విషాద ప్రయాణం
ABN, First Publish Date - 2023-10-30T01:49:55+05:30
విజయనగరం జిల్లాలో రైలు ప్రమాద ఘటన.. విషాద ప్రయాణంగా మారింది. కొత్తవలస మండలం కంటకాపల్లి- జామి మండలం అలమండ మధ్య ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో పట్టాలపై అగి ఉన్న పలాస ప్యాసింజర్ రైలును వెనక నుంచి రాయగడ పాసింజర్ రైలు ఢీ కొంది.
- విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం
- కంటాకాపల్లి- అలమండ వద్ద రెండు ప్యాసింజర్‌లు ఢీ
- మృతుల్లో జి.సిగడాం వాసి ఒకరు.. ఏడుగురు క్షతగాత్రులు
- మిన్నంటిన ఆర్తనాదాలు
- మృతులు, క్షతగాత్రుల సంఖ్య పెరిగే అవకాశం
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి/ జి.సిగడాం, అక్టోబరు 29: విజయనగరం జిల్లాలో రైలు ప్రమాద ఘటన.. విషాద ప్రయాణంగా మారింది. కొత్తవలస మండలం కంటకాపల్లి- జామి మండలం అలమండ మధ్య ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో పట్టాలపై అగి ఉన్న పలాస ప్యాసింజర్ రైలును వెనక నుంచి రాయగడ పాసింజర్ రైలు ఢీ కొంది. దీంతో మూడు రైలు బోగీలు పట్టాలు తప్పి.. 10 మంది మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. రెండు రైళ్లలో ప్రయాణిస్తున్న వారిలో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 50 నుంచి 60మంది వరకు తీవ్రంగా గాయపడి ఉండవచ్చని తెలుస్తోంది. ఈ ప్రాంతమంతా చుట్టూ పొలాలు, మామిడితోటలే. దీనికితోడు చీకటిగా ఉండడంతో సహాయక చర్యలు చేపట్టేందుకు స్థానిక యువత, అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వేపోలీసులు, రిజర్వ్‌డ్, సివిల్, ఎన్డీఆర్‌ఎఫ్ దళాలు రంగంలోకి సహాయక చర్యలు చేపడుతున్నారు. క్షతగాత్రులను విజయనగరం కేంద్రాసుపత్రి, విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. ఘటనా స్థలంలో ఆర్తనాదాలు మిన్నంటాయి. ఈ దుర్ఘటనలో జి.సిగడాం మండలానికి చెందిన ఓ మహిళ మృతి చెందగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా.. గతేడాది ఏప్రిల్‌లో జి.సిగాడం మండలం బాతువ వద్ద జరిగిన రైలు ప్రమాద ఘటన తీవ్ర విషాదం మిగిల్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటన మరింత విషాదాన్ని నింపింది.
- శుభకార్యానికి వెళ్లివస్తూ.. అనంతలోకాలకు
రైలు ప్రమాద దుర్ఘటనలో జి.సిగడాం మండలం ఎస్పీఆర్ పురం గ్రామానికి చెందిన గడిజాల లక్ష్మి(40)మృతి చెందింది. జి.సిగడాంకు చెందిన కీర్తి రాములమ్మకు రెండు కాళ్లు విరిగిపోయాయి. అదే గ్రామానికి చెందిన నాలుగేళ్ల మోక్ష, పన్నేండేళ్ల మజ్జి అమృత, సూర్యకాంతం, రమణకు తీవ్ర గాయాలయ్యాయి. మెట్టవలసకు చెందిన టంకాల సుజనమ్మకు ఒక కాలు విరిగిపోయింది. అదే గ్రామానికి చెందిన డెంకా అప్పనమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. రైలు ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ఆ రెండు గ్రామాలు ఉలిక్కిపడ్డాయి. జి.సిగడాం మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తికి సంబంధించిన శుభకార్యానికి వీరంతా విశాఖపట్నం వెళ్లారు. శుభకార్యం ముగించుకుని స్వగ్రామాలకు రైలులో వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం విషయాన్ని తెలుసుకుని కుటుంబ సభ్యులు తమ వారికి ఏమైందోనని ఆందోళన చెందారు. ఆయా గ్రామాలకు చెందిన యువకులు, పెద్దలు సంఘటనా స్థలానికి పరుగులు తీశారు. గిడిజాల లక్ష్మీ మృతితో ఎస్‌పీఆర్‌పురంలో విషాదం అలుముకుంది. మృతురాలికి భర్త రామారావు, కుమారులు సాయి, తరుణ్ ఉన్నారు. వీరు వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. లక్ష్మి మృతితో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి.
- ఇదిలా ఉండగా.. జి.సిగడాంతోపాటు పొందూరు, పలాస తదితర ప్రాంతాలకు చెందినవారు కూడా గాయపడినట్టు సమాచారం. ఎంతమంది క్షతగాత్రులన్నది అధికారికంగా ప్రకటన వెలువడలేదు. పలాస నుంచి జి.సిగడాం వరకు పాసింజర్ రైళ్ల పరిధి మండల ప్రజలు తమ బంధువుల ఆచూకీ తెలుసుకునేందుకు విజయనగరం వెళ్లారు. కొంతమంది ఫోన్లకు స్పందన లేకపోవడంతో వారిలో కలవరం రేగింది. పలాస, ఆమదాలవలస (శ్రీకాకుళం రోడ్) రైల్వేస్టేషన్లలో హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రమాద ఘటనపై జిల్లా అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. తక్షణ వైద్యం కోసం లైఫ్ సపోర్టు వాహనాలను ఘటనా ప్రాంతానికి పంపించారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు సంఘటన స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. అర్థరాత్రి ఒంటి గంట వరకూ అక్కడే ఉండే సహాయక చర్యలను పర్యవేక్షించారు.
పలాసలో హెల్ప్‌లైన్ డెస్క్ ఏర్పాటు
రైలు ప్రమాదం నేపథ్యంలో పలాస రైల్వే స్టేషన్‌లో ఆదివారం రాత్రి హెల్ప్‌లైన్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. మృతులు, గాయపడిన ప్రయాణికుల సమాచారం నిమిత్తం పలాస స్టేషన్‌లో హైల్ప్‌లైన్ 8895670594 నెంబరును ఏర్పాటు చేసినట్లు ఖుర్దా డివిజన్ అధికారులు తెలిపారు.
Updated Date - 2023-10-30T01:49:55+05:30 IST