ధాన్యం అమ్ముకోనివ్వండి
ABN, Publish Date - Dec 14 , 2023 | 12:53 AM
పండించిన ధాన్యాన్ని అమ్ముకునే అవకాశం ఇవ్వాలని రైతులు అధికారులను నిలదీశారు. కొక్కిలిగడ్డ గ్రామ సచివాలయం వద్ద బుధవారం వికసిత్ భారత్ సంకల్పయాత్ర గ్రామసభ జరిగింది. సమావేశంలో అధికారులు ఆయా శాఖల అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
మోపిదేవి, డిసెంబరు 13 : పండించిన ధాన్యాన్ని అమ్ముకునే అవకాశం ఇవ్వాలని రైతులు అధికారులను నిలదీశారు. కొక్కిలిగడ్డ గ్రామ సచివాలయం వద్ద బుధవారం వికసిత్ భారత్ సంకల్పయాత్ర గ్రామసభ జరిగింది. సమావేశంలో అధికారులు ఆయా శాఖల అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. వ్యవసాయ అధికారిణి హెప్సిబారాణి పంటనష్టంపై చెబుతుండగా, రైతులు జోక్యం చేసుకుని రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ పండించిన ధాన్యాన్ని అమ్ముకునే అవకాశం ఇవ్వటంలేదంటూ నిలదీశారు. నేరుగా కొనుగోలు చేస్తామంటూ ప్రకటనలు చేసిన ప్రభుత్వం నేడు ధాన్యాన్ని కొనుగోలు చేయలేక.. రైతులకు అమ్ముకునే హక్కు లేక రహదారుల వెంబడి గుట్టలుగా పోసి రోజుల తరబడి కాపలా కాయాల్సి వస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తడిసిన ధాన్యం అని తేమశాతం పేరుతో ధర ఇష్టానుసారం అడుగుతున్నారని మిల్లుల వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మండల పరిధిలో రైస్‌మిల్లులు ఉన్నప్పటికీ ఆన్‌లైన్ పేరుతో 40 కిలోమీటర్ల దూరం ఉన్న మిల్లుకు తరలించాలని చెబుతున్నారని అధికారులను నిలదీశారు. గత రెండేళ్లుగా రవాణా చార్జీలు ఇప్పటివరకూ రైతులకు చెల్లించలేదనీ, ప్రస్తుతం రవాణా ఖర్చులు భరించి ధాన్యాన్ని తీసుకువెళ్లే ఆర్ధిక స్థోమత రైతులకు లేదన్నారు. 10 రోజులుగా ధాన్యం వద్ద కాపలా కాస్తున్నామని ప్రస్తుతం వాహనాల సౌకర్యం లేదు అని కొనుగోలు నిలిపివేయటం ఎంతవరకు సమంజసం అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతు స్వేచ్ఛగా ధాన్యం అమ్ముకునే అవకాశం ఇవ్వాలంటూ వేడుకున్నారు. రైతుల ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకువెళతానని ఏవో హెప్సిబారాణి తెలియచేశారు. కార్యక్రమంలో సర్పంచ్ దిడ్ల జానకి రాంబాబు, ఇన్‌ఛార్జి ఈవోఆర్డీ బూరేపల్లి అశోక్, కార్యదర్శి కె.రామకోటేశ్వరరావు, కోఆప్షన్ సభ్యుడు చందన రంగారావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మద్ధతు ధరకు కొనుగోలు చేయాలి
- టీడీపీ నేతల డిమాండ్
ధాన్యం కొనుగోలులో నిబంధనలు సడలించి మద్ధతు ధరతో వెంటనే కొనుగోలు చేయాలని టీడీపీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని పెదకళ్లేపల్లి, వెంకటాపురం వద్ద కొనుగోలు లేక రహదారుల వెంబడి ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించి రైతుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. నిబంధనలు చెబుతూ ధాన్యం కొనుగోలు చేయటం లేదని రైతులు టీడీపీ నేతల దృష్టికి తీసుకువచ్చారు. నాలుగు రోజులుగా వాహనాలు రావడంలేదంటూ మరికొద్ది రోజులు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు రైతు భరోసా కేంద్రాల ద్వారా చెబుతున్నారంటూ రైతులు వాపోయారు. వెంకటాపురం వద్ద గోనెసంచులు ఇచ్చి ఐదు రోజులు గడిచినా ధాన్యాన్ని మిల్లులకు విక్రయించే సదుపాయం లేకపోవటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. మండల పరిషత్ ఉపాధ్యక్షులు కడవకొల్లు సీతారామాంజనేయులు, తెలుగురైతు జిల్లా అధికార ప్రతినిధి గౌని శివరామకృష్ణ, తెలుగుయువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రావి రత్నగిరి, ఎంపీటీసీ కొమ్ము పవన్‌కుమార్, అరజా వెంకటేశ్వరరావు, చందన రంగారావు, మోటుపల్లి జనార్ధనరావు తదితరులు ఉన్నారు.
చేతికొచ్చిన పంట నీటిపాలు!
పెద్దిరెడ్డి నారాయణ కౌలురైతు, నందమూరు
ట్రాక్టరుతో వరిపనలు తొక్కించి దమ్ముచేసిన కౌలురైతు
పదిహేను ఎకరాలు కౌలుకు తీసుకుని బంగారం తనఖాపెట్టి, వడ్డీలకు అప్పులు తెచ్చి వరిపంట సాగుచేశా.. ఇప్పటివరకు సుమారు రూ.6లక్షల మేర పెట్టుబడి పెట్టి కోతకోసిన తర్వాత ముంచుకొచ్చిన మిచౌంగ్ తుఫాన్ కారణంగా పొలంలో పనలన్నీ నీట మునిగాయి. గింజలు మొత్తం మొలకలొచ్చాయి. రోడ్లపక్క ఆరబోసిన ధాన్యమే కొనే నాధుడు లేక పలువురు రైతులు రోజుల తరబడి కాపలాకాస్తూ అవస్ధలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పూర్తిగా మొలకలొచ్చిన ధాన్యాన్ని ఇంకెవరు కొంటారు.. పొలంలో నీటిని బయటకు పంపేందుకు పదిరోజులుగా నానా తంటాలు పడి మోటారు ఇంజన్ల ద్వారా ప్రయత్నించినా పూడుకుపోయిన పంటకాల్వలవల్ల మురుగునీరు బయటకు పోయే మార్గాలన్నీ మూసుకుపోయాయి. ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి రాలేదు. పంటనష్టం ఆరా తీయలేదు. సెంటు భూమిలేని తనలాంటి కౌలురైతులను ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్యలే శరణ్యం. - ఉంగుటూరు
Updated Date - Dec 14 , 2023 | 12:53 AM