విదేశీ పక్షులు వచ్చేశాయ్
ABN, First Publish Date - 2023-11-06T00:11:18+05:30
టెక్కలి మండలం తేలినీలాపురం విడిది కేంద్రానికి విదేశీ పక్షులు వచ్చేశాయి. ఆస్ట్రేలియా దేశం సైబీరియా ప్రాంతం నుంచి సుదూర తీరాలు, వేలాది కిలోమీటర్లు ప్రయాణించి పెలికాన్, పెయిండెట్ స్టాక్స్ పక్షులు చేరుకున్నాయి. ఏటా అక్టోబర్ చివర్లో లేదా నవంబర్ నెల ప్రారంభంలో ఇక్కడకు చేరుకుని.. మార్చి, ఏప్రిల్ నెల వరకు విడిది చేస్తాయి.
(టెక్కలి రూరల్)
టెక్కలి మండలం తేలినీలాపురం విడిది కేంద్రానికి విదేశీ పక్షులు వచ్చేశాయి. ఆస్ట్రేలియా దేశం సైబీరియా ప్రాంతం నుంచి సుదూర తీరాలు, వేలాది కిలోమీటర్లు ప్రయాణించి పెలికాన్, పెయిండెట్ స్టాక్స్ పక్షులు చేరుకున్నాయి. ఏటా అక్టోబర్ చివర్లో లేదా నవంబర్ నెల ప్రారంభంలో ఇక్కడకు చేరుకుని.. మార్చి, ఏప్రిల్ నెల వరకు విడిది చేస్తాయి. చింతచెట్లపై నివసిస్తూ.. సమీపంలోని చెరువుల్లో చేపలను ఆహారంగా తీసుకుంటూ జీవనం సాగిస్తాయి. ఇక్కడ సంతానోత్పత్తి అయిన కొద్దిరోజుల తర్వాత వాటి పిల్లలతో కలిసి తిరిగి సైబీరియా పయనమవుతాయి. వీటి రాకను తేలినీలాపురం వాసులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు శుభపరిణామంగా భావిస్తారు. కాగా.. ఈ ఏడాది కూడా విదేశీ పక్షులకు విడిది కేంద్రంలో సమస్యలు స్వాగతం పలికాయి. అధికారుల ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో సమస్యలు పరిష్కారం కావడం లేదు. ప్రధానంగా పక్షులకు అవసరమైన స్టాండ్లు, నెట్‌ల నిర్వహణ సక్రమంగా లేదు. పారిశుధ్యం అధ్వానంగా ఉంది. కార్తీకమాస వనభోజనాలలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి విదేశీపక్షులను చూసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో కేంద్రానికి విచ్చేస్తారు. తాగునీరుతోపాటు మరుగుదొడ్ల సౌకర్యం సక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్నారు. చెట్లపై ఉన్న విదేశీ పక్షులను చూసేందుకు ఏర్పాటు చేసిన వాచ్‌టవర్ కూడా శిథిలావస్థకు చేరుకుంది. రెండేళ్ల కిందట విడిది కేంద్రంలో వందల సంఖ్యలో పక్షులు అనారోగ్య కారణాలతో మృతి చెందాయి. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించి పక్షుల సంరక్షణతోపాటు మౌలిక సదుపాయాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని పర్యాటకులు కోరుతున్నారు.
సంరక్షణ చేపడుతున్నాం
తేలినీలాపురం విడిది కేంద్రానికి ఇప్పటివరకూ 150 పెలికాన్, 90 వరకు పెయింటెడ్ స్టాక్స్ విదేశీ పక్షులు చేరుకున్నాయి. వారం రోజులుగా పక్షులు వస్తూనే ఉన్నాయి. పక్షుల సంరక్షణ చర్యలు చేపడుతున్నాం. నెట్‌లు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తాం.
- యాళ్ల సంజీవ్ కుమార్, అటవీశాఖ రేంజ్ అధికారి, టెక్కలి
Updated Date - 2023-11-06T00:11:19+05:30 IST