కేటాయింపులు ఘనం.. నిధులపై నిర్లక్ష్యం
ABN, First Publish Date - 2023-12-11T01:23:44+05:30
రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో కీలక భూమిక వహించే సాగునీటి ప్రాజెక్టులకు ఏ ప్రభుత్వమైనా అత్యంత ప్రాధాన్యం ఇస్తుంటుంది. కానీ నాలుగున్నరేళ్లుగా సీఎం జగన్ వీటిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏటా బట్జెట్‌లో ఘనంగా కేటాయింపులు చేస్తున్నా.. నిధుల విడుదలకు చేతులు రావడం లేదు.
భారీ ప్రాజెక్టులే కాదు.. చిన్న పథకాలపైనా జగన్ తీరు అదే
చెరువుల అభివృద్ధి ఊసే లేదు
డబ్బులివ్వక కాంట్రాక్టర్లు దూరం
చంద్రబాబు ఐదేళ్ల హయాంలో సీమ ప్రాజెక్టులకు రూ.8,291 కోట్లు
జగన్ పాలనలో ఖర్చు 2,011 కోట్లే
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో కీలక భూమిక వహించే సాగునీటి ప్రాజెక్టులకు ఏ ప్రభుత్వమైనా అత్యంత ప్రాధాన్యం ఇస్తుంటుంది. కానీ నాలుగున్నరేళ్లుగా సీఎం జగన్ వీటిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏటా బట్జెట్‌లో ఘనంగా కేటాయింపులు చేస్తున్నా.. నిధుల విడుదలకు చేతులు రావడం లేదు. దరిమిలా పనులు ముందుకు కదలడం లేదు. భారీ పథకాలకే కాదు.. మధ్య తరహా, చిన్నతరహా నీటిరంగం కుదేలైపోయాయి. చెరువుల అభివృద్ధి ధ్యాసే లేకుండా పోయింది. నిధుల లేమితో సతమతమవుతున్న జల వనరుల శాఖలో పనులు చేపట్టేందుకు కాంట్రాక్టు సంస్థలు ముందుకు రావడం లేదు. గత ప్రభుత్వ హయాంలో 70 శాతానికి పైగా పూర్తయిన ప్రాజెక్టులు.. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. చంద్రబాబు హయాంలో, జగన్ జమానాలోనూ సాగునీటి రంగానికి కేటాయించిన నిధులు పరిళీలిస్తే.. ఈ రంగానికి ఎవరెంత ప్రాధాన్యమిచ్చారో స్పష్టమవుతుంది. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం రూ.68,883.71 కోట్లు వ్యయం చేసి.. 62 ప్రాజెక్టుల్లో 23 పూర్తిచేసి 32.02 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించింది. 7లక్షల ఎకరాలను కొత్తగా సాగులోకి తెచ్చింది. రాష్ట్రంలో 3,348 నీటికుంటలు అభివృద్ధి చేసి 4,738 చెరువులను అనుసంధానం చేసింది. 93,208 చెక్‌డ్యామ్‌లు, 27,866 ఊట చెరువులు, 8.4 లక్షల పంటకుంటలు తవ్వి.. 3నుంచి 8 మీటర్లలోనే భూగర్భ జలాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది. జగన్ పాలనలో ప్రాజెక్టులకు రూ.32,059.61 కోట్లను కేటాయించినా.. పనులు పెద్దగా జరుగలేదు. కాంట్రాక్టు సంస్థలకు దాదాపు రూ.10,000 కోట్లను చెల్లించారు. మిగిలిన నిధులు ఖర్చుపెట్టలేదు. ఏడాదికి సగటున రూ.4,400కోట్లు మాత్రమే సాగునీటి రంగంపై ఖర్చు చేసింది. బడ్జెట్‌లో 2.62ు వ్యయం చేసింది. రివర్స్ టెండరింగ్ పేరిట కాలయాపనచేసి కాంట్రాక్టు సంస్థలను మార్చేసింది. పనులు ముందుకు సాగనివ్వలేదు.
సీమపై అలక్ష్యం..
గత ప్రభుత్వ హయాంలో రాయలసీమ ప్రాజెక్టులపై రూ.8,291.76 కోట్లు వ్యయం చేస్తే.. జగన్ సర్కారు అందులో నాలుగో వంతు కూడా చేయలేదు. 2,011.23 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని ఆర్భాటంగా ప్రకటించి.. ఎన్‌జీటీ ఇచ్చిన స్టే ఉత్తర్వుల ఎత్తివేతకు ఒక్కడుగు ముందుకు వేయలేదు. హంద్రీ-నీవా ప్రాజెక్టుకు గత ప్రభుత్వం రూ.4,182కోట్లు వ్యయం చేస్తే.. జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు ఖర్చు చేసింది రూ.515.78 కోట్లు. నిధులివ్వకుండా జాప్యం చేయడమే కాకుండా అంచనాలను రూ.1,977కోట్లు పెంచేశారు.
ఉత్తరాంధ్రదీ అదే పరిస్థితి..
వెనుకబడిన ఉత్తరాంధ్ర నిర్లక్ష్యానికి గురైందంటూ.. విశాఖలో పరిపాలనా రాజధానిని తెచ్చి.. దాని రూపురేఖలు మార్చేస్తామని పదే పదే ప్రకటిస్తున్న జగన్ అండ్ కో.. ఈ ప్రాంతంలో అత్యంత కీలకమైన ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పూర్తిగా విస్మరించారు. వంశధార, మహేంద్రతనయ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గుయ్యాయి.
ఎవరి పాలనలో ఎంత వ్యయం (రూ.కోట్లలో)
Updated Date - 2023-12-11T01:23:45+05:30 IST