సమన్వయంతో సరిహద్దులో నేరాలను అరికడదాం
ABN, Publish Date - Dec 30 , 2023 | 11:53 PM
అంతర్రాష్ట్ర సరిహద్దు లైన శ్రీకాకుళం, గంజాం, గజపతి జిల్లాల పోలీసు అధికారులు సమన్వయంతో సమష్టిగా సరిహద్దులో జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ జీఆర్ రాధిక కోరారు.
- ఎస్పీ రాధిక
- గజపతి, గంజాం ఎస్పీలతో సమీక్ష
శ్రీకాకుళం క్రైం, డిసెంబరు 30: అంతర్రాష్ట్ర సరిహద్దు లైన శ్రీకాకుళం, గంజాం, గజపతి జిల్లాల పోలీసు అధికారులు సమన్వయంతో సమష్టిగా సరిహద్దులో జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ జీఆర్ రాధిక కోరారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా ఎస్పీ ఎం.శరవణవివేక్, గజపతి జిల్లా ఎస్పీ స్వాతి ఎస్.కుమారితో అంతర్రాష్ట్ర సమన్వయ సమీక్ష నిర్వహించారు. పెండింగ్ ఎన్‌బీడబ్ల్యూ, రైడ్స్ పాత నేరస్తులు, చెక్‌పోస్టు, అక్రమ మద్యం, మెడికో లీగల్ కేసులపై సమీక్షించారు. ఎస్పీ రాధిక మాట్లాడుతూ.. జిల్లాలో సుమారు 115 కిలోమీటర్ల సరిహద్దు గంజాం, గజపతి జిల్లాలతో కలిసి ఉందన్నారు. 8 పోలీసు స్టేషన్లు, 6 సబ్ పోలీసు స్టేషన్లు సరిహద్దులో జరుగుతున్న నేరాలపై పటిష్ట చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. సరిహద్దులో 53 గ్రామాల్లో సారా తయారీ, విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించి సంయుక్తంగా దాడులు నిర్వహించి వాటిని నియంత్రించేందుకు సహకరించాలన్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో పాత నేరస్తులపై నిఘా ఉంచి బైండోవర్లు నమోదు చేయాలన్నారు. జిల్లాలో నాలుగు అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆయా చెక్‌పోస్టుల వద్ద 24 గంటలూ అప్రమత్తంగా ఉండే స్పెషల్ పార్టీ సిబ్బందిని నియమించి తరచూ తనిఖీలు చేపట్టి అక్రమ రవాణాను అరికడదామని ఎస్పీ పిలుపునిచ్చారు. సమష్టిగా పని చేసి నేర రహిత జిల్లాలుగా తీర్చిదిద్దేందుకు సహకరించుకుందామని ఎస్పీ రాధిక కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈబీ జేడీ ఎన్.మణికంఠ, అడిషనల్ ఎస్పీ టీపీ విఠలేశ్వరరావు, డీఎస్పీలు డి.బాలచంద్ర రెడ్డి, నాగేశ్వరరెడ్డి, కె.బాలరాజు, సీఐలు ఈశ్వర్ ప్రసాద్, శంకరరావు, వినోద్‌బాబు, వేణుగోపాల్, గజపతి జిల్లా డీఎస్పీ మదబనంద నాయక్, ఇన్‌స్పెక్టర్లు ప్రసన్న భూపతి, గోవింద్, రీనరాణి, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 30 , 2023 | 11:54 PM