కృష్ణ కవిత్వం సకల అభిరుచుల సమ్మేళనం
ABN, Publish Date - Dec 29 , 2023 | 01:20 AM
ఒక వ్యక్తి ఐదు పదుల వయస్సు దాటిన తర్వాత రాసే కవిత్వంలో వికాసం, విస్తృతం ఉంటాయని ప్రముఖ కవి శివారెడ్డి అన్నారు. ‘ఆంధ్రజ్యోతి’ ఢిల్లీ ప్రతినిథి ఎ.కృష్ణారావు రాసిన ఒక్క కరచాలనం చేయి, అనువాద రచన రాధికా ఆలకించు(మాధవ్ కౌశిక్ రచన) పుస్తకాలను కేతు విశ్వనాథరెడ్డి సాహిత్య వేదికపై గురువారం సాయం త్రం ఆవిష్కరించారు.
విజయవాడ కల్చరల్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : ఒక వ్యక్తి ఐదు పదుల వయస్సు దాటిన తర్వాత రాసే కవిత్వంలో వికాసం, విస్తృతం ఉంటాయని ప్రముఖ కవి శివారెడ్డి అన్నారు. ‘ఆంధ్రజ్యోతి’ ఢిల్లీ ప్రతినిథి ఎ.కృష్ణారావు రాసిన ఒక్క కరచాలనం చేయి, అనువాద రచన రాధికా ఆలకించు(మాధవ్ కౌశిక్ రచన) పుస్తకాలను కేతు విశ్వనాథరెడ్డి సాహిత్య వేదికపై గురువారం సాయం త్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడారు. రాధాకృష్ణుల ప్రేమగాథలో తాత్విక, సామాజిక అంతరార్థాన్ని వర్ణిస్తూ సాగిన మాధవ్ కౌశిక్ కావ్యాన్ని కృష్ణారావు అద్భుతంగా అనువదించారన్నారు. కృష్ణుడి ఏకాంత జీవితాన్ని విహంగ వీక్షణం చేయించారన్నారు. కవిత్వం ద్వారా తనను తాను తెలుసుకుని, శుద్ధి చేసుకోవచ్చని ఆయన చెప్పారు. సుఖదుఃఖాలు, ఆవేదనలు, ఆరోదనల భావ స్వరూపమే కవిత్వమన్నారు. సామాజిక, సాంస్కృతిక, రాజకీయ జీవనానికి అతి దగ్గరగా మసలుకునే కవి కృష్ణుడు నాలుగు దశాబ్దాల ప్రజా జీవనాన్ని దగ్గరగా పరిశీలించి, ఆ పరిణామాలు, పర్యవసానాలను అవగాహనతో కవిత్వరూపంలో సునిశితంగా విశ్లేషించారన్నారు. కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌషిక్ తదతరులు పాల్గొన్నారు. అనంతరం శ్రీరమణ, కేతు విశ్వనాథరెడ్డి, వరహాశెట్టిల సంస్మరణ సభలు నిర్వహించారు. కార్యక్రమంలో విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షుడు మనోహరనాయుడు, సాహిత్య అకాడమీ సభ్యుడు మందలపర్తి కిషోర్, కథా విమర్శకుడు ఓబులేసు, పొన్నాల సుబ్రహ్మణ్యం భట్టు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 29 , 2023 | 01:20 AM