అప్రమత్తంగా ఉంటేనే..
ABN, Publish Date - Dec 24 , 2023 | 11:41 PM
కరోనా ముప్పు మళ్లీ పొంచి ఉంది. పక్క జిల్లా విశాఖపట్నంలో కొవిడ్ కొత్త వేరియంట్ జీఎన్-1 పాజిటివ్ కేసులు నమోదుకావడంతో జిల్లావాసులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది.
- పక్క జిల్లాలో కరోనా జీఎన్-1 కేసులు నమోదు
- ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వార్డుల ఏర్పాటు
(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)
కరోనా ముప్పు మళ్లీ పొంచి ఉంది. పక్క జిల్లా విశాఖపట్నంలో కొవిడ్ కొత్త వేరియంట్ జీఎన్-1 పాజిటివ్ కేసులు నమోదుకావడంతో జిల్లావాసులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. కరోనా మొదటి, రెండో దశల్లో జిల్లాలో రికార్డుస్థాయిల్లో కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరణాలు కూడా అదేరీతిలో సంభవించాయి. వ్యాక్సినేషన్ ప్రభావంతో కేసులు తగ్గి.. ఆ తర్వాత సాధారణ పరిస్థితి నెలకొంది. ఇటీవల కేరళ రాష్ట్రంలో కొవిడ్ కొత్త వేరియంట్ జీఎన్ 1 ప్రభావం చూపుతోంది. తాజాగా ఇటీవల విశాఖ జిల్లాలో కూడా మూడు కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ సోకగానే సాధారణ లక్షణాలు జలబు, తలనొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు వంటివి మాత్రమే రోగుల్లో కనిపిస్తున్నాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం పొగమంచు తీవ్రంగా ఉంది. దీనికితోడు శీతలగాలులు పెరగడంతో కొవిడ్ వ్యాప్తికి అవకాశం ఉంది. మరోవైపు ప్రస్తుతం క్రిస్మస్, సంక్రాంతి.. పండుగల సీజన్ కావడంతో అన్ని దుకాణాలు, షాపింగ్‌మాల్స్‌లో జనాల రద్దీ కనిపిస్తోంది. ప్రస్తుతం కొవిడ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అప్రమత్తత పాటించాల్సిందేనని వైద్యవర్గాలు హెచ్చరిస్తున్నాయి. ముందస్తు చర్యల్లో భాగంగా.. శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(రిమ్స్-జీజీహెచ్)లో కొవిడ్ వార్డులను సిద్ధం చేశారు. అక్కడ నాలుగు ఆక్సిజన్ ప్లాంట్‌ల్లో రెండు మాత్రమే పనిచేస్తున్నాయి. కొవిడ్ థియేటర్‌ను కూడా సిద్ధం చేశారు. పరిస్థితి విషమించి ఒకేదఫా అధిక కేసులు నమోదైనా ఎదుర్కొనేందుకు వీలుగా సౌకర్యాలు సరిచూసుకుంటున్నారు. రిమ్స్‌లో ఆడిటోరియం సమీపంలో ఉన్న గది వద్ద కొవిడ్ పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతానికి కొత్త కేసులు నమోదు కాలేదు.
- తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ
ప్రస్తుతానికి జీఎన్ 1 గురించి ఆందోళన చెందాల్సిన పని లేకపోయినా.. జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. నిరంతరం మాస్క్‌ను ధరించాలి. గుంపులుగా.. సమూహాలుగా ప్రజలు తిరగకూడదు. వ్యాధినిరోధక శక్తి పెంచుకునేలా సమతుల ఆహారం తీసుకుంటూ యోగ, ప్రాణాయామం, ఎక్సర్‌సైజ్‌లు చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం అత్యుత్తమం. అలానే దూరప్రాంతాలకు వెళ్లడం.. కొవిడ్ ప్రభావమున్న ప్రాంతాల నుంచి వచ్చినవారిని కలిసే సమయాల్లో భౌతిక దూరం పాటించాలి. దీర్ఘకాలిక వ్యాధులున్న రోగులు.. జనసమూహంలో తిరగకుండా జాగ్రత్త వహించాలి.
అవసరమైతే జీనోమ్ సీక్వెన్సీకి పంపుతాం
ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఆడిటోరియం వద్ద ప్రజలకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నాం. అవసరమైతే జీనోమ్ సీక్వెన్సీకి పంపుతాం. ఎవరూ ఆందోళన చెందొద్దు. ఇంటి నుంచే ట్రీట్‌మెంట్ కూడా తీసుకోవచ్చు. ప్రత్యేక వైద్యం అందించాలని గైడ్‌లైన్స్ ఏమీలేవు. 92శాతం ఈ వేరియంట్ సాధారణ ప్రభావమే చూపిస్తుంది. జ్వరం, దగ్గు, ఒళ్లునొప్పులు, జలుబు వంటివి మాత్రమే లక్షణాలు ఉంటాయి. మాస్క్ ధరిస్తూ ప్రజలు వారి దైనందిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. వీలైనంతవరకు గుంపులుగా తిరగవద్దు. అంతకుమించి జాగ్రత్తలు ఏమీలేవు. రిమ్స్‌లో కొవిడ్ ఐసీయూ వార్డులు, కొవిడ్ థియేటర్‌ను సిద్ధం చేశాం.
- స్వామినాయుడు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్
.............
ముందస్తు చర్యలు
- జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డా.మీనాక్షి
శ్రీకాకుళం క్రైం: కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ నమోదుకావడంతో.. జిల్లావాసులు కూడా అప్రమత్తంగా ఉండాలని జిల్లావైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ మీనాక్షి సూచించారు. ‘ఆంధ్రజ్యోతి’తో ఆమె మాట్లాడుతూ.. ‘జిల్లాలో ఇంతవరకూ కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ముందస్తుగా పీహెచ్‌సీలో వైద్యసిబ్బందిని అప్రమత్తం చేశాం. జీజీహెచ్‌లో కొవిడ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. మెడికల్ కళాశాలలో 20 పడకల ఐసీయూ సిద్ధం చేశాం. వార్డుల్లో 12వేల వెంటిలేటర్స్, మందులు అందుబాటులో ఉంచాం. జిల్లా ఆరోగ్య కేంద్రంలో 10 ఎమర్జెన్సీ వార్డులను ఆందుబాటులో ఉంచాం. ప్రతి పీహెచ్‌సీలోనూ, టెక్కలిలో 5పడకల వార్డు సిద్ధం చేశాం. జీజీహెచ్‌లో రోజూ వీటీఎం పరీక్షలు చేస్తున్నాం. గతంలో రాపిడ్ తర్వాత వీటీఎం పరీక్షలు చేసేవాళ్లం. ప్రస్తుతం వేరియంట్ జాడలు తొందరగా గుర్తించేందుకు వీటీఎం పరీక్షలు చేస్తున్నాం. 9,284 ఆర్‌ఎన్‌ఏ కిట్లు, 6,420 ఆర్‌టీపీసీఆర్ కిట్లు అందుబాటులో ఉంచాం. కేరళలో పాజిటివ్ కేసులు ప్రబలుతున్న నేపథ్యంలో శబరిమలై వెళ్లి వచ్చిన అయ్యప్పస్వామి భక్తులు వారం రోజులపాటు హోం ఐసోలేషన్‌లో ఉండాలి. పొడిదగ్గు, తలనొప్పి, గొంతు నొప్పి, జ్వరం, శ్వాసకోశ ఇబ్బంది, మెడనొప్పి, ఒంటి నొప్పుల లక్షణాలున్న వారికి జేఎన్-1 వేగంగా వ్యాపించే అవకాశం ఉంది. ఈ లక్షణాలు ఉన్నవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలి. 14 రోజులపాటు గృహ నిర్బంధంలో ఉండాలి. భౌతికదూరం పాటిస్తూ.. జాగ్రత్తలు తీసుకోవాలి’ అని సూచించారు.
Updated Date - Dec 24 , 2023 | 11:41 PM