కేన్సర్ యూనిట్‌కు నిర్లక్ష్యం జబ్బు!
ABN, Publish Date - Dec 26 , 2023 | 03:13 AM
రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఏపీకి మంజూరైన ‘స్టేట్ కేన్సర్ యూనిట్’ను కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల (కేఎంసీ) ఆవరణలో నిర్మించాలని భావించారు.
ఐదేళ్లు కావస్తున్నా ప్రారంభానికి నోచుకోని వైనం
2022 జూన్‌లోనే సేవలందించాలని లక్ష్యం
నాలుగున్నరేళ్లలో పూర్తిచేసింది 95 శాతమే
లీనియర్ యాగ్జిలేటర్ సహా వివిధ యంత్రాలకు టెండర్లు
ఫర్నిచర్, ఇతర పరికరాల కొనుగోలు ఎప్పుడో..?
ఎన్నికలు సమీపిస్తుండడంతో
సీఎంతో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు
(కర్నూలు - ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఏపీకి మంజూరైన ‘స్టేట్ కేన్సర్ యూనిట్’ను కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల (కేఎంసీ) ఆవరణలో నిర్మించాలని భావించారు. దీని నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భవన నిర్మాణం, కేన్సర్ చికిత్స అందించే అధునాతన సాంకేతిక యంత్రాలు కొనుగోలు.. వంటి వాటి కోసం రూ.120 కోట్లు కేటాయించారు. దీనిలో కేంద్ర ప్రభుత్వం 60 శాతం (రూ.72 కోట్లు), రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం (రూ.48 కోట్లు) నిధులు సమకూర్చాల్సి ఉంది. కేన్సర్ ఆస్పత్రి కోసం పలు ప్రాంతాల్లో గత టీడీపీ ప్రభుత్వం స్థలాలు పరిశీలించి.. కేఎంసీలోనే 9 ఎకరాలు కేటాయించింది. డిజైన్, సాంకేతిక పరిజ్ఞానం సేవలు అందించేందుకు టాటా కన్సల్టెన్సీకి, పర్యవేక్షణ బాధ్యతలు ఏపీఎంఎ్‌సఐడీసీకి అప్పగించింది. 2018లో టెండర్ల ప్రక్రియ పూర్తిచేశారు. హైదరాబాద్‌కు చెందిన సాయి పవర్ కన్‌స్ట్రక్షన్ సంస్థ పనులు దక్కించుకుంది. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ రెండు అంతస్తులు (జీ+1)లో 1.20 లక్షల చదరపు అడుగుల్లో విస్తీర్ణంలో 9 బ్లాకుల్లో లీనియర్ యాగ్జిలేటర్ (రోగి కేన్సర్‌ను గుర్తించి రేడియేషన్ ట్రీట్‌మెంట్ ఇచ్చే కేంద్రం) సెంటర్, ఎల్‌ఏ-1, ఎల్‌ఏ-2 చాంబర్స్, 3 ఆపరేషన్ థియేటర్లు (ఓటీ), ఎమర్జెన్సీ వార్డు, జనరల్ వార్డులు, ఐసీయూ సహా వివిధ విభాగాలు నిర్మించేలా డిజైన్ చేశారు. రూ.35 కోట్లతో 15 నెలల్లో పూర్తి చేయాలని 2019 జనవరి 22న టెండరు దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థతో ఏపీఎంఎ్‌సఐడీసీ ఇంజనీర్లు ఒప్పందం చేసుకున్నారు. టీడీపీ ప్రభుత్వంలోనే పనులు మొదలయ్యాయి. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ సెంటర్‌పై అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శించింది. ఫలితంగా నాలుగున్నరేళ్లయినా ఈ సెంటర్ ఇంతవరకు ప్రారంభం కాలేదు.
అందుబాటులోకి ఎప్పుడో..?
ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలతో పాటు సరిహద్దున తెలంగాణ, కర్ణాటక నుంచి వివిధ జబ్బులతో పాటు కేన్సర్ రోగులు కూడా ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ స్టేట్ కేన్సర్ యూనిట్ నిర్మిస్తే మెరుగైన వైద్యసేవలు అందుతాయని రోగులు ఆశించారు. కానీ, జగన్ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే 25 శాతంలోపు పనులు ఆపేయాలని ఇచ్చిన జీవో ఈ సెంటర్‌కు శాపమైతే.. కరోనా కూడా మరో అవరోధంగా నిలిచింది. ఆ తర్వాత కూడా నిధుల కొరత, పాలకుల నిర్లక్ష్యంతో పురోగతి నత్తతో పోటీపడింది. దీంతో 15 నెలల్లో పూర్తి చేయాల్సిన భవన నిర్మాణం.. అనేక అడ్డంకులను దాటుకుని 95శాతం పూర్తిచేసినా ప్రారంభించలేని పరిస్థితి. జాప్యం వల్ల నిర్మాణ వ్యయం రూ.39 కోట్లకు పెరిగింది. ఫలితంగా ఖజానాపై రూ.4 కోట్లు అదనపు భారం తప్పలేదు. అలాగే గ్రీనరీ, లిఫ్టులు, అగ్ని మాపక రక్షణ పరికరాల ఏర్పాటు కోసం మరో రూ.10 కోట్లతో టెండర్లు పలిచారు. అవి ఇంకా అందుబాటులోకి రాలేదు. కానీ, 2-3 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో హడావుడిగా సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంట్రాక్ట్ సంస్థకు రూ.8 కోట్ల బిల్లులు బకాయి ఉన్నట్లు సమాచారం.
కీలక యంత్రాలేవీ?
కేన్సర్ చికిత్సకు అవసరమైన సామగ్రి కొనుగోలుకు రూ.92 కోట్లు కేటాయించారు. కేన్సర్ చికిత్సలో అత్యంత కీలకమైన లీనియర్ యాగ్జిలేటర్ (రోగి కేన్సర్ గుర్తించి రేడియేషన్ ట్రీట్‌మెంట్) వేనియర్ మిషన్లు, బ్రాకీ థెరపీ, సిటీ సిమిలేర్, వెట్ సిటీ స్కాన్, ఎక్స్ రే, ఎంఆర్‌ఐ.. వంటి అత్యాధునిక యంత్రాలు కొనుగోలు చేయాల్సి ఉంది. వీటికి టెండర్లు పిలిచినా కాంట్రాక్ట్ సంస్థ నిధులు వస్తాయో రావో..? అనే భయంతో తెప్పించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేన్సర్ చికిత్సలో ఎంతో కీలకమైన లీనియర్ యాగ్జిలేటర్ మిషన్‌ను జర్మనీ, అమెరికాల నుంచి దిగుమతి చేసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. అవి ఇంకా రాకపోవడంతో లీనియర్ యాగ్జిలేటర్ చాంబర్ల నిర్మాణం పూర్తయినా మిషన్ ఏర్పాటు పనులు అసంపూర్తిగా ఉన్నాయి. వివిధ విభాగాల్లో అవసరమైన ఫర్నిచర్ కూడా కొనుగోలు చేయలేదు. దీంతో తాత్కాలికంగా ఓపీ బ్లాక్‌ను అందుబాటులోకి తెచ్చి... ఆ తర్వాత అవసరమైన ఫర్నిచర్ కొనుగోలు చేయవచ్చని అధికారులు అంటున్నారు.
ఐదేళ్లవుతోంది.. ఇంకెప్పుడు బుగ్గన..?
ఉమ్మడి కర్నూలు జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళ్తానంటూ నిత్యం ప్రగల్బాలు పలికే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కేన్సర్ ఆస్పత్రిని మాత్రం పట్టించుకోవడం లేదు. ఆర్థికశాఖతో పాటు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా కొనసాగుతున్న ఆయన ఈ సెంటర్‌ను పూర్తి చేయడంలో విఫలమయ్యారని కర్నూలు జిల్లాకు చెందిన పలు పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి భవన నిర్మాణాలపై ఎన్నోసార్లు సమీక్షలు జరిపిన బుగ్గన రోగులకు అందుబాటులోకి తీసుకురావడంలో విఫలమయ్యారని విమర్శిస్తున్నారు.
భవనాల నిర్మాణం పూర్తి చేశాం
‘‘స్టేట్ కేన్సర్ యూనిట్‌ను రూ.35 కోట్లతో చేపట్టాం. వివిధ కారణాలు వల్ల జాప్యం జరిగింది. 95 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. మరో వారం రోజుల్లో వంద శాతం పనులు పూర్తి చేస్తాం. కేన్సర్ చికిత్సకు అవసరమైన యంత్రాలు హెడ్ ఆఫీస్ కొనుగోలు చేయాల్సి ఉంది.’’
- శివకుమార్, ఈఈ,
ఏపీఎంఎ్‌సఐడీసీ, కర్నూలు
వేల కోట్ల రూపాయలు వ్యయం చేసి ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మార్చేస్తున్నాం... అత్యాధునిక సదుపాయాలు కల్పిస్తున్నాం... ఆరోగ్యశ్రీ కింద చికిత్సల వ్యయ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచాం... అంటూ ఊదరగొడుతున్న వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరైన ‘స్టేట్ కేన్సర్ యూనిట్’ను పూర్తిచేయడంలో మాత్రం అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో కర్నూలులో ఈ స్టేట్ కేన్సర్ యూనిట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినా.. జగన్ సర్కారు ఈ నాలుగున్నరేళ్లలో ముక్కుతూ.. మూలుగుతూ భవన నిర్మాణాన్ని 95 శాతమే పూర్తిచేసింది. 2022 జూన్‌లోనే ప్రారంభం కావాల్సిన సెంటర్‌కు అవసరమైన యంత్రాలు, ఫర్నిచర్‌ను ఇంతవరకు సమకూర్చలేకపోయింది. ఎన్నికలు సమీపిస్తుండడంతో ముఖ్యమంత్రి చేతులమీదుగా దీన్ని ప్రారంభించేందుకు హడావుడి మొదలైంది.
Updated Date - Dec 26 , 2023 | 03:13 AM