Outsourcing employees : దగా చేయొద్దు!
ABN, First Publish Date - 2023-12-11T03:05:51+05:30
తమకు అన్యాయం చేయొద్దని అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు వేడుకున్నారు. పాతికేళ్లుగా పనిచేస్తున్నా.. ఇంతవరకు రెగ్యులరైజేషన్‌కు నోచుకోలేదని వాపోయారు. దగా చేయకుండా తమను ఆప్కాస్ పరిధిలోకి తీసుకురావాలని, మినిమం టైమ్ స్కేల్స్
పాతికేళ్లుగా క్రమబద్ధీకరణేదీ?.. అవుట్‌సోర్సింగ్ సిబ్బంది ఆవేదన
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా స్వల్ప వేతనాలే
మినిమం టైమ్ స్కేల్సూ లేవు.. చిరుద్యోగుల సంక్షేమానికి గండి
వారిపై దయ చూపండి: బొప్పరాజు.. బెజవాడలో రాష్ట్ర మహాసభ
విజయవాడ, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): తమకు అన్యాయం చేయొద్దని అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు వేడుకున్నారు. పాతికేళ్లుగా పనిచేస్తున్నా.. ఇంతవరకు రెగ్యులరైజేషన్‌కు నోచుకోలేదని వాపోయారు. దగా చేయకుండా తమను ఆప్కాస్ పరిధిలోకి తీసుకురావాలని, మినిమం టైమ్ స్కేల్స్ వర్తింపజేయాలని అభ్యర్థించారు. ఏపీ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల ప్రథమ రాష్ట్ర మహాసభలు ఆదివారమిక్కడ జింఖానా గ్రౌండ్స్‌లో జరిగాయి. ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వ శాఖల ఉద్యోగులందరితో సమానంగా పనిచేస్తున్నా అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి ఇప్పటికీ ఉద్యోగ భద్రత లేకపోవటం దారుణమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ప్రభుత్వం గత పాతికేళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడానికి ఆమోదం తెలిపిందని.. అదే విధంగా గత పాతిక సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వివిధ శాఖలలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను కూడా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. వారందరికీ కాంట్రాక్టు ఉద్యోగుల తరహాలోనే కనీస సర్వీసు కటాఫ్ పెట్టి అందరికీ మినిమం టైమ్ స్కేల్ (ఎంటీఎస్) వర్తింపచేయాలన్నారు. అతి స్వల్ప వేతనాలతో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా వర్తింపచేయకపోవడం అన్యాయమన్నారు. రెగ్యులర్ ఉద్యోగులకు కల్పించిన 62 ఏళ్ల పదవీ విరమణ వయసును వారికీ వర్తింపజేయాలని.. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబం జీవనాధారం కోల్పోకుండా ఆ ఉద్యోగి కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీజే ఏసీ అమరావతి సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ.. అప్కాస్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ప్రజారవాణా, అటవీ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ, గురుకులాలు తదితర శాఖలలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను అప్కాస్ పరిధిలోకి తీసుకురాలేదన్నారు. కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు , జేఏసీ నాయకులు ఫణి పేర్రాజు, పారే లక్ష్మి, విజయలక్ష్మి, శివకుమార్ రెడ్డి, జీవీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర కమిటీ ఎన్నిక..
ఏపీ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర కమిటీని ఈ సందర్భంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కె.సుమన్ (ఎన్టీఆర్), ప్రధాన కార్యదర్శిగా అల్లం సురేశ్‌బాబు (నెల్లూరు), అసోసియేట్ ప్రెసిడెంట్‌గా పి.గురునాథ్ ( తూర్పుగోదావరి), ఉపాధ్యక్షులుగా జి.సంపత్ (ఎన్టీఆర్), ఎస్వీ కృష్ణ (నెల్లూరు), కే జే రామ్ (సీసీఎల్‌ఏ), ఆర్గనైజింగ్ సెక్రటరీగా పి.వేణు (ప్రకాశం), కార్యదర్శులుగా ఎం.మధుబాబు (ఏలూరు), పి.సుధీర్‌కుమార్ (గుంటూరు), రమణమూర్తి (విజయవాడ), పి.విజయభారతి (ఎన్టీఆర్), అనిల్ కుమార్ (గుంటూరు) ఎన్నికయ్యారు.
Updated Date - 2023-12-11T03:05:52+05:30 IST