జగనన్నను నమ్మాం.. మోసపోయాం
ABN, Publish Date - Dec 26 , 2023 | 12:09 AM
సీఎం జగన్మోహన్‌రెడ్డి మనసును ఏసుక్రీస్తు మాత్రమే మార్చగలడని అంగన్వాడీలు దీక్షా శిబిరాల్లోనే క్రిస్మస్ వేడుకలు చేసుకున్నారు. సోమవారం అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు నిర్వహిస్తున్న సమ్మె 14వ రోజుకు చేరుకుంది.
మచిలీపట్నం టౌన్/కూచిపూడి, డిసెంబరు 25 : సీఎం జగన్మోహన్‌రెడ్డి మనసును ఏసుక్రీస్తు మాత్రమే మార్చగలడని అంగన్వాడీలు దీక్షా శిబిరాల్లోనే క్రిస్మస్ వేడుకలు చేసుకున్నారు. సోమవారం అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు నిర్వహిస్తున్న సమ్మె 14వ రోజుకు చేరుకుంది. తమ సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె ఉధృతం చేస్తామని కార్యకర్తల సంఘం జిల్లా కార్యదర్శి రమాదేవి, ప్రాజెక్టు సంఘ కార్యదర్శి రెజీనారాణి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా రెజీనారాణి మాట్లాడారు. 14 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేదన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సరైన సేవలు అందడం లేదన్నారు.
దీక్షా శిబిరంలో ప్రత్యేక ప్రార్థనలు
ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించి తమ డిమాండ్లు పరిష్కరించే విధంగా ప్రభువు ఆశీర్వదించాలని మొవ్వలో అంగన్వాడీలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని దీక్షా శిబిరంలోనే క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కేక్ కట్ చేశారు. పలువురు పాస్టర్లు సంఘీభావం తెలిపి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
గుడివాడ రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పట్టించుకోకపోవటం దారుణమని అంగన్వాడీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం గుడివాడ సీడీపీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం తమ గురించి పట్టించుకోకపోగా, విమర్శలు చేయటం దారుణమన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
పేరడి పాటతో అంగన్వాడీల నిరసన
పామర్రు : పామర్రులో అంగన్వాడీ కార్యకర్తలు ‘ఇది పాట కానే కాదు.. ఏ రాగం నాకు రాదు..’ పాటను పేరడీ రూపంలో సీఎం జగన్‌పై పాడి నిరసన వ్యక్తం చేశారు. ‘అంగన్వాడి అక్కలందరిని జగన్ చూసినాడు.. మాట ఇచ్చినాడు.. అభం శుభం తెలియని అంగన్వాడీలు జగనన్నను నమ్మారు.. ఆ తరువాతే తెలిసింది.. ఆయన పెద్ద పులని.. మేము బలి అయి పోతిమని..’ అంటూ పేరడీ పాటతో తమ నిరననను వ్యక్తపరిచారు. సోమవారం అంగన్వాడీల సమ్మెకు రాష్ట్ర టీడీపీ బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి, ఎస్టీయూ నేతలు డి.ధనారాజ్ తదితరులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుంటే తాముకూడా నిరసన కార్యక్రమంలో పాల్గొంటామని ధనరాజు తెలిపారు. ప్రాజెక్టు నాయకురాలు కె.ఉమారాణి, రత్నశ్రీ, పద్మజ, చిన్నారి, సీఐటీయూ నాయకులు గంగాధర్, ఐ.రాజు, ముళ్లపూడి విల్సన్, కె.నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
బానిసల్లా చూస్తున్న ప్రభుత్వాలు..
వన్‌టౌన్ : అంగన్వాడీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బానిసల్లా చూస్తున్నాయని ఏపీ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల యూనియన్ (సీఐటీయూ) నాయకులు విమర్శించారు. అంగన్వాడీలు తమ డిమాండ్ల సాధనకు చేస్తున్న సమ్మె సోమవారానికి 14 వ రోజుకు చేరింది. క్రిస్మస్ పండుగ కావడంతో ధర్నాచౌక్‌లోనే నిరసనల మధ్య సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ నరసింగరావు కేక్ కట్ చేసి అంగన్వాడీలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఏసుక్రీస్తు నాటి బానిసలను కూడగట్టి దోపిడీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయించాడన్నారు. నేడు ప్రభుత్వాలు అంగన్వాడీలను బానిసల్లా చూస్తూ వెట్టిచాకిరీ చేయిస్తున్నాయన్నారు. 14 రోజులుగా డిమాండ్ల సాఽధన కు అందోళన చేస్తున్నా, వైసీపీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. వేతన పెంపు, గ్రాట్యుటీ, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తామన్న హామీలను అమలు చేయాలన్నారు. ఏపీ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల యూనియన్ (సీఐటీయూ) అధ్యక్షురాలు జి.బేబీరాణి, ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మలు మాట్లాడుతూ, ఎక్కడికక్కడ వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయని, పాలకొండలో వర్కర్ మానసిక వేదన తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోవడం, విభిన్న రీతుల్లో సమ్మెతీరును వివరించారు. ఎ.వెంకటేశ్వరరావు, కె.దుర్గారావు, ఈవీ నారాయణ, ఎం.ఎన్.పాత్రుడు జైనీ రత్నకుమారి, ఎల్లా రాణి, ఉమాదేవి ఎన్‌వీ నాగలక్ష్మి, సులోచన, బి.కోటేశ్వరరావు, అరుణ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 26 , 2023 | 12:09 AM