అన్నదాతను ముంచిన మిచౌంగ్
ABN, First Publish Date - 2023-12-06T22:01:47+05:30
మిచౌంగ్ తుఫాన్‌తో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరి నారుమళ్లు నీట మునగడంతో మళ్లీ నారు పోసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండలంలో దాదాపు 9,500 ఎకరాలకు అవసరమైన నారుమళ్లను సిద్ధం
నీళ్లలోనే నారుమళ్లు, వరినాట్లు
దెబ్బతిన్న వేరుశనగ
ఆక్వారంగానికి తీరని నష్టం
ముత్తుకూరు, డిసెంబరు 6 : మిచౌంగ్ తుఫాన్‌తో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరి నారుమళ్లు నీట మునగడంతో మళ్లీ నారు పోసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండలంలో దాదాపు 9,500 ఎకరాలకు అవసరమైన నారుమళ్లను సిద్ధం చేసుకున్నారు. మరో 2వేల ఎకరాల్లో ఇప్పటికే వరి నాట్లు వేశారు.కురిసిన వర్షాలకు పొలాలు చెరువుల్లా మారాయి. దాదాపు 250 ఎకరాల్లో వేరుశనగ నీట మునిగింది.ఈ తుఫాన్ ఆక్వా రైతులను కూడా దెబ్బతీసింది. రొయ్యల చెరువులో నీరు నిండిపోవడంతో రొయ్యలు వరదలో కొట్టుకుపోయాయి. కొన్ని చోట్ల చెరువులు నీరు అధికమైందని కలుజులు ఎత్తివేయడంతో చేపల వేలం పాడుకున్న మత్స్యకారులు నష్టపోవాల్సి వచ్చింది.
తక్షణ సాయం అందించేందుకు చర్యలు : కాకాణి
తుఫాన్ బాధితులకు తక్షణం సాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి చెప్పారు. బుధవారం మండలంలోని బ్రహ్మదేవం విద్యుత్ సబ్‌స్టేషన్‌ను పరిశీలించారు. గ్రామాలకు శరవేగంగా విద్యుత్ పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ముత్తుకూరు ఎస్టీ కాలనీలో పర్యటించారు. కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ మెట్ట విష్ణువర్ధన్‌రెడ్డి, తహసీల్దారు బాలకృష్ణారెడ్డి, ఎంపీడీవో లక్ష్మణకుమార్, నాయకులు నెల్లూరు శివప్రసాద్, కాకుటూరు లక్ష్మణ్‌రెడ్డి, దువ్వూరు చంద్రశేఖర్‌రెడ్డి, మస్తాన్, తదితరులు పాల్గొన్నారు.
సంరక్షణ చర్యలు చేపట్టాలి
సకాలంలో సంరక్షణ చర్యలు తీసుకుంటే వేరుశనగను కాపాడుకోవచ్చని వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వినీత తెలిపారు. బుధవారం పంటపాలెంలో ఇందుకూరుపేట ఏడీఏ రాజ్‌కుమార్‌తో కలిసి వర్షానికి దెబ్బతిన్న వేరుశనగ పొలాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేరుశనగ పొలంలో ఉన్న నీటిని తీసివేసి కార్బన్ డీజమ్ లేదా సాఫ్ తెగులు మందులను పిచికారీ చేసుకుంటే వేరు కుళ్లు తెగులు రాకుండా ఉంటుందన్నారు. పైర్లు పూర్తిగా దెబ్బతిన్న రైతులకు రాయితీపై విత్తనాలు ఇస్తామని ఏడీఏ రాజ్‌కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిణి జ్యోత్స్నారాణి, గ్రామ వ్యవసాయ సహాయకురాలు రమణమ్మ, తదితరులు పాల్గొన్నారు.
ముంపునకు గురైన వరినాట్ల పరిశీలన
కోవూరు : భారీ వర్షాల వల్ల ముంపునకు గురైన వరినాట్లను వ్యవసాయాధికారిణి ఇందిరావతి బుధవారం పరిశీలించారు. మండలంలోని గంగవరం గ్రామ పొలాల్ని పరిశీలిచారు. నారుమళ్లల్లో నీరు తీసిన తరువాత ప్రతి ఐదు సెంట్లకు కిలో యూరియా, కిలో పొటాష్ చల్లుకోవాలన్నారు. వరద తాకిడి తట్టుకున్న తరువాత గ్రాము కార్బన్‌డైజోమ్‌ను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. వరద తాకిడి తగ్గాక రైతులు నాట్లు వేసుకోవాలని తెలిపారు.
అంధకారంలోనే బుచ్చి
బుచ్చిరెడ్డిపాళెం : తుఫాన్ గాలులతో స్థానిక కాశీపాళెంలోని మలిదేవి పక్కవీఽధిలో ఓ విద్యుత్ స్తంభం కూలి చెట్టుపై పడింది. మరమ్మతులు చేస్తుండగా ఆ వీధిలోని మరో ఐదు స్తంభాలు కూలాయి. అక్కడున్న ట్రాన్స్‌ఫార్మర్ పక్కకు ఒరిగింది. విద్యుత్ తీగలు వేలాడుతుండడంతో రాకపోకలు ఇబ్బందు ఏర్పడ్డాయి. విద్యుత్ అధికారులు, సిబ్బంది వస్తున్నారు వెళ్తున్నారు తప్ప పట్టించుకోవడంలేదు. వెంటనే విద్యుత్ సరఫరా ఇవ్వాలని ఆప్రాంతానికి చెందిన లక్ష్మి,రూపతోపాటు పలువురు మహిళలు కోరారు.
-----------------
Updated Date - 2023-12-06T22:01:49+05:30 IST