పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి అరెస్టు
ABN, First Publish Date - 2023-11-15T02:12:59+05:30
పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సవాలుగా నిలిచిన మాజీ ఎమ్మెల్సీ, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి(మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి)ని పోలీసులు అరెస్టు చేశారు.
చీకటి పడ్డాక సినీ ఫక్కీలో,
కిడ్నాప్ తరహాలో అదుపులోకి
రవితోపాటు గన్‌మెన్ ఫోన్లు తీసుకుని స్విచ్చాఫ్
పది నెలల కిందట కేసు నమోదు
నాడు.. లోకేశ్‌కు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు
అడ్డుకున్న పోలీసులు.. తోపులాట.. కేసు
దానిని నాన్‌బెయిలబుల్‌గా మార్చి అరెస్టు
అర్ధరాత్రి న్యాయాధికారి ముందు హాజరు
కడప, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సవాలుగా
నిలిచిన మాజీ ఎమ్మెల్సీ, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి(మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి)ని పోలీసులు అరెస్టు చేశారు. ఎప్పుడో పది నెలల కిందట పోలీసులను అడ్డుకున్నారంటూ పెట్టిన కేసును... ఇప్పుడు నాన్ బెయిలబుల్‌గా మార్చేసి... సినీ ఫక్కీలో చుట్టుముట్టిన పోలీసులు... కిడ్నాప్ తరహాలో బలవంతంగా తమతో తీసుకెళ్లారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభించే ముందు జనవరి 25న కడప చేరుకుని దేవుని కడపలోని వేంకటేశ్వరస్వామి ఆలయం, పెద్ద దర్గా, మరియాపురం చర్చిల్లో పార్థనలు చేశారు. లోకేశ్‌కు స్వాగతం పలికేందుకు బీటెక్ రవి టీడీపీ శ్రేణులతో కలసి అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు, ఎయిర్‌పోర్టు సిబ్బంది అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. అప్పట్లో బీటెక్ రవిపై వల్లూరు పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 324 కింద కేసు నమోదు చేశారు. ఇది జరిగి పది నెలలు దాటింది. దానిని ఇప్పుడు నాన్‌బెయిలబుల్‌గా మార్చారు. మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో పులివెందుల నుంచి కడపకు వెళ్తున్న బీటెక్ రవిని యోగి వేమన యూనివర్సిటీ వద్ద కమలాపురం సీఐ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. రవితోపాటు ఆయన గన్‌మెన్ల ఫోన్లను తీసుకుని స్విచ్చాఫ్ చేశారు. దీంతో ఆయన సతీమణి, కుటుంబసభ్యులు ఆందోళనచెందారు. బీటెక్ రవిని అరెస్టు చేశారా, అగంతకులు కిడ్నాప్ చేశారా అనేది తెలియక కడప ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, డీఎస్పీ ఎండీ షరీ్‌ఫకు పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ స్పందనలేదు. చివరికి ఆయనను అరెస్టు చేసినట్లు స్పష్టమైంది. మరోవైపు... ‘కడప ఎయిర్‌పోర్టు వద్ద బీటెక్ రవి చేసిన ఆందోళనలో మా ఏఎ్‌సఐకి గాయాలయ్యాయి. దానిపై కేసు నమోదు చేశాం. పది నెలలుగా బీటెక్ రవి అందుబాటులో లేరు. ఇప్పుడు అరెస్టుచేశాం’’ అని డీఎస్పీ షరీఫ్ పేర్కొన్నారు. రవిని తొలుత వల్లూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రిమ్స్‌లో వైద్య పరీక్షల అనంతరం రాత్రి 11గంటల సమయంలో కడప మేజిస్ర్టేట్ ముందు హాజరుపరిచారు. పది నెలల కిందట నమోదైన కేసును ఇప్పుడు నాన్ బెయిలబుల్‌గా అరెస్టు చేశారని రవి తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. రవిపై మరిన్ని కేసులు పెట్టే అవకాశముందని ఆయన కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.
కంట్లో నలుసుగా మారారని
పులివెందులలో వైఎస్ జగన్‌కు బీటెక్ రవి గట్టిగా సవాలు విసురుతున్నారు. ఈ నియోజకవర్గంలో సింహాద్రిపురం మండలం బలపనూరు జగన్ సొంత గ్రామంకాగా... బీటెక్ రవిది అదే మండలంలోని కసనూరు. 2016లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి, జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డిపై బీటెక్ రవి పోటీచేసి గెలిచారు. దీంతో ఒక్కసారిగా ఆయన పేరు మార్మోగింది. వివేకా హత్యకేసులో జగన్ వర్గం బీటెక్ రవిపై ఆరోపణలు చేస్తూ వచ్చింది. సీబీఐ విచారణలో ఇవన్నీ అసత్యాలే అని తేలింది. ఈ కేసులో వైఎస్ అవినాశ్‌రెడ్డికి సంబంధం ఉందని... ‘తాడేపల్లి’తో లింకులున్నాయని నేరుగా జగన్‌పైనే బీటెక్ రవి ఆరోపణలు చేశారు. అప్పటి నుంచి ఆయనపై గురిపెరిగింది. ఎప్పుడో టీడీపీ ప్రభుత్వ హయాంలో పులివెందులలో జరిగిన ఓ కేసులో... చెన్నై ఎయిర్‌పోర్టులో ఆయనను అరెస్టు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. అప్పటినుంచి బీటెక్ రవి దూకుడు పెంచారు. ఇటీవల పులివెందులలో కార్పొరేట్ స్థాయిలో టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ వైసీపీ నుంచి టీడీపీలోకి పలువురిని చేర్చుకుంటూ... జగన్‌కు కంట్లో నలుసుగా మారారు. ఈ క్రమంలోనే బీటెక్ రవి అరెస్టు జరగడం గమనార్హం. జగన్ సొంత జిల్లాలో పాత కేసులు తిరగదోడి మరీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిలను అరెస్టు చేస్తుండటం గమనార్హం. సోమవారం ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డిని హత్యాయత్నం కేసులో అరెస్టు చేసి, జైలుకు పంపారు. మరుసటి రోజే బీటెక్ రవిని అరెస్టు చేశారు.
బీటెక్ రవి అరెస్టు అన్యాయం
10నెలల క్రితం నమోదు చేసిన బెయిలబుల్ కేసును కక్షపూరితంగా నాన్‌బెయిలబుల్‌గా మార్చి బీటెక్ రవిని అక్రమంగా అరెస్టు చేశారని పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గోవర్దన్‌రెడ్డితో కలిసి ఆయన కడప సెంట్రల్ జైలు వద్దకు వచ్చారు.
బీటెక్ రవికి ఏం జరిగినా జగన్‌దే బాధ్యత: లోకేశ్
అమరావతి: టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి ఏం జరిగినా సీఎం జగన్, పోలీసులదే బాధ్యత అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘ఎక్స్’లో హెచ్చరించారు. బీటెక్ రవి అరెస్ట్ జగన్ సైకో తత్వానికి నిదర్శనమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. బీటెక్ రవికి ఏమైనా జరిగితే ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని హెచ్చరించారు.
Updated Date - 2023-11-15T02:13:00+05:30 IST