ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎన్నికలొస్తున్నాయ్‌.. మా వాటా ఇవ్వాల్సిందే!

ABN, Publish Date - Dec 18 , 2023 | 11:57 PM

ఎన్నికలు రాబోతున్నాయని, తమకూ ఖర్చులు పెరిగిపోయాయని, ఎల్లెల్సీ ఆధునికీకరణ పనులకు అగ్రిమెంట్‌ అయిన వెంటనే 5 శాతం వాటా డబ్బులు ఇవ్వాలని అధికార పార్టీ నాయకులు కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెస్తున్నారు.

రూ.919 కోట్లతో ఎల్లెల్సీ ఆధునికీకరణ

5 శాతం పర్సంటేజీకి ప్రజాప్రతినిధుల చీకటి ఒప్పందం

ఏడాదిన్నర గడిచినా బిల్లులు అందక కాంట్రాక్టర్ల గగ్గోలు

వాటా ఇవ్వాల్సిందేనని వైసీపీ ముఖ్య ప్రజాప్రతినిధి ఒత్తిడి

ఎన్నికలు రాబోతున్నాయని, తమకూ ఖర్చులు పెరిగిపోయాయని, ఎల్లెల్సీ ఆధునికీకరణ పనులకు అగ్రిమెంట్‌ అయిన వెంటనే 5 శాతం వాటా డబ్బులు ఇవ్వాలని అధికార పార్టీ నాయకులు కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెస్తున్నారు. వీలైనంత త్వరగా పర్సంటేజీ డబ్బులు ఇవ్వాలని తుంగభద్ర ప్రాజెక్టు బోర్డు (టీబీపీ) కాంట్రాక్టర్లపై రాయలసీమకు చెందిన మంత్రి ఒకరు, ఇద్దరు కీలక ప్రజా ప్రతినిధులు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. రాజకీయ నాయకులు, బోర్డు ఇంజనీర్ల మాటలు నమ్మి రూ. వందల కోట్లు అప్పు చేసి సీసీ లైనింగ్‌ పనులు చేస్తే ఏడాదిన్నర గడిచినా బిల్లులు రాలేదని, వడ్డీలు పెరిగిపోతున్నాయని కాంట్రాక్టర్లు ఆవేదన చెందుతున్నారు. బ్యాంకులు, అప్పులు ఇచ్చిన ఆసాములకు మొహం చూపించలేకపోతున్నామని, ప్రజా ప్రతినిధులతో చీకటి ఒప్పందం మేరకు వాటాలు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి తేవాలని ప్రశ్నిస్తున్నారు. ముందు బిల్లులు ఇప్పించండి.. ఆ తరువాత వాటాలు గురించి ఆలోచిద్దాం..! అంటూ బిల్లులు రాక గగ్గోలు పెడుతున్న కాంట్రాక్టర్లు తెగేసి చెప్పినట్లు సమాచారం. ఎల్లెల్సీ ఆధునికీకరణలో ఆర్‌సీసీ లైనింగ్‌ పనులకు దాదాపు రూ. 350 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌ ఉన్నట్లు తెలుస్తున్నది. నిధుల కోసం ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశామని టీబీపీ బోర్డు ఎస్‌ఈ శ్రీకాంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

కర్నూలు, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల జీవనాడులు తుంగభద్ర ఎల్లెల్సీ, హెచ్చెల్సీ కాలువలు. తుంగభద్ర జలాశయం నుంచి 1955-57 నాటికే ఎల్లెల్సీ, హెచ్‌ఎల్‌సీ, రాయచూరు మెయిన్‌ కెనాల్‌ పనులు పూర్తి చేసి ఆయకట్టుకు సాగునీరు విడుదల చేశారు. కర్నూలు జిల్లాలో ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో ఎల్లెల్సీ కింద ఖరీఫ్‌, రబీలో 1,51,413 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు పట్టణాలతో పాటుగా 139 గ్రామాలకు తాగునీరు అందించాల్సి ఉంది. తుంగభద్ర జలాశయం నుంచి ఎల్లెల్సీ కాలువకు కృష్ణా వాటర్‌ డిస్ప్యూట్‌ ట్రైబ్యునల్‌ (కేడబ్ల్యూడీటీ-1) అవార్డు 24 టీఎంసీల నీటి వాటా కేటాయించారు. 0/0 కి.మీల నుంచి 241 కి.మీల వరకు ప్రధాన కాలువ తుంగభద్ర ప్రాజెక్టు బోర్డు పర్యవేక్షణలో ఉంది. నీటి వాటా రాబట్టడంతో పాటు కాల్వల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం ఏటా రూ.40 కోట్లు నిధులు కేటాయిస్తుంది. 70 ఏళ్ల క్రితం నిర్మించిన ఎల్లెల్సీ కాలువ గట్లు బలహీనంగా మారాయి. పూడిక, ముళ్ల కంపలు పెరిగిన నీటి ప్రవాహ సామర్థ్యం తగ్గింది. ఈ తరుణంలో ఏటేటా రైతులకు కడగండ్లు తప్పడం లేదు. దీంతో 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో రూ.919.80 కోట్లతో ఆధునికీకరణ పనుల్లో భాగంగా తుంగభద్ర ప్రాజెక్టు (టీబీపీ) బోర్డు ఇంజనీర్ల పర్యవేక్షణలో టీబీపీఆర్‌సీసీ లైనింగ్‌ చేపట్టారు.

రూ.350 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌

ఏపీ ప్రభుత్వం ఆమోదంతో 2022-23లో రూ.519.80 కోట్లతో టెండర్లు పిలిచారు. అందులో రూ.448 కోట్లతో 115.275 కి.మీల నుంచి 205.45 కిమీల వరకు అంటే 90.175 కి.మీల వరకు ఆర్‌సీసీ లైనింగ్‌ పనులకు 9 ప్యాకేజీలుగా విభజించి ఇ-ప్రొక్యూర్మెంట్‌ టెండర్లు పిలిచారు. పేరుకే ఇ-ప్రొక్యూర్మెంట్‌ టెండర్లు.. పనులు పంపకాలు అంతా బళ్లారి కేంద్రంగా రాయలసీమ జిల్లాలకు చెందిన ఓ మంత్రి, ఇద్దరు కీలక ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లో జరిగాయని సమాచారం. అలాగే ప్రభుత్వంలో చక్రం తిప్పే ముగ్గురు కీలక నాయకులు కూడా టెండర్లలో ముఖ్య పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి. టెండరు దక్కించుకుని టీబీపీ బోర్డు ఇంజనీర్లతో అగ్రిమెంట్‌ చేసుకున్న వెంటనే పనులు పంపకాలు చేసిన సీమ జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులకు 5 శాతం చొప్పున సుమారుగా రూ.25 కోట్లకు పైగా పర్సంటేజీ ఇవ్వాలని కాంట్రాక్టర్లు, ప్రజా ప్రతినిధుల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. 2022-23లో దాదాపు రూ.215 కోట్లు విలువైన పనులు చేస్తే.. కేవలం రూ.75-80 కోట్లు బిల్లులు చెల్లించారని, రూ.135-150 కోట్లకు పైగా బకాయి ఉందని కాంట్రాక్టర్లు అంటున్నారు. ఈ ఏడాది సుమారుగా రూ.233 కోట్లతో ఆర్‌సీసీ లైనింగ్‌ బ్యాలెన్స్‌ చేపట్టి రూ.200 కోట్లకు పైగా ఖర్చు చేశారని అంటున్నారు. రెండేళ్లలో చేపట్టిన పనులకు సుమారుగా రూ.335-350 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. పనులు చేసి ఏడాదిన్నర గడిచినా బిల్లులు రాకపోవడంతో వడ్డీలు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు.

పర్సంటేజీ డబ్బులు ఎప్పుడిస్తారు..?

బళ్లారి కేంద్రంగా జరిగిన టెండర్ల ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన రాయలసీమకు చెందిన కీలక ప్రజా ప్రతినిధులు చీకటి ఒప్పందం మేరకు ‘మా వాటా ఎప్పుడు ఇస్తారు..? రెండు మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి.. మాకు ఖర్చులు పెరుగుతున్నాయి.. ఎన్నికల తరువాత ఎవరు ఉంటారో.. ఎవరు పోతారో..! మాకే తెలియదు. అగ్రిమెంట్‌ కాగానే ఇస్తామన్నారు.. ఒప్పందం ప్రకారం 5 శాతం వాటా (పర్సెంటేజీ) డబ్బులు ఇవ్వాల్సిందే’ అంటూ కాంట్రాక్టర్లపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. బిల్లులు రాక డబ్బులు లేక ప్రజా ప్రతినిధులకు సమాధానం చెప్పలేక పనులు చేసిన కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఓ ప్రజాప్రతినిధి అయితే ఏకంగా తన మనుషులను బళ్లారికి పంపించి భయపెట్టినట్లు విశ్వసనీయ సమాచారం.

వామ్మో ఈ పనులు చేయలేం!

రెండో విడతలో ఈ ఏడాది జనవరి 1న ఎల్లెల్సీ 205 నుంచి 250 కిలోమీటర్లు వరకు రూ.300 కోట్లు, హెచ్చెల్సీ పరిధిలో రూ.100 కోట్లు కలిపి రూ.400 కోట్లతో ఆర్‌సీసీ లైనింగ్‌ పనులు 13 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు టీబీపీ బోర్డు ఇంజనీర్లతో ఒప్పందం చేసుకున్నారే తప్ప పనులు మొదలు పెట్టలేదు. ఇప్పటికే రూ.350 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌ ఉంది. ఈ పనులు చేస్తే బిల్లులు రావనే భయంతో కాంట్రాక్లర్లు భయపడుతున్నారు. వీటికి కూడా పర్సంటేజీ ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

బిల్లులు పెండింగ్‌ వాస్తవమే

తుంగభద్ర బోర్డు పరిధిలోని ఎల్లెల్సీ ఆర్‌సీసీ లైనింగ్‌ బిల్లులు రూ.300 కోట్లకు పైగా బకాయి ఉన్న మాట నిజమే. నిధుల కోసం ప్రభుత్వానికి లేఖ రాశాం. నిధులు రాగానే కాంట్రాక్టర్లకు చెల్లిస్తాం.

- శ్రీకాంత్‌రెడ్డి, తుంగభద్ర ప్రాజెక్టు బోర్డు ఎస్‌ఈ, హోస్పెట్‌

Updated Date - Dec 18 , 2023 | 11:57 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising