పుస్త‘కమ్’
ABN, Publish Date - Dec 28 , 2023 | 01:04 AM
పుస్తకాల పండుగ మళ్లీ వచ్చింది. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆఽధ్వర్యంలో ఏటా నిర్వహించే పుస్తక మహోత్సవం గురువారం నుంచి ప్రారంభంకానుంది. జనవరి 7వ తేదీ వరకు జరుగుతుంది.
మొత్తం 278 స్టాళ్లతో సరికొత్తగా..
పాలిటెక్నిక్ కాలేజీ ప్రాంగణమే వేదిక
అత్యధికంగా ఇంగ్లీష్ ప్రచురణకర్తలు
న్యూ ఇయర్ రోజు బుక్ ఫర్ వాక్
జనవరి 7తో సంబరాల ముగింపు
(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : పుస్తకాల పండుగ మళ్లీ వచ్చింది. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆఽధ్వర్యంలో ఏటా నిర్వహించే పుస్తక మహోత్సవం గురువారం నుంచి ప్రారంభంకానుంది. జనవరి 7వ తేదీ వరకు జరుగుతుంది. గురువారం సాయంత్రం 6 గంటలకు కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌషిక్ ప్రారంభిస్తారు. ఏటా ఆంగ్ల సంవత్సరాదిన పుస్తక సంబరాలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది మాత్రం కొత్త సంవత్సరానికి ముందే మొదలవుతున్నాయి. స్వరాజ్య మైదానంలో అంబేడ్కర్ స్మృతివనం నిర్మిస్తుండటంతో గత ఏడాది మాదిరిగానే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ప్రదర్శన అందుబాటులో ఉంటుంది. జనవరి 1న పుస్తక ప్రియుల పాదయాత్ర జరుగుతుంది.
మొత్తం 278 స్టాళ్లు
ఈ 34వ పుస్తక మహోత్సవంలో మొత్తం 278 స్టాళ్లు ఏర్పాటు చేశారు. 68 స్టాళ్లల్లో వివిధ ప్రభుత్వ శాఖలు, వాటి కార్యకలాపాలు ఏర్పాటు చేస్తాయి. మిగిలిన 211 వివిధ ప్రచురణ సంస్థలకు కేటాయించారు. ఈసారి అత్యధికంగా ఇంగ్లీష్ ప్రచురణకర్తలు పుస్తక మహోత్సవానికి రానున్నారు. ఢిల్లీ, కోల్‌కతా, ముంబయి ప్రముఖ నగరాల నుంచి 70 నుంచి 80 మంది వరకు ప్రచురణకర్తలు వస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. పుస్తకావిష్కరణలు, సాహిత్య సభలు నిర్వహించే వేదికకు కేతు విశ్వనాథరెడ్డి పేరు పెట్టారు. బాలల కార్యక్రమాలు నిర్వహించే వేదికకు శ్రీరమణ ప్రతిభా వేదికగా నామకరణం చేశారు.
Updated Date - Dec 28 , 2023 | 01:04 AM