అక్రమాలపై వేటు?
ABN, First Publish Date - 2023-11-23T23:43:19+05:30
ఎట్టకేలకు రిజిస్ర్టేషన్ శాఖలో ప్రక్షాళన మొదలైంది. అక్రమాలకు పాల్పడిన అధికారులు, ఉద్యోగులపై వేటు వేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఒక ఇన్‌చార్జి సబ్‌రిజిస్ర్టార్(సీనియర్ అసిస్టెంట్)ను సస్పెండ్ చేశారు. అలాగే మరో ముగ్గురిపై చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం. పూర్తిస్థాయిలో విచారణ అనంతరం మరికొందరిపైనా వేటు పడనుంది. ఇదిలాఉండగా నకిలీ పత్రాలు, స్టాంపుల కుంభకోణానికి రిజిస్ర్టార్ కార్యాలయాలే కేంద్రాలుగా తేలడంతో ఉన్నతాధికారులు ప్రకాశం డీఆర్వోపై దృష్టిసారించారు. ఇప్పటికే అన్నిరకాలుగా విచారణలు ప్రారంభించారు. అనేక డాక్యుమెంట్ల విషయంలో అవకతవకలకు పాల్పడినట్లు ఇప్పటికే తేలింది. నకిలీ పత్రాలతో వందకు పైగా డాక్యుమెంట్లు చేసినట్లు తెలిసింది. అందులో జీపీఏలు ఎక్కువగా ఉన్నాయి.
ఒంగోలులో ఇద్దరు సబ్‌రిజిస్ర్టార్లు, మంత్రి సురేష్ ఇలాకాలో మరొకరు సస్పెన్షన్
రిజిస్ట్రేషన్ శాఖ ప్రక్షాళన
పూర్తిస్థాయిలో విచారణ
నకిలీ పత్రాలు, డాక్యుమెంట్లపై పరిశీలన
ఇప్పటికే ఒక ఇన్‌చార్జి సబ్‌రిజిస్ర్టార్ సస్పెన్షన్
మేయర్ భర్త జీపీఏ రద్దుకు దరఖాస్తు
ఎట్టకేలకు రిజిస్ర్టేషన్ శాఖలో ప్రక్షాళన మొదలైంది. అక్రమాలకు పాల్పడిన అధికారులు, ఉద్యోగులపై వేటు వేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఒక ఇన్‌చార్జి సబ్‌రిజిస్ర్టార్(సీనియర్ అసిస్టెంట్)ను సస్పెండ్ చేశారు. అలాగే మరో ముగ్గురిపై చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం. పూర్తిస్థాయిలో విచారణ అనంతరం మరికొందరిపైనా వేటు పడనుంది. ఇదిలాఉండగా నకిలీ పత్రాలు, స్టాంపుల కుంభకోణానికి రిజిస్ర్టార్ కార్యాలయాలే కేంద్రాలుగా తేలడంతో ఉన్నతాధికారులు ప్రకాశం డీఆర్వోపై దృష్టిసారించారు. ఇప్పటికే అన్నిరకాలుగా విచారణలు ప్రారంభించారు. అనేక డాక్యుమెంట్ల విషయంలో అవకతవకలకు పాల్పడినట్లు ఇప్పటికే తేలింది. నకిలీ పత్రాలతో వందకు పైగా డాక్యుమెంట్లు చేసినట్లు తెలిసింది. అందులో జీపీఏలు ఎక్కువగా ఉన్నాయి.
ఒంగోలు(క్రైం), నవంబరు 23 : స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో చోటుచేసుకున్న అవకతవక లు ఒక్కొక్కటి బట్టబయలు అవుతున్నాయి. సిట్ దర్యాప్తులో వెల్లడైన అక్రమాల్లో రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల పాత్ర స్పష్టమవుతోంది. ఇటీవల మేయర్ భర్త అరుళ్‌రాజ్, ప్రభుదాస్ కలిసి మండువవారిపాలెం రైతుల(మహానాడు) భూములను కాజేసేందుకు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ(జీపీఏ) తీసుకున్నారు. అందుకు సంబంధించి జీపీఏ రిజిస్ట్రేషన్ చేసిన ఒంగోలు ఆర్‌వోలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ కృష్ణమోహన్(ఇన్‌చార్జి సబ్‌రిజిస్ర్టార్)పై సస్పెన్షన్ వేటుపడింది. ఇంకా ఒంగోలు, మార్కాపురం ప్రాంతంలో రిజిస్ట్రేషన్ శాఖలో జరిగిన అక్రమాలపై శాఖాపరమైన దర్యాప్తు కొనసాగుతోంది. అందుకు సంబంధించి ముగ్గురు సబ్ రిజిస్ట్రార్లపై వేటు వేసేందుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. అలాగే మరికొందరి అవకతవకలపైనా విచారణ జరుగుతోంది. రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమాలకు పాల్పడిన వారిపై వరుసగా చర్యలు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో రిజిస్ర్టేషన్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులు వణికిపోతున్నారు. ఎప్పుడు ఎవరిపై వేటుపడుతుందోనని భయపడుతున్నారు.
మేయర్ భర్త జీపీఏ రద్దుకు దరఖాస్తు
నకిలీపత్రాలు ద్వారా 14 ఎకరాలు భూమిని సొంతం చేసుకునేందుకు ఏకంగా జీపీఏ పొందిన మేయర్ భర్త అరుళ్‌రాజ్, ప్రభుదాస్‌లు తమ జీపీఏ రద్దుచేయాలని కోరుతూ రిజిస్ట్రేషన్ అధికార్లకు దరఖాస్తు చేసారు. నకిలీ పత్రాలు తయారు చేయించి విలువైన భూమిని కబ్జా చేయాలని అధికార పార్టీ అండతో పావులు కదిపిన అరుళ్‌రాజ్ అక్రమాలు బట్టబయలు అయిన తరువాత రద్దు కోరడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు అక్రమాలు చోటుచేసుకున్నాయిని తేల్చి అందుకు బాధ్యుడైన సీనియర్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో రద్దు కోరడం అంటే మేయర్ భర్త అక్రమానికి పాల్పడినట్టు అంగీకరించినట్లే. అధికారం అండ ఉన్నందువలనే సిట్ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు అరుళ్‌రాజ్, ప్రభుదా్‌సలు ఇరువురు పరారీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
అసలు లేని భూమికి జీపీఏ
రికార్డులలో లేని భూమికి జేపీఏ రిజిస్ట్రేషన్ చేసి కృష్ణమోహన్ అనే ఇన్‌చార్జి సబ్‌రిజిస్ర్టార్ జిల్లాలో చర్చనీయాంశమయ్యారు. త్రోవగుంట సర్వేనంబర్ 494/3లో 2.53 ఎకరాలు భూమి ఉంది. అంతేకాదు ఆ భూమికి సంబంధించి ఎలాంటి సబ్‌డివిజన్ అయిన దాఖలాలు లేవు. అయితే 494/ 3బీలో 14 ఎకరాలు భూమి ఉన్నట్లు, అద్దంకికి చెందిన ఎం.శ్రీనివాసరావు వారసుడిగా నకిలీ పత్రాలు సృష్టించి మేయర్ భర్త అరుళ్‌రాజ్, ప్రభుదా్‌సల పేరుతో 14 ఎకరాల భూమిని జీపీఏ ఇస్తు రిజిస్ట్రేషన్ చేశారు. ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి వెలుగులోకి తేవడంతో కలకలం రేగింది. తమ భూములను కాపాడాలంటూ కలెక్టర్, ఎస్పీలకు మండువవారిపాలెంనకు చెందిన రైతులు ఫిర్యాదు చేశారు. దీంతో వారు విచారణకు ఆదేశించారు. కాగా అక్రమాక్కులు జీపీఏ చేయించుకున్న సర్వే నంబరు రికార్డులలో లేదని రెవెన్యూ అధికారుల పరిశీలనలో వెల్లడైంది. దీంతో మేయర్ గంగాడ సుజాత ఆమె భర్త అరుళ్‌రాజ్ ఆగమేఘాలపై తమ జీపీఏ రద్దుకోరుతూ రిజిస్ర్టార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఆ ఫిర్యాదు సిట్‌లో ఉండటంతో ఇంకా జీపీఏ రద్దు చేయలేదు. ఇదిలాఉండగా సిట్ అధికారుల సిఫార్సులతో అప్రమత్తమైన రిజిస్ట్రేషన్ శాఖ అక్రమాలకు పాల్పడిన సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్స్‌న్ వేటువేశారు. అయితే అందుకు కారణమైన అరుళ్‌రాజ్, ప్రభుదా్‌సలపై సిట్ అధికారులు చర్యలు చేపట్టలేదు. అక్రమాలు జరిగాయని స్పష్టమైనప్పటికి అందుకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకపోవడం సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
వైసీపీ నేతే సూత్రధారి
అక్రమ పట్టాలు, పాసుపుస్తకాల వ్యవహారంలో వైసీపీ నేతే కీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుల్లో ఒకరైన దద్దనాల కృష్ణారెడ్డి వైసీపీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఈయనతో పాటు గతంలో ఈ మండలంలో సర్టిఫైడ్ సర్వేయర్లు అన్నపు నాగరాజు, తండమాల వెంకట వరప్రసాద్, చిట్టేటి నాగరాజు, వీఆర్‌ఏగా ఉన్న గుమ్మడాల శ్రీనివాసులు ఈ అక్రమాల్లో భాగస్వాములయ్యారు. సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత సర్టిఫైడ్ సర్వేయర్లను ప్రభుత్వం పక్కనబెట్టింది. ఇక వీఆర్‌ఏ శ్రీనివాసులుపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు పడింది.
మరో ముగ్గురు సబ్‌రిజిస్ట్రార్ల సస్పెన్షన్ ?
నకిలీపత్రాల ద్వారా రిజిస్ట్రేషన్లకు పాల్పడి భూవివాదాలకు కారణమైన ముగుర్గు సబ్ రిజిస్ర్టార్లపై సస్పెన్షన్ వేటు వేసేందుకు రంగం సిద్ధమైంది. ఒంగోలులో వివాదాలకు ప్రధాన కార ణమైన పూర్ణచంద్రరావు ముఠాను పోలీసులు అరెస్టు చేసిన సమయంలో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లలో 52 నకిలీవిగా సిట్ అధికారులు తేల్చారు. నకిలీ వీలునామాల ద్వారా పత్రాలు తయారుచేసి కోట్ల విలువ చేసే ఆస్తులను కొల్లగొట్టారు. అందుకు ఒంగోలులో పనిచేస్తున్న రిజిస్ర్టేషన్ శాఖ అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చారు. దీంతో చర్యలకు రంగం సిద్ధం చేశారు. అదేవిధంగా మార్కాపురానికి సంబంధించిన ఆస్తిని యర్రగొండపాలెంలో రిజిస్ట్రేషన్ చేశారు. అందులోనూ అక్రమాలు జరిగినట్లు ఉన్నతాధికారులు విచారణలో గుర్తించారు. ఒంగోలులో ఇద్దరు, మంత్రి సురేష్ ఇలాకాలో ఒక సబ్‌రిజిస్ర్టార్‌పై వేటు వేసేందుకు ఉన్నతాధికారులు డీఐజీకి సిఫార్స్ చేశారు. ఆ మేరకు నేడో, రేపో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
నకిలీ పట్టాలు, పాస్‌పుస్తకాలతో మోసం
ఐదుగురు వ్యక్తుల అరెస్టు
కంభం (అర్థవీడు), నవంబరు 23: అర్థవీడు మండలం అర్థవీడు, పాపినేనిపల్లె గ్రామాలకు చెందిన రైతులకు నకిలీ పట్టాలు, పాస్‌పుస్తకాలు ఇచ్చి డబ్బులు వసూలు చేసిన ఐదుగురిని గుర్తించి వారిని అరెస్టు చేసినట్లు అర్థవీడు ఎస్సై నాగమల్లేశ్వరరావు గురువారం తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. అర్థవీడు రెవెన్యూ కార్యాలయంలో ఏడాదిన్నర క్రితం వీఆర్‌ఏ గుమ్మడాల శ్రీనివాసులు, సర్వేయర్లగా అన్నపు నాగరాజు, తండమాల వెంకట వరప్రసాద్, చిట్టేటి నాగరాజు, పనిచేశారు. వారందరితో కలిసి వైసీపీ నేత దద్దనాల కృష్ణారెడ్డి రింగ్ లీడర్‌గా మారి నకిలీ పాసుపుస్తకాలు, పట్టాలు తయారు చేసేవారు. నేరుగా అధికారులే వీటిని పంపిణీ చేయడంతో రైతులు కూడా విశ్వసించారు. అవి సరైనవేనని భావించారు. ఇలా అర్థవీడు, పాపినేనిపల్లి గ్రామాలకు చెందిన సుమారు 15మంది రైతులను వారు మోసగించారు. వారి వద్ద ఒక్కొక్కరి నుంచి రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేశారు. అవి నకిలీవని ఆలస్యంగా బాధిత రైతులు గుర్తించారు. అప్పటి తహసీల్దార్ రవిబాబుకు ఫిర్యాదు చేశారు. ఆయన విచారణలో తమ సిబ్బందే రైతులను మోసం చేశారని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసు విచారించి రైతులను మోసం చేసిన ఉద్యోగులను అరెస్టు చేశారు. గిద్దలూరు కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై నాగమల్లేశ్వరరావు తెలిపారు.
ఏడాదిన్నరపాటు పోలీసు స్టేషన్‌లోనే పెండింగ్
బాధిత రైతులు అక్రమాల గురించి స్థానిక నేత సిరివెళ్ల వెంకటేశ్వరెడ్డిని ఆశ్రయించారు. దీంతో రైతులు, వారికి ఇచ్చిన పట్టాలపై విచారించారు. సర్వే నంబరు 3లో పట్టాలు ఇచ్చినట్లు చూపారు. అయితే సర్వే నంబరులో ఎవరికి పట్టాలు ఇవ్వలేదు. దీంతో బాధిత రైతు.. అప్పటి ఎస్సై వెంకటేశ్వరనాయక్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే ఇది రెవెన్యూ పరమైన అంశం అని వారి నుంచే ఫిర్యాదు రావాలని పోలీసులు సూచించారు. మరోసారి రెవెన్యూ అఽధికారులకు రైతులు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి తహసీల్దార్ రవిబాబు ఈ కేసుపై విచారణ చేశారు. అక్రమాలు వాస్తవమే గుర్తించిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ లోపు అప్పటి ఎస్సై వెంకటేశ్వరనాయక్ బదిలీపై మార్కాపురానికి వెళ్లారు. నాటి ఇన్‌చార్జ్ ఏలుబడిలో స్టేషన్ ఉంది. దీని గురించి ఏడాదిన్నరపాటు పోలీసులు పట్టించుకోలేదు. ఇప్పుడు కంభం ఎస్సైగా ఉన్న నాగమల్లేశ్వరరావు అర్ధవీడు ఎస్సైగా బదిలీపై వచ్చారు. దీంతో బాధిత రైతులు మరోసారి పోలీసులను ఆశ్రయించారు. పెండింగ్ కేసుగా చూపుతుండడంతో ఆయన విచారించి కేసు నమోదు చేశారు. మొత్తంగా ఏడాదిన్నరపాటు ఈ కేసు అర్ధవీడు పోలీసు స్టేషన్‌లోనే పెండింగ్‌లో ఉండడం గమనార్హం.
Updated Date - 2023-11-23T23:44:36+05:30 IST