ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

డోంట్‌ కేర్‌..!

ABN, Publish Date - Dec 14 , 2023 | 11:40 PM

సాక్షాత్తు జగన్‌ తీసుకున్న నిర్ణయమని చెబుతున్నా అభ్యర్థుల మార్పుపై వైసీపీ శ్రేణులు డోంట్‌కేర్‌ అంటున్నాయి. తమ అభిప్రాయాలు తెలుసుకోకుండా సీఎం నిర్ణయం తీసుకుంటే తాము అంగీకరించలేమని ద్వితీయశ్రేణి నాయకులు తేల్చేశారు. ఒకవైపు మార్పులను నిరసించే కార్యక్రమాలను ముఖ్యనేతలు చేపట్టగా, మరోవైపు కొందరు నేతలు వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నారు. ఫలితంగా వైపాలెం, ఎస్‌ఎన్‌పాడు, కొండపి, అద్దంకి నియోజకవర్గాల్లో వైసీపీలో అసమ్మతి పెరిగిపోయింది. వైపాలెంలో మంత్రికి అనుకూలంగా నాయకులు రాజీనామాబాట పట్టగా, ఎస్‌ఎన్‌పాడులో మంత్రి నాగార్జునను కలిసేందుకు ముఖ్య నాయకులు ముఖం చాటేశారు. బాలినేనితో కలిసి నిర్ణయం తీసుకునేందుకు హైదరాబాద్‌కు ఎస్‌ఎన్‌పాడు, కొండపి నేతలు పయనమయ్యారు. అద్దంకిలో అయితే పార్టీశ్రేణులు భారీసంఖ్యలో సమావేశమై కృష్ణచైతన్యకు మద్దతు తెలుపుతూ సీఎం నిర్ణయం మార్చు కోవాల్సిందేనని డిమాండ్‌ చేశారు.

మార్కాపురంలో మంత్రి సురేష్‌కు చెందిన జార్జి కళాశాలలో సమావేశమైన నేతలు

జగన్‌ నిర్ణయమైనా ఒప్పుకోం

వైసీపీలో ఆగని అసంతృప్తి జ్వాలలు

ఎర్రగొండపాలెంలో రాజీనామాలు

ఎస్‌ఎన్‌పాడులో నాగార్జునను కలవని ముఖ్య నేతలు

నేడు బాలినేనితో భేటీ కానున్న ఎస్‌ఎన్‌పాడు, కొండపి నేతలు

నాగార్జునకు హామీ ఇవ్వని మాజీమంత్రి

చైతన్యకే టికెట్‌ ఇవ్వాలంటూ అద్దంకి నేతల తీర్మానం

సాక్షాత్తు జగన్‌ తీసుకున్న నిర్ణయమని చెబుతున్నా అభ్యర్థుల మార్పుపై వైసీపీ శ్రేణులు డోంట్‌కేర్‌ అంటున్నాయి. తమ అభిప్రాయాలు తెలుసుకోకుండా సీఎం నిర్ణయం తీసుకుంటే తాము అంగీకరించలేమని ద్వితీయశ్రేణి నాయకులు తేల్చేశారు. ఒకవైపు మార్పులను నిరసించే కార్యక్రమాలను ముఖ్యనేతలు చేపట్టగా, మరోవైపు కొందరు నేతలు వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నారు. ఫలితంగా వైపాలెం, ఎస్‌ఎన్‌పాడు, కొండపి, అద్దంకి నియోజకవర్గాల్లో వైసీపీలో అసమ్మతి పెరిగిపోయింది. వైపాలెంలో మంత్రికి అనుకూలంగా నాయకులు రాజీనామాబాట పట్టగా, ఎస్‌ఎన్‌పాడులో మంత్రి నాగార్జునను కలిసేందుకు ముఖ్య నాయకులు ముఖం చాటేశారు. బాలినేనితో కలిసి నిర్ణయం తీసుకునేందుకు హైదరాబాద్‌కు ఎస్‌ఎన్‌పాడు, కొండపి నేతలు పయనమయ్యారు. అద్దంకిలో అయితే పార్టీశ్రేణులు భారీసంఖ్యలో సమావేశమై కృష్ణచైతన్యకు మద్దతు తెలుపుతూ సీఎం నిర్ణయం మార్చు కోవాల్సిందేనని డిమాండ్‌ చేశారు.

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల మార్పుపై సీఎం జగన్‌ నిర్ణయం తీసుకొని మూడు రోజులైనా పరిస్థితి కుదుటపడకపోగా ఆయా నియోజకవర్గాల్లో వైసీపీలో ముసలం పెరిగిపెద్దదైంది. మంత్రి సురే్‌షను కొండపికి మరో మంత్రి నాగార్జునను సంతనూతలపాడుకు కొత్తగా ఒక కాంట్రాక్టరు అయిన హనిమిరెడ్డిని అద్దంకి ఇన్‌చార్జులుగా సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. వైపాలెం అభ్యర్థి ఎంపికపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. కొత్త అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితిని చక్కబెట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు బెడసికొడుతున్నాయి. ఇంకోవైపు కొందరు ద్వితీయశ్రేణి నాయకులు పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ నేతలతో లోగుట్టుగా మంతనాలు కూడా ప్రారంభించారు. కొండపి, ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు కొందరైతే బాలినేనిపై భారమేసి ఆయనతో సమావేశం అయ్యేందుకు సిద్ధమయ్యారు. తనను కలిసిన మంత్రులు సురేష్‌, నాగార్జునలతో బాలినేని సానుకూలంగా స్పందించలేదని తెలిసింది. తాను ఒంగోలుకే పరిమితం మీదారి మీరు చూసుకోండని తేల్చిచెప్పినట్లు కూడా తెలిసింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు కొత్త అభ్యర్థుల అనుకూల, వ్యతిరేకులుగా విడిపోవటం ప్రారంభమై సరికొత్త సమీకరణలకు నాంది పలికారు.

వైపాలెంలో రాజీనామాలు

మంత్రి సురేష్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న వైపాలెంలో కొందరు నాయకులు పదవులకు రాజీనామాలు చేసే కార్యక్రమానికి శ్రీకారం పలికారు. మంత్రి సురే్‌షను వైపాలెంలోనే పోటీ చేయించాలనేది వారి డిమాండ్‌. గురువారం మార్కాపురంలోని మంత్రి కుటుంబానికి చెందిన కాలేజీలో నియోజకవర్గానికి చెందిన కొందరు నాయకులు సమావేశమయ్యారు. తనకు ఇష్టమున్నా లేకపోయినా సీఎం తీసుకున్న నిర్ణయం కాబట్టి వెనుకడుగు వేయలేకపోతున్నానని మంత్రి నాయకులకు చెప్పినట్లు తెలిసింది. అయితే మంత్రి అనుచరులుగా ఉన్న పలువురు నాయకులు తాము సీఎం నిర్ణయాన్ని అంగీకరించలేమని పదవులకు రాజీనామాల ద్వారా తమ నిరసన తెలియజేస్తామని తేల్చిచెప్పేశారు. త్రిపురాంతకం, వైపాలెం ఎంపీపీలు సుబ్బారెడ్డి, కిరణ్‌గౌడ్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ మూర్తిరెడ్డి, వైపాలెం పార్టీ కన్వీనర్‌ ఓబుల్‌రెడ్డి, త్రిపురాంతకం మండలానికి చెందిన నాయకుడు పిచ్చయ్య తదితరులు రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. రేపోమాపో మరికొందరు రాజీనామాలు చేయబోతున్నట్లు కూడా ఆ నాయకులు తెలిపారు. అందుకు అనుగుణంగా కిందిస్థాయి వరకు ఆయా పదవుల్లో ఉన్న నాయకులను సమీకరించే కార్యక్రమానికి శ్రీకారం పలికారు. మరోవైపు మంత్రి సురేష్‌ పట్ల అసంతృప్తిలో ఉన్న నాయకులు వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నారు. వారంతా కొత్తగా మంత్రి అనుచరుడైన అభ్యర్థి కాకుండా వేరే వారిని నియమించాలనే డిమాండ్‌ చేస్తున్నారు. పార్టీ ఇన్‌చార్జిగా కొత్తగా ఎవరిని నియమించాలనే విషయంపై ప్రతిష్టంభన నెలకొనటం విశేషం. ఈ విషయంలో జిల్లాలోని ముఖ్య నాయకుల మధ్య కూడా భేదాభిప్రాయాలు నెలకొన్నట్లు తెలిసింది.

నాగార్జునను కలవని ముఖ్య నేతలు

ఎస్‌ఎన్‌పాడు ఇన్‌చార్జిగా సీఎం జగన్‌ నిర్ణయించిన మంత్రి నాగార్జునను కలవకుండా నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు ముఖం చాటేశారు. ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ఎవరికీ అందుబాటులో లేకుండా వెళ్లిపోయారు. ఇటీవల సుధాకర్‌బాబుకు నాగార్జున మధ్య ఫోన్‌లో వాడివేడిగా మాటల యుద్ధం జరిగినట్లు ప్రచారం ఉంది. గురువారం సాయంత్రం నాగార్జున చీమకుర్తి వచ్చి జడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, శివప్రసాద్‌రెడ్డిలను కలిశారు. ఆ సందర్భంగా చీమకుర్తి మండలానికి సంబంధించి కొంతమంది నాయకులను శివప్రసాద్‌రెడ్డి పిలిపించారు. వారిలో ఒక సీనియర్‌ నాయకుడు బయట జిల్లా వారు వచ్చి ఇక్కడ ఏం చేస్తారంటూ సీఎం నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. శివప్రసాద్‌రెడ్డి జోక్యం చేసుకొని సముదాయించారు. మండలంలో బూచేపల్లికి దూరంగా ఉండే వైసీపీలోని మరోవర్గం వారు నాగార్జునను కలవలేదు. ఆ తర్వాత నాగార్జున ఎన్‌జీపాడు, ఎస్‌ఎన్‌పాడు మండలాలకు చెందిన నాయకులకు ఫోన్‌ చేసి కలిసే ప్రయత్నం చేయగా ఎవ్వరూ స్పందించలేదని తెలిసింది. కొందరైతే బాలినేని చెబితేనే వింటాం ఆయనతో మాట్లాడుకోండని తెగేసి చెప్పారు. దీంతో శనివారం తర్వాత మళ్లీ వచ్చి మిగిలిన నాయకులను కలిసే ప్రయత్నం చేయాలని నాగార్జున నిర్ణయించుకొని వెళ్లినట్లు సమాచారం.

అద్దంకిలో భారీగా సమావేశమైన వైసీపీ నేతలు

అద్దంకిలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన వేలాదిమంది వైసీపీ శ్రేణులు గురువారం సమావేశమయ్యారు. అటు పార్టీలోను ఇటు మండల, గ్రామస్థాయి ప్రభుత్వ పదవుల్లో ఉన్న ముఖ్య నాయకులు 80శాతంపైగా సమావేశానికి హాజరయ్యారు. వారంతా ఇన్‌చార్జిగా హనిమిరెడ్డిని నియమిస్తూ సీఎం తీసుకున్న నిర్ణయం సరైంది కాదని మాట్లాడారు. సీఎం తన నిర్ణయం మార్చుకొని కృష్ణచైతన్యను అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ తీర్మానం చేశారు. రానున్న రోజుల్లో కూడా చైతన్య సారధ్యంలోనే ముందుకు సాగుతామని ప్రకటించారు. చైతన్య కూడా సీఎంని మళ్లీ కలిసి టిక్కెట్‌ తెచ్చుకునే ప్రయత్నం చేస్తానని, మీరంతా అండగా ఉండాలని వారిని కోరారు. ఒక వైపు కొత్త ఇన్‌చార్జి హనిమిరెడ్డి సోదరులు ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఉండి పార్టీ నేతలందరినీ సమీకరించే ప్రయత్నం చేస్తుండగా అత్యధికశాతం నాయకులంతా చైతన్య వద్దకు సమావేశంకు వెళ్లటం విశేషం.

నేడు బాలినేని వద్దకు పయనం

ఎస్‌ఎన్‌పాడు, కొండపి నియోజకవర్గాలకు చెంది మొదటి నుంచి బాలినేనిని అనుసరిస్తున్న నాయకులంతా శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన్ను కలవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. కొందరు గురువారం రాత్రికి పయనమై వెళ్లగా మరికొందరు శుక్రవారం ప్రత్యేక వాహనాల్లో వెళ్తున్నారు. ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గంలోని మద్దిపాడు, ఎన్‌జీపాడు ఎంపీపీలు, సీనియర్‌ నాయకులు చెంచిరెడ్డి, పిచ్చిరెడ్డి తదితరులు కూడా నాగార్జునను కలవకుండా ముఖం చాటేసి బాలినేని వద్దకు వెళ్తున్నట్లు సమాచారం. ఎన్‌జీపాడు ఎంపీపీ భర్త కృష్ణారెడ్డి అయితే మంత్రి నాగార్జున ఫోన్‌ చేయగా బాలినేని చెబితే వస్తాం లేదంటే లేదు, దిగుమతి నాయకులను అంగీకరించలేమంటూ చెప్పినట్లు తెలిసింది. ఐదేళ్లకు ఒకసారి బయట జిల్లా వారిని తెచ్చి మామీద రుద్దుతారా అంటూ నియోజకవర్గంలోని వైసీపీలోని ముఖ్య నాయకులు బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

నేను జోక్యం చేసుకోను.. మీ ఇష్టం బాలినేని

కొండపి, ఎస్‌ఎన్‌పాడు ఇన్‌చార్జిలుగా నియమితులైన మంత్రులు సురేష్‌, నాగార్జునలు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేనిని వేర్వేరుగా కలిశారు. ఒంగోలులో మంత్రి సురేష్‌ కలవగా బుధవారం రాత్రి హైదరాబాద్‌లో నాగార్జున బాలినేనిని కలిశారు. మీరు మా నియోజకవర్గంకు రావాలి పార్టీ నాయకులతో మాట్లాడాలని ఇద్దరు కోరినట్లు తెలిసింది. అయితే బాలినేని నేను ఒంగోలుకే పరిమితమని నాకు సంబంధం లేదని నేను ఏమాత్రం జోక్యం చేసుకోనని తేల్చిచెప్పినట్లు తెలిసింది.

Updated Date - Dec 14 , 2023 | 11:40 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising