ఐదోరోజుకు చేరిన సమ్మె
ABN, Publish Date - Dec 17 , 2023 | 01:22 AM
డిమాండ్ల పరిష్కారం కోసం నిరవదిక సమ్మె చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు ఐదో రోజు శనివారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
గిద్దలూరు, డిసెంబరు 16 : డిమాండ్ల పరిష్కారం కోసం నిరవదిక సమ్మె చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు ఐదో రోజు శనివారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక రెవెన్యూ కార్యాలయం నుంచి పోలీసుస్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీసు అధికారులకు వినతిపత్రం అందజేశారు. తాము సమ్మెలో ఉండగా ఈ నెల 14న అంగన్‌వాడి కేంద్రాల తాళాలు పగులగొట్టిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయా లని సీఐకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఆవులయ్య, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ ఇబ్రహీం, అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు స్వర్ణ, మున్నా మాట్లాడుతూ న్యాయమైన కోర్కెల సాధన కోసం తాము పోరాటం చేస్తున్నామన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని చర్చల పేరిట కాలయాపన చేయకుండా పరిష్కరించాల న్నారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. సమ్మెకు ఏపీటీఎఫ్ నాయకులు మద్దతు ప్రకటించారు. అంగన్‌వాడీల ధర్నా వద్దకు వచ్చి ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.శ్రీనివాసులు, జిల్లా అదనపు కార్యదర్శి పాండురంగస్వామి, మండలశాఖ అధ్యక్షులు మస్తాన్‌వలి మద్దతు ప్రకటించారు.
బేస్తవారపేట : అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బంది న్యాయమైన డిమాండ్‌లను వెంటనే పరిష్కరించాలని అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా శనివారం మండల పరిషత్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్‌కేఎండీ ఇబ్రహీం మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బంది న్యాయపరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. అంగన్‌వాడి కేంద్రాల తాళాలు పగలగొట్టిన అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడి కేంద్రాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మార్కాపురం వన్‌టౌన్ : తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు చేస్తున్న సమ్మె శనివారం ఐదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కార్యకర్తలు వామపక్ష నాయ కులతో కలిసి పట్టణ, రూరల్ స్టేషన్లలో తమ అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టి స్వాధీనం చేసుకున్నవారిపై ఫిర్యాదు చేశారు. పట్టణంలోని అంగన్‌వాడీల బాధ్యత సచివాలయ సిబ్బంది, మెప్మా, ఆర్‌పీలకు అప్పజెప్పడంతో వాటి నిర్వాహణ అస్తవ్యస్తంగా మారింది. ఈ కేంద్రాలలో పిల్లల జాడ లేకుండా పోయింది. ఫోన్‌లతో సిబ్బంది కాలక్షేపం చేశారు. 8వ వార్డు అంగన్‌వాడీ పరిధిలో వచ్చిన పిల్లలకు కూడా పౌష్టికాహారం అందించలేదు. మొక్కుబడిగా కేంద్రాలను తెరిచి కూర్చున్నారు.
పొదిలి : అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని, ఐదురోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా ఐదవరోజు మండలపరిషత్ కార్యాల యం నుంచి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పొదిలి ప్రాజెక్ట్ అధ్యక్షురాలు శోభారాణి మాట్లాడుతూ కార్యకర్తల అనుమతి లేకుండా తాళాలు పగులగొట్టడం ఏమిటని ప్రశ్నించారు. జీతాలు ఇవ్వక పోయినా, సమ్మెను కొనసాగిస్తామన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం రమేష్ మాట్లాడుతూ.., ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి గ్రాట్యూటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయపరమైన హామీలను నెరవేర్చి మాట నిలుపుకోవాలన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఒంటెత్తు పోకడతో పాలన సాగిస్తు న్నారన్నారు. దానికి వచ్చే ఎన్నికల్లో తగిన ప్రతిఫలం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. అధికార దాహంతో పాదయాత్రలో నెరవేర్చలేని హామీలను జగన్ ఎందుకు ఇచ్చాడని ప్రశ్నించారు. సమస్యలపై ప్రభుత్వం వెంటనే పరిష్కారం వైపు దృష్టి పెట్టాలని కోరారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమ్మెలో పాల్గొన్నారు.
పెద్దదోర్నాల : ఐదు రోజులుగా ఆవేదనతో సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలుపుతున్నా, ఏ మాత్రం పట్టించుకోకపోవడం అమానుషమని అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు పేర్కొన్నారు. తమ సమస్యలను ప్రభుత్వానికి తెలపాలని, శనివారం తహసీల్దారు వేణు గోపాలరావుకు వినతిపత్రం అందజేశారు. స్థానిక ఆర్‌టీసీ బస్టాండు వద్ద అంతకుముందు అంగన్‌వాడీ కార్యకర్తలు నిరసన తెలిపారు. వీరి నిరసనకు పలు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జ్ గూడూరి ఎరిక్షన్‌బాబు నిరసన శిబిరం వద్దకు చేరుకొని సంఘీభావం తెలిపారు. మరోవైపు అంగన్‌వాడీ కేంద్రా లను ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో అంగన్ వాడీ కార్యకర్తలు శిబిరం నుండి తహసీల్దారు కార్యాలయం వరకు నిరసన తెలిపి ప్రదర్శనగా వెళ్లారు. తమకు ఉద్యోగభద్రత కల్పించాలని, కనీస వేతనం రూ.26వేలకు పెంచాలని, కేంద్రాలకు నాణ్యమైన మెనూ అందించాలని కోరుతూ తహసీల్దారు వేణుగోపాలరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ముంతాజ్‌బేగం, సుబ్బమ్మ, శ్రీలత, వెంకటలక్ష్మీ, భారతి, రైతు సంఘం నాయకులు తిరుపతి రెడ్డి, సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
Updated Date - Dec 17 , 2023 | 01:22 AM