వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోటా పూర్తి
ABN, Publish Date - Dec 26 , 2023 | 03:03 AM
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో తిరుమల శ్రీవారిని 1,31,591 మంది భక్తులు దర్శించుకుని ఉత్తరద్వార ప్రవేశం చేశారు.
ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో 1.31 లక్షలమందికి దర్శనం
తిరుమల, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో తిరుమల శ్రీవారిని 1,31,591 మంది భక్తులు దర్శించుకుని ఉత్తరద్వార ప్రవేశం చేశారు. ఈ రెండురోజుల్లో 54,916 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు పదిరోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు జరుగనున్న నేపథ్యంలో 21వ తేదీ రాత్రి 11.30 గంటల నుంచే దీనికి సంబంఽధించిన ఉచిత స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రక్రియను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. తిరుపతిలోని తొమ్మిది ప్రదేశాల్లో దాదాపు 90 కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేశారు. సోమవారం వేకువజామున 4.25 గంటల సమయానికి జనవరి 1వ తేదీ వరకు స్లాటెడ్ సర్వదర్శన టోకెన్ల కోటా పూర్తయింది ఈ పదిరోజులకు సంబంధించి 4,23,500 టోకెన్లను జారీ చేశారు. అయితే టోకెన్లు పొందిన భక్తుల్లో కొందరు తిరిగి తమ సొంతూరు వెళ్లిపోగా, మరికొంతమంది దర్శనానికి రెండుమూడు రోజులే ఉండడంతో తిరుమలలోనే ఉన్నారు. 2వ తేదీ నుంచి యఽధావిధిగా సర్వదర్శన టోకెన్లు జారీ చేయనున్నారు. టోకెన్ రహిత దర్శనాలు, ఆర్జితసేవలు, ప్రత్యేక దర్శనాలు కూడా 2వ తేదీ నుంచి మొదలుకానున్నాయి.
Updated Date - Dec 26 , 2023 | 03:03 AM