బాబోయ్... ఒత్తిడి తట్టుకోలేం
ABN, First Publish Date - 2023-11-17T23:34:56+05:30
జిల్లాలోని పంచాయతీరాజ్ ఇంజనీర్లు శుక్రవారం రాత్రి ఆందోళన బాట పట్టారు. కేవలం పనుల్లో నాణ్యత, పనుల పర్యవేక్షణ చేయగలమని.. కాంట్రాక్టర్లు లేకుండా ప్రభుత్వ భవనాల నిర్మాణం వేగంగా పూర్తిచేయాలంటే ఎలా? అంటూ మూకుమ్మడిగా ప్రశ్నిస్తున్నారు.
- ప్రాధాన్యం పేరుతో వేటా?
- సకాలంలో బిల్లులు రావు
- 2019 నాటి ధరలతో ఇబ్బందులు
- కలెక్టర్ ఆగ్రహానికీ మేమే బాధ్యులమా?
- ధర్నా చేపట్టిన పంచాయతీరాజ్ ఇంజనీర్లు
- ఎస్‌ఈ తీరుపై మండిపాటు
- ఆఫీస్ ముందు బైఠాయించి ఆందోళన
(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)
జిల్లాలోని పంచాయతీరాజ్ ఇంజనీర్లు శుక్రవారం రాత్రి ఆందోళన బాట పట్టారు. కేవలం పనుల్లో నాణ్యత, పనుల పర్యవేక్షణ చేయగలమని.. కాంట్రాక్టర్లు లేకుండా ప్రభుత్వ భవనాల నిర్మాణం వేగంగా పూర్తిచేయాలంటే ఎలా? అంటూ మూకుమ్మడిగా ప్రశ్నిస్తున్నారు. సమస్యలు చెప్పుకుందామన్నా శాఖాధిపతి అయిన పంచాయతీరాజ్ సూపరిండెంట్ ఇంజనీర్ కూడా లేకపోవడంతో ఆగ్రహిస్తూ శ్రీకాకుళంలోని పీఆర్ ఎస్‌ఈ కార్యాలయం ముందు బైఠాయించారు. ఇంత ఒత్తిడి తాము భరించలేమని, ఎస్‌ఈ వచ్చేవరకు.. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకూ ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు.
- ఇంజనీర్లు ధర్నా చేపట్టడానికి ముఖ్యకారణం.. ప్రభుత్వ భవనాలను పూర్తిచేయించడం. ఇటీవల సమీక్షలో.. ప్రభుత్వ ప్రాధాన్య భవనాలైన రైతుభరోసా కేంద్రాలు, గ్రామసచివాలయాలు, విలేజ్ హెల్త్‌క్లినిక్ భవనాలను సకాలంలో పూర్తిచేయడం లేదని.. దీనిపై పంచాయతీరాజ్ ఇంజనీర్లపై చర్యలు తీసుకుంటామంటూ కలెక్టర్ హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో సమస్యలు తీవ్రంగా ఉన్నాయని.. ఆ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నామని.. ఇంజనీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పంచాయాతీరాజ్ ఇంజనీర్ల సంఘం జేఏసీ సెక్రటరీ జనరల్ కేసీహెచ్ మహంతి, కోచైర్మన్లు శ్రీరాములు, పోలినాయుడు మాట్లాడుతూ ప్రాధాన్యం పేరుతో కలెక్టర్ భవనాల నిర్మాణానికి టార్గెట్ విధిస్తున్నారని చెప్పారు. వాస్తవంగా 2019లో ఉన్నటువంటి ధరలతో.. ఇప్పుటి ధరలతో పోల్చితే నిర్మాణ వ్యయం తీవ్రంగా పెరిగిందని తెలిపారు. అప్పట్లో సిమెంట్ బస్తా రూ.190 ఉంటే.. ఇప్పుడు రూ.450, ఐరన్ అప్పుడు రూ. 48వేలు.. ఇప్పుడు రూ.80వేలు, చిప్స్‌లోడు రూ.3వేలు అప్పుడు.. ఇప్పుడు రూ.10వేలు.. ఇలా అన్నింటిలో ధరల వ్యత్యాసం ఉందన్నారు. దీనికితోడు కాంట్రాక్టర్లు లేకపోవడంతో పంచాయతీలతో భవనాల నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు. చేపట్టిన పనులకు సకాలంలో బిల్లులు రాకపోవడంతో వెనుకడుగు వేస్తున్నారన్నారు. ఇంజనీర్లుగా తాము పనుల్లో నాణ్యత ఉందా, పనుల పర్యవేక్షణ చేయగలమని.. కానీ నిర్మాణాలు పూర్తిచేయించలేమని చెప్పారు. ఇటువంటి సమస్యలతో సతమతమవుతుంటే.. భవనాలు పూర్తిచేయనందుకు ఇంజనీర్లదే తప్పుఅన్నట్లుగా కలెక్టర్ చర్యలకు ఉపక్రమిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తము గోడు చెప్పేందుకు ఎస్‌ఈ ఎస్‌వీఎన్ మూర్తి వద్దకు వెళితే.. ఆయన లేరని.. కనీసం ఫోన్‌కు కూడా స్పందించలేదని తెలిపారు. ఈ ఒత్తిడి తట్టుకోలేమని ఎస్‌ఈ వచ్చి సమస్య పరిష్కరించే వరకూ ధర్నా కొనసాగిస్తామన్నారు. శనివారం నుంచి పెన్‌డౌన్ నిరసన చేపడతామని ప్రకటించారు. కార్యక్రమంలో ఇంజనీర్లు పి.ధర్మారావు, ఎల్.అప్పలసూరి, బి.కృష్ణారావు, ఎం.పోలినాయుడు, బి.నర్శింగరావు, పి.శ్రీవల్లి, ఇంద్రాణి, జె.నగేష్ పట్నాయక్ పాల్గొన్నారు.
Updated Date - 2023-11-17T23:34:57+05:30 IST