పత్తికి దొరకని ‘మద్దతు’
ABN, Publish Date - Dec 26 , 2023 | 03:02 AM
మిచౌంగ్ తుఫాన్ పత్తి ధరపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వర్షాలకు తడిసి, నాణ్యత తగ్గిందనే కారణంగా ప్రైవేట్ వ్యాపారులు ధర తగ్గించారు.
పంట తీసే సమయానికి తుఫాను
రాష్ట్రంలో కుదేలయిన పత్తి రైతాంగం
వరుస విపత్తులతో ఈసారి సాగు తగ్గింపు
కానీ తడిసిందంటూ రేటు పతనం
సీసీఐల్లో అమలుకాని కనీస మద్దతు ధర
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
మిచౌంగ్ తుఫాన్ పత్తి ధరపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వర్షాలకు తడిసి, నాణ్యత తగ్గిందనే కారణంగా ప్రైవేట్ వ్యాపారులు ధర తగ్గించారు. తుఫాన్‌కు ముందు క్వింటా రూ.7,300 వరకు ఉన్న పత్తి ధర క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుత సీజన్‌లో పొడవు పింజ పత్తి క్వింటాలుకు రూ.7,020 కేంద్ర ప్రభుత్వం ఎమ్మెస్పీ ప్రకటించింది. దీనికి భిన్నంగా రాష్ట్రంలో ఆ ధర అందటం లేదు. ఈ నెల ఒకటో తేదీన నాటికి గరిష్ఠ ధర రూ.7,250వరకు ఉంది. ఆ తర్వాత తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో ఇప్పుడు క్వింటాకు రూ.300 తగ్గింది. ఆదోని మార్కెట్‌లో మాత్రమే నాణ్యమైన పత్తికి గరిష్ఠ ధర రూ.6,950 చెల్లిస్తున్నారు. కానీ రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో ప్రైవేట్ వ్యాపారులు అంత కూడా ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. అటు తెలంగాణలోనూ ఇటీవలి భారీ వర్షాల తర్వాత సీసీఐ క్వింటాకు రూ.100 తగ్గించింది. దీంతో రాష్ట్రంలోని మధ్యవర్తులు మరింత తగ్గించి అడుగుతున్నారు. మద్దతు ధరకు కాస్త అటు ఇటుగా ఉన్నప్పుడు రైతులు స్థానిక వ్యాపారులకే అమ్మేస్తున్నారు. సీసీఐ కేంద్రాలకు వెళ్లాలంటే రవాణా ఖర్చుల భారంతో పాటు సమయం వృథా అవుతుందని భావిస్తారు. పైగా ఈ-క్రాప్ నమోదు, ఆధార్, బ్యాంక్ ఖాతా, పంట సాగు హక్కు పత్రాలంటూ మార్కెటింగ్ శాఖ ఆంక్షలు పెడుతుంది. అయితే వర్షాలకు పత్తి నాణ్యత తగ్గిందని వ్యాపారులు ధర తగ్గిస్తుండటంతో రైతులు సీసీఐ కేంద్రాలను ఆశ్రయించక తప్పని పరిస్థితి. కానీ సీసీఐ నాణ్యమైన పత్తికి మాత్రమే మద్దతు ధర ఇస్తోంది. నాణ్యత తగ్గిన పత్తికి తూకంలో కోత పెడుతున్నారు. దీంతో రవాణా ఖర్చుల భారం భరించి తీసుకెళ్లిన తమ పత్తికి, తూకానికి తగ్గట్టు మద్దతు ధర రాక రైతులు నష్టపోతున్నారు.
సాగు తగ్గినా..దక్కని ధర
ఏటా 16లక్షల ఎకరాల్లో వేయాల్సిన పత్తి ఈ ఏడాది తీవ్ర వర్షాభావం తో ఆరు లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. కొంత పత్తి తీశాక, ఇంకా పొలాల్లో పత్తి ఉన్న సమయంలో తుఫాన్ ముంచెత్తింది. పత్తి అంతా తడిసిపోయి, ఎకరానికి రెండు, మూడు క్వింటాళ్ల దిగుబడి తగ్గింది. ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యాపారులు, సీసీఐ కూడా కనీస మద్దతు ధర ఇవ్వకపోతుండటంతో బాగా నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. 2020-21లో కొవిడ్ కారణంగా వస్త్ర వినియోగం పెరిగి, పత్తి క్వింటా రూ.15వేలు దాకా పలికింది. 2022లో కూడా క్వింటా రూ.9వేలు పైనే ఉంది. కానీ వర్షాభావం, తుఫాన్‌కు పంట సాగు, ఉత్పత్తి తగ్గినా, రైతుకు మద్దతు ధర కూడా దక్కట్లేదు. తాజా సమాచారం ప్రకారం, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 87.10 లక్షల బేళ్ల విత్తన పత్తిని సీసీఐ సేకరించింది. ఈ ఏడాది రాష్ట్రంలో 15 లక్షల బేళ్ల పత్తి సేకరించాలని సీసీఐ లక్ష్యంగా పెట్టుకున్నా, ఇప్పటివరకు 10వేల బేళ్లు మాత్రమే కొనుగోలు చేసినట్టు సమాచారం.
Updated Date - Dec 26 , 2023 | 03:02 AM