కొండలు కరుగుతున్నాయ్!
ABN, First Publish Date - 2023-12-04T00:32:57+05:30
వజ్రపుకొత్తూరు మండలంలోని అనంతగిరి పంచాయతీ పరిధిలో అధిక విస్తీర్ణంలో కొండలు ఉన్నాయి. ఈ కొండలపై స్థానిక నాయకుల కన్ను పడింది. వివిధ పార్టీలకు చెందిన ఆరుగురు నాయకులు ఒక్కటై యథేచ్ఛగా కొండలను తవ్వేసి రాళ్లు, కంకరను అమ్ముకుంటున్నారు.
- అనంతగిరిలో అక్రమంగా తవ్వకాలు
- యథేచ్ఛగా రాళ్లు, కంకర తరలింపు
- ఆరుగురు నాయకులు ఏకమై దందా
- పట్టించుకోని అధికారులు
(వజ్రపుకొత్తూరు)
అనగనగా ఓ ఊరు. ఆ ఊరు చుట్టూ సహజ సిద్ధంగా ఏర్పడిన అందమైన కొండలు ఉన్నాయి. ఈ కొండలపై ఓ ఆరుగురు నాయకుల కళ్లు పడ్డాయి. ఎవరికైనా రాళ్లు, కంకర, మట్టి కావాలంటే క్షణాల్లో ఎక్స్‌కవేటర్లు, ట్రాక్టర్లతో అక్కడ వాలిపోతారు. రాత్రి, పగలూ తేడాలేకుండా కొండలను తవ్వి రాళ్లు, కంకరను తరలించుకుపోతారు. ఒక్కో లోడును రూ.500 విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటివరకు వీరి అక్రమార్జన రూ.30లక్షలు పైమాటే. పైగా కొండలను తవ్వి ఆ స్థలాలను ఇస్తామని చెప్పి కొందరి నుంచి డబ్బులు కూడా వసూలు చేస్తున్నారు. అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇంకేముంది వారి వ్యాపారం మూడు ట్రాక్టర్లు.. ఆరు లోడ్లుగా సాగిపోతుంది. దీనిపై టీడీపీ నాయకులు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు.
..................
వజ్రపుకొత్తూరు మండలంలోని అనంతగిరి పంచాయతీ పరిధిలో అధిక విస్తీర్ణంలో కొండలు ఉన్నాయి. ఈ కొండలపై స్థానిక నాయకుల కన్ను పడింది. వివిధ పార్టీలకు చెందిన ఆరుగురు నాయకులు ఒక్కటై యథేచ్ఛగా కొండలను తవ్వేసి రాళ్లు, కంకరను అమ్ముకుంటున్నారు. చుట్టుపక్కల ఎవరు రియల్‌ఎస్టేట్ వెంచరు వేసినా రాళ్లు, కంకర, మట్టి కావాలంటే ఈ ఆరుగురిని సంప్రదించాల్సిందే. వెంటనే వీరు తమ ఎక్స్‌కవేటర్లు, ట్రాక్టర్లతో కొండల వద్దకు చేరుకుంటారు. రాళ్లు, కంకర, మట్టిని తవ్వి రియల్‌ఎస్టేట్ వెంచర్లకు తరలించి పెద్దమొత్తంలో సొమ్ములు వసూలు చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ట్రాక్టరు లోడును రూ.500కు విక్రయిస్తున్నారు. ఇప్పటివరకు రూ.30లక్షల వరకు సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరుగురిలో ఒకరు కొండకు సమీపంలో స్థలం కొనుగోలు చేసి దాన్ని ఎత్తు చేసేందుకు 500 కంకర లోడ్లు తరలించినట్లు స్థానికులు తెలుపుతున్నారు. కానీ ప్రభుత్వానికి ఒక్కరూపాయి కూడా చెల్లించలేదు. ముఖ్యంగా రాత్రి వేళల్లో కొండల తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. మరోపక్క కొండలు మొత్తం తవ్విన తరువాత ఆ ఖాళీ స్థలాలను ఇళ్ల స్థలాలుగా అందిస్తామని చెప్పి కొందరి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. లబ్ధిదారులను కూడా వీరే ఎంపిక చేసి మొదటి విడతగా ఒక్కొక్కరి నుంచి రూ.15వేలు వరకు వసూలు చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు కనీసం స్పందించకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
.......................
పోరాటం చేస్తాం
అనంతగిరి పంచాయతీలో అధికారపార్టీ అండదండలతో కొండలను తవ్వుతున్న వారిపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలి. అవరమైతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం. అప్పటికీ చర్యలు లేకుంటే న్యాయ పోరాటం చేస్తాం. ప్రకృతి సంపదను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. కొండవద్ద 120 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి ప్రజల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్నారు. ఈ దోపిడీని అధికారులు అడ్డుకోవాలి.
- మరడ ధుర్యోధనరెడ్డి, తెలుగు యువత మండల అధ్యక్షుడు, వజ్రపుకొత్తూరు
.......................
అధికారుల తీరు బాధాకరం
అనంతగిరి పంచాయతీలోని కొండలను అనాధికారికంగా తవ్వుతున్నా అధికారులు స్పందించకపోవడం చూస్తుంటే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం కొండల వద్దకు వచ్చి పరిశీలన చేయకపోవడం బాధాకరం. ఇప్పటికైనా అధికారులు స్పందించి అనధికార తవ్వకాలపై చర్యలు చేపట్టాలి. అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
- నీలాపు వెంకటరెడ్డి, అనంతగిరి పంచాయతీ టీడీపీ ఉపాధ్యక్షుడు
.......................
చర్యలు తీసుకుంటాం
రెవెన్యూ అధికారులతో కలిసి కొండలను పరిశీలిస్తాం. అనంతరం చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిస్తాం. ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా తవ్వకాలు చేపట్టడం నేరం. తవ్వకాల కోసం అధికారుల అనుమతితో పాటు నిర్ణీత రుసుం ప్రభుత్వానికి చెల్లించాలి. ఇంటి స్థలాల విషయమై నన్ను ఎవరూ సంప్రదించలేదు. మ్యాన్యువల్‌గా ఇంటి స్థలాలు ఇచ్చే అవకాశంలేదు.
-బి.అప్పలస్వామి, తహసీల్దార్, వజ్రపుకొత్తూరు
Updated Date - 2023-12-04T00:32:58+05:30 IST