ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

శంకుస్థాపనలు సరే.. పూర్తి చేసేదెన్నడు?

ABN, Publish Date - Dec 14 , 2023 | 12:38 AM

పలాస నియోజకవర్గాన్ని ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి. నియోజకవర్గాన్ని తాము అభివృద్ధి చేస్తామని వైసీపీ నేతలు ప్రకటించారు.

పలాసలో ఉద్దానం నీటి పథకం

- పలాస నియోజకవర్గంలో సమస్యలెన్నో?

(పలాస)

పలాస నియోజకవర్గాన్ని ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి. నియోజకవర్గాన్ని తాము అభివృద్ధి చేస్తామని వైసీపీ నేతలు ప్రకటించారు. కానీ, సమస్యల పరిష్కారంపై కనీనస్థాయిలో దృష్టి సారించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం పలాస-కాశీబుగ్గలో సీఎం జగన్‌ పర్యటించనున్న నేపథ్యంలో ఆయనపై ప్రజలు గంపెడాశతో ఉన్నారు. తమ సమస్యలపై దృష్టి సారించాలని కోరుతున్నారు.

- రైల్వే ఫ్లైఓవర్‌ వంతెనకు మోక్షం లభించేనా?

2009 ఫిబ్రవరి 22న పలాస-చిన్నబడాం రైల్వే ఫ్లైఓవర్‌ వంతెన నిర్మాణానికి అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న దివంగతనేత హనుమంతు అప్పయ్యదొర శంకుస్థాపన చేశారు. వివిధ కారణాలతో ఇప్పటికీ నిర్మాణం పూర్తికాలేదు. దీనిని తామే నిర్మిస్తామని చెప్పి.. రెండేళ్ల కిందట మంత్రి సీదిరి అప్పలరాజు మరోసారి శంకుస్థాపన చేశారు. కానీ బడ్జెట్‌ అంచనా పెరగడంతో, నిధుల కొరత కారణంగా పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఈ వంతెన లేక వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యమంత్రి స్పందించి నిధులు విడుదల చేస్తేనే పనులు పూర్తయ్యే అవకాశం ఉంది.

- అతీగతి లేని ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌:

పలాస మండలం రేగులపాడు వద్ద 2008లో దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేశారు. పలాస, వజ్రపుకొత్తూరు, నందిగాం, టెక్కలి, మెళియాపుట్టి మండలాల పరిధిలో సుమారు 25వేల ఎకరాలకు సాగునీరందించాలనే ఉద్దేశంతో.. రూ.123 కోట్ల వ్యయంతో దీని నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నిధులు సకాలంలో విడుదల కాక పనులు ఆగిపోయాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.550కోట్లు నిధులు మంజూరు చేస్తూ.. పరిపాలన ఆమోదం తెలిపారు. కానీ ఎన్నికలు వచ్చాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రిజర్వాయర్‌ను తామే నిర్మిస్తామని చెబుతూ సీఎం జగన్‌ రూ.850 కోట్ల నిధులకు ఆమోదాన్ని తెలిపారు. నాలుగున్నరేళ్లలో రూ.కోటి విలువైన పనులు కూడా జరగకపోవడంతో ఆఫ్‌షోర్‌ రిజర్యాయర్‌ నిర్మాణంపై నీలినీడలు అలుముకున్నాయి. నిర్వాసితులకు ఇచ్చిన కాలనీలో కూడా మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. వీటిపై సీఎం జగన్‌ దృష్టి సారించాల్సి ఉంది.

- వంశధార కాలువకు నిధులెప్పుడో?

వంశధార శివారు భూములకు నీరు విడుదలై ఐదేళ్లవుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చుక్క నీరు కూడా విడుదల కాకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో వంశధార నీటి ద్వారా 9వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. శివారు ప్రాంతాలు కావడంతో ముందుగా ఇక్కడ నీరు వచ్చిన తరువాతే ఎగువ ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంది. అధికారులు తప్పిదాలు, ప్రభుత్వం పట్టించుకోని కారణంగా నీరు రావడం లేదని రైతుల వాదన. ప్రస్తుతం వంశధార కాలువకు మరమ్మతులు లేకపోవడంతో నీరు విడుదలైనా ఎక్కడ నీరు అక్కడే ఆగిపోతుందని అధికారులే చెబుతున్నారు. కనీసం రూ.100 కోట్లు విడుదల చేసి లైనింగ్‌ పనులు చేస్తేనే వంశధార నీటికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ప్రస్తుతం కాలువ కప్పబడిపోయి అనేక ప్రాంతాల్లో మురుగునీరు ప్రవహిస్తోంది. పనుల నిర్వహణకు నిధులు విడుదల చేయాల్సి ఉంది.

- ఏహెచ్‌పీ గృహాలు పూర్తి చేసేదెన్నడో..!

టీడీపీ హయాంలో పట్టణ పేదల కోసం టాటా కంపెనీతో ఏహెచ్‌పీ గృహాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 80 శాతం నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇంతలో వైసీపీ అధికారంలోకి రావడంతో ఈ గృహాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో నిర్మాణాలు ఆపేశారు. ఆంక్షలు తొలగించిన అనంతరం వీటిని లబ్ధిదారులకు నిబంధనల మేరకు ఇవ్వడానికి శ్రీకారం చుట్టారు. పలాసలో గతంలో 1950 గృహాలు మంజూరు కాగా, నిర్వాసితుల నుంచి రూ.25వేలు, రూ.50వేలు, రూ.లక్ష చొప్పున డీడీలు తీసుకున్నారు. ప్రస్తుతం నిర్మాణం జరిగిన గృహాలనే ఇస్తామని, మిగిలినవి రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కేవలం 950 మందికి మాత్రమే గృహ యోగం కలిగింది. మిగిలిన లబ్ధిదారులకు స్థలాలు ఇస్తామని చెప్పి మొండిచేయి చూపించారు. ఇప్పటివరకూ వారికి డీడీలు ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా గృహయోగం కలిగిన వారికి కూడా ఇప్పటివరకూ వాటిని అప్పగించలేదు. ప్రసుతం గృహాలు లేకపోయినా బ్యాంకులో తీసుకున్న రుణాలకు వడ్డీలు కట్టాల్సి వస్తోంది. దీంతో గృహాలు పొందినవారంతా లబోదిబో మంటున్నారు. మరో ఏడాదైనా ఏహెచ్‌పీ గృహాలు పూర్తయ్యే సూచనలు కనిపించకపోవడంతో వారంతా నిరాశతో ఉన్నారు.

- కొత్త పారిశ్రామికవాడ ఎప్పుడో..!

పలాస-కాశీబుగ్గ జంటపట్టణాల్లో ప్రస్తుతం 30ఎకరాల్లో జీడి పారిశ్రామికవాడ ఉంది. యువ పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు రావడంతో కొత్త పారిశ్రామికవాడ నిర్మాణం ఆవశ్యకత ఉంది. ఏడాది కిందట రామకృష్ణాపురం వద్ద పారిశ్రామికవాడ కోసం 50ఎకరాలు కేటాయిస్తున్నట్లు మంత్రి అప్పలరాజు ప్రకటించారు. దీనిపై ఎటువంటి చర్యలు లేకపోవడంతో వ్యాపారులు నిరాశతో ఉన్నారు. సమీపంలో పోర్టు నిర్మాణం జరగడం, రోడ్‌, రైలు మార్గం అందుబాటులో ఉండడంతో పారిశ్రామికవాడ ఏర్పాటు ఆవశ్యకత ఉంది.

- హుద్‌హుద్‌ గృహాలకు మోక్షం కల్పించరా..!

టీడీపీ హయాంలో పలాస-కాశీబుగ్గ జంటపట్టణాల మధ్య సూదికొండ కాలనీ సమీపంలో 194 హుద్‌హుద్‌ గృహాలు నిర్మించారు. లబ్ధిదారులను ఎంపిక చేసినా వీటిని ఇప్పటివరకూ అందజేయకపోవడంతో నిరూపయోగమవుతున్నాయి. పలాసతో పాటు వజ్రపుకొత్తూరు మండలం బెండి, టెక్కలి ప్రాంతాల్లో కూడా హుద్‌హుద్‌ గృహాలు రాజకీయాల కారణంగా వృథాగా మిగిలిపోతున్నాయి.

- ప్రధాన రహదారులకు మోక్షం ఎపుడో..!

కాశీబుగ్గ-అక్కుపల్లి, వెంకటాపురం-మెళియాపుట్టి ప్రధాన రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టినా.. నిధుల కొరతతో పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బెండిగేటు-పూండి రోడ్డును కూడా డబుల్‌రోడ్డుగా అభివృద్ధి చేయాల్సి ఉంది.

- ఉద్దానం తాగునీటి పథకానికి మంగళమేనా..!

1997లో అప్పటి కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు ఉద్దానం రక్షిత నీటి పథకానికి శ్రీకారం చుట్టారు. రూ.45 కోట్ల వ్యయంతో దీన్ని ప్రారంభించి ఉద్దానం మండలాలైన పలాస, వజ్రపుకొత్తూరు, మందస, కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం, సోంపేటలో ఉన్న మారుమూల గ్రామాలకు సైతం తాగునీరు అందించారు. మొత్తం 257 గ్రామాలకు దాహార్తిని తీర్చే కల్పతరువుగా ఉద్దానం రక్షిత మంచినీటి పథకం నిలిచింది. వైసీపీ ప్రభుత్వం ఈ పథకానికి మంగళం పాడే పరిస్థితి కనిపిస్తోంది. కంచిలి మండలం మఖరాంపురంలో ఉద్దానం తాగునీటి ప్రాజెక్టును సీఎం ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో పలాసలోని ఉద్దానం తాగునీటి పథకానికి దశలవారీగా నిధుల కోత వేస్తున్నారు. సిబ్బందికి జీతాలు పూర్తిగా నిలిపేశారు. పలాసలో ఉన్న ఈఈ కార్యాలయాన్ని సైతం అనకాపల్లికి తరలించారు. ఉద్దానం రక్షితనీటి పథకాన్ని కూడా కొనసాగించడమో, లేదా సమగ్ర మంచినీటి పథకంలోనైనా విలీనం చేసిఉంటే కొంతవరకూ ఖర్చు తగ్గి ఉండేదని నిపుణుల వాదన. వాస్తవానికి ఉద్దానం పథకానికి రూ.50కోట్లు విడుదల చేసి ఆధునీకరిస్తే మరికొన్నేళ్లు కానసాదేది. కానీ ప్రభుత్వ విధానం కారణంగా ఉద్దానం తాగునీటి పథకం ఇక కనుమరుగైనట్లే.

Updated Date - Dec 14 , 2023 | 12:39 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising