వైసీపీ పతనమే లక్ష్యంగా పోరాడుదాం
ABN, First Publish Date - 2023-12-11T00:32:37+05:30
రాష్ట్రంలో వైసీపీ పతనమే లక్ష్యంగా పోరాడుదామని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. వైసీపీ విముక్తి ఆంధ్రా కోసం టీడీపీతో కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
- జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్
శ్రీకాకుళం క్రైం, డిసెంబరు 10: రాష్ట్రంలో వైసీపీ పతనమే లక్ష్యంగా పోరాడుదామని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. వైసీపీ విముక్తి ఆంధ్రా కోసం టీడీపీతో కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీకాకుళంలోని ఆనందమయి కళ్యామండపంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఇటీవల వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన జనసైనికులు బోర శేషగిరి, గొర్లె వసంత్‌కుమార్, మైలపిల్లి యల్లయ్య, వాసు మధు కుటుంబ సభ్యులకు పార్టీ తరపున రూ.5లక్షలు చొప్పున ప్రమాద బీమా చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను వైసీపీ సర్వనాశనం చేసింది. మద్యం, ఇసుకతో పాటు విద్యాశాఖ, పశుసంవర్థకశాఖ కూడా అవినీతిమయమైంది. పాడి పశువుల పేరిట రూ.287 కోట్లు బినామీల ఖాతాలో వేసి ప్రజాధనం దోచుకున్నారు. రైతులకు పంట నష్టం వాటిల్లితే.. బారీకేడ్లు వేసుకుని సీఎం జగన్ పరామర్శించడం విడ్డూరంగా ఉంది’ అని విమర్శించారు. జనసైనికులు మరింత ధైర్యంగా నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని సాగనంపాలని, టీడీపీ-జనసేన విజయం కోసం సమష్టిగా కృషి చేయాలని సూచించారు. ఒక్క ఓటు కూడా చీలకుండా చూడాల్సిన బాధ్యత జనసైనికులపై ఉందని తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృధ్దికి సంయుక్త మ్యానిఫెస్టో రూపొందించామని.. ఇక వలసలు పోవాల్సిన అవసరం జిల్లా వాసులకు రాదన్నారు. అనంతరం పాతపట్నం నియోజకవర్గం మెళియాపుట్టి మండలం చినహంస వైసీపీ సర్పంచ్ సేనాపతి రవికుమార్, బిర్లంగి ఈశ్వరరావు, ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులు సీహెచ్ పున్నం, వార్డు మెంబర్ సుంకర రమణ, జి.స్వప్న, పి.శ్రీను, ఇచ్ఛాపురం నుంచి జి.మిన్నారావుతో పాటు మరో 12మంది వైసీపీ కార్యకర్తలు నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేనలో చేరారు. అలాగే 10 నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను నియమించారు. కార్యక్రమంలో జనసైనికులు కోరాడ సర్వేశ్వరరావు, సిద్ధయ్య, కామేష్, విశ్వక్‌సేన్, కిరణ్, చైతన్య, రామ్మోహన్, రాజు, విక్రమ్, దుర్గారావు పాల్గొన్నారు.
Updated Date - 2023-12-11T00:32:39+05:30 IST