పైరుకు నీటి విడుదలపై రైతుల్లో భయం
ABN, First Publish Date - 2023-11-06T01:16:57+05:30
శివారు భూముల్లో వరిపైరు పొట్టదశ, ఈతదశలో ఉంది. ఈ తరుణంలో పైరుకు తప్పనిసరిగా నీరు అవసరం. చిగురుకోటాగా పైరుకు పొటాష్, యూరియా ఎరువులు వేసేందుకు నీరు లేకపోవడంతో వర్షమైనా కురవకపోతుందా అనే ఆశతో ఎరువులు చల్లుతున్నారు. పొట్టదశలో ఉన్న వరిపైరుకు దోమ ఆశించడంతో నివారణ కోసం రైతులు అరకట్ట యూరియాలో లీటరు కిరోసిన్, లేదా డీజిల్ కలిపి పొలంలో చల్లుతున్నారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : శివారు భూముల్లో వరిపైరు పొట్టదశ, ఈతదశలో ఉంది. ఈ తరుణంలో పైరుకు తప్పనిసరిగా నీరు అవసరం. చిగురుకోటాగా పైరుకు పొటాష్, యూరియా ఎరువులు వేసేందుకు నీరు లేకపోవడంతో వర్షమైనా కురవకపోతుందా అనే ఆశతో ఎరువులు చల్లుతున్నారు. పొట్టదశలో ఉన్న వరిపైరుకు దోమ ఆశించడంతో నివారణ కోసం రైతులు అరకట్ట యూరియాలో లీటరు కిరోసిన్, లేదా డీజిల్ కలిపి పొలంలో చల్లుతున్నారు.
పంటలకు సాగునీరు సక్రమంగా అందకపోవడంతో రైతులు ఆయిల్ ఇంజన్లద్వారా పంటకాలువలు, డ్రెయిన్లలోని నీటిని పొలాలకు తోడుతున్నారు. గత 50రోజులుగా నీరందక పొలం ఎండి నెర్రెలివ్వటంతో ఎకరానికి 10గంటలపాటు నీటిని తోడితేనే పలుచగా నీరు పడుతోంది. పంటకాలువ, డ్రెయిన్‌కు దూరంగా ఉన్న పొలాలకు నీరు తోడాలంటే ఖర్చు అధికమవుతోంది. నీరులేక వరిపైరు ఎండిపోయే స్థితికి చేరుకుంటోంది. దీంతో ఎకరం విస్తీర్ణంలో కనీసంగా 15నుంచి 20సెంట్ల భూమిలోని పైరు ఈతకు వస్తుందో రాదో తెలియడం లేదని రైతులు చెబుతున్నారు.
ఎకరానికి రూ.26వేలకుపైగా పెట్టుబడి ..
ప్రారంభం నుంచి రైతులు ఎకరానికినారుమడి బాగుజేత, విత్తనాల ఖర్చు రూ.2000, దమ్ముచేసినందుకు రూ.4వేలు, గట్ల బాగుజేతకు రూ.వెయ్యి, నాట్లు వేసినందుకు రూ.5వేలు, కలుపుతీసినందుకు రూ.వెయ్యి, మొదటికోటా ఎరువు వేసినందుకు రూ.1500లు, రెండో విడత ఎరువు వేసినందుకు రూ.1800, మూడో విడత ఎరువు వేసినందుకు రూ.1200, పురుగుమందులు, దోమపోటు నివారణకు రూ.2500, వేరుపురుగు, ఇతరత్రా తెగుళ్లు ఆశించకుండా ఉండేందుకు గుళికలు వేసినందుకు రూ. 500లు ఖర్చు చేశారు. ఇది కాకుండా రెండుసార్లు ఆయిల్‌ఇంజన్లతో నీటిని తోడినందుకుగాను రూ.2వేల ఖర్చయింది. ఆయిల్‌ఇంజను అద్దె, ఇతరత్రా ఖర్చులు మరో మూడువేల రూపాయలవరకు ఖర్చుచేశారు. రానున్ను రోజుల్లో కోత, కట్టివేత, నూర్పిడి ఖర్చు మరో రూ.15వేల వరకు అవుతుంది. దీనికితోడు కౌలు ఖర్చులు అదనం, మూడేళ్లుగా ఆయిల్‌ఇంజన్లు వాడకపోవడంతో అవి మొరాయించాయి. వాటి మరమ్మతులకు మరో ఐదువేల వరకు ఖర్చుచేయాల్సి వచ్చింది.
ఖర్చులు వస్తాయో లేదో..
- జొన్నలగ డ్డ నాగయ్య, ఆర్ గొల్లపాలెం
కౌలుకు పది ఎకరాల్లో వరిసాగుచేస్తే.. ఎకరానికి ఇప్పటివరకు రూ. 25వేలవ రకు ఖర్చయింది. పైరు పొట్టదశలో ఉంది. పోటాష్ ఎరువు చల్లేందుకు నీరు అందుబాటులో లేకుండా పోయింది. ఎకరానికి 10గంటలపాటు నీటిని తోడాల్సి వస్తోంది. అయినా నీరు పూర్తిగా పడలేదు. సక్రాంతి వరకు కాలువలకు నీరు విడుదల చేస్తేనే పంటచేతికొస్తుంది. గుండుపాలెం డ్రాప్ నుంచి కొత్తిమేరకోడు పంటకాలువ దిగువకు నీరు రానివ్వడంలేదు. ప్రధాన పంటకాలువలోనూ నీరు అందుబాటులో లేక ఇంజనుద్వారా పొలానికి తోడలేకపోతున్నాం. కౌలు చెల్లింపు, పెట్టుబడి ఇవవ్నీ లెక్కిస్తే ఈ ఏడాది వరిసాగులో ఏం మిగులుతుందో అర్థం కావడంలేదు.
ఆయిల్ ఇంజన్లకు నీరు అందుబాటులో లేదు
- బుగ్గల రామకృష్ణ, గుండుపాలెం
రుద్రవరంలో ఎకరం భూమితో పాటు మరో 80 సెంట్లు కౌలుకు వరి సాగుచేశా. సీజన్‌లో సాగునీరు అందుబాటులో లేకపోవడంతో ఆయిల్‌ఇంజను ద్వారానే నీటిని తోడాల్సి వచ్చింది. కాలువలో కొద్దిపాటి నీరుకూడా అందుబాటులో లేకపోవడంతో పొలం ఎండిపోతోంది. చిగురు కోటాకు పొలంలో నీరులేక ఎరువు జల్లడం ఆలస్యమవుతోంది. పొటాష్ సకాలంలో వేయకుంటే దిగుబడి తగ్గుతుంది. పంటచేతికొస్తుందో లేదో తెలియకుండా ఉంది.
పైరు ఎండిపోయింది
- కొణతం రామకృష్ణ, రుద్రవరం
రెండు ఎకరాల్లో 1318 రకం వరి సాగుచేశా.. పంటకాలువకు, పొలానికి సుమారు ముప్పావు కిలోమీటరు దూరం ఉంది. 50రోజులుగా పొలానికి నీరు తోడేందుకు ప్రయత్నించినా కాలువలో నీరు అందుబాటులో లేదు. ఎట్టకేలకు రెండురోజులక్రితం ఆయిల్ ఇంజనుద్వారా నీటిని తోడితే ఎకరానికి వెయ్యి రూపాయల ఖర్చు అయ్యింది. రోజుల తరబడి పొలానికి నీరు అందకపోవడంతో పైరు ఎండిపోయింది. జనవరి నెలాఖరు వరకు కాలువలకు నీరు విడుదలచేస్తేనే రైతులు బయటపడతారు.
కష్టాల సాగు..
హనుమాన్‌జంక్షన్/ గన్నవరం/ ఉంగుటూరు : ఆరుగాలం కష్టపడి పంట చేతికి వస్తున్న దశలో వరి సాగుకు నీటి తడులు అందించడానికి రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. పాలకంకులు ముదురుతున్న తరుణంలో ఏలూరు కాలువకు సక్రమంగా నీరు విడుదల చేయకపోవడంతో రైతు తీవ్ర వ్యయ ప్రయాసలు పడుతున్నారు. దీనికి తోడు వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో సాగునీటి కోసం రైతులు నానా కష్టాలు పడుతున్నారు. కాలువ కింద చివరి భూములు, మెరక భూములు, చెరువులు కింద నీరు అందక మోటార్లు సాయంతో తడులు అందించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. సాధారణ వర్షపాతం కూడ నమోదు కాక పోవడంతో వరి సాగుకు ఇబ్బంది ఏర్పడింది. గన్నవరం నియోజక వర్గంలోని బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు మండలాల్లో దాదాపు 55 వేల ఎకరాలు వరి సాగు అవుతోంది. వర్షాభావ పరిస్థితులతో పాటు నీటి ఎద్దడి కారణంగా 30శాతం మేర దిగుబడులు తగ్గే అవకాశం ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
Updated Date - 2023-11-06T01:16:59+05:30 IST