరవుతాయో తెలియక కాంట్రాక్టర్లు అయోమయం చెందుతున్నారు.
ప్రజలకు అందుబాటులోకి తెస్తాం :
ప్రస్తుతం శ్లాబు దశలో ఉన్న భవనాలతో పాటు శ్లాబు పూర్తయిన పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. వచ్చే ఏడాది మార్చి నాటికి భవనాలు పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశాం.
- వీఎస్‌ఎన్ మూర్తి, పంచాయతీ రాజ్ ఎస్‌ఈ, శ్రీకాకుళం
................
జిల్లాలో ఇదీ పరిస్థితి..
భవన నిర్మాణం మంజూరు పూర్తి వివిధ దశల్లో ఉన్నవి
గ్రామ సచివాలయాలు 656 384 270
రైతు భరోసా కేంద్రాలు 650 271 379
హెల్త్ క్లీనిక్‌లు 535 144 391
బల్క్ బిల్క్ యూనిట్లు 194 0 22
డిజిటల్ గ్రంథాలయాలు. 194 0 26
Updated Date - Dec 18 , 2023 | 12:15 AM