పత్తి ధర పతనం
ABN, Publish Date - Dec 24 , 2023 | 12:47 AM
బహిరంగ మార్కెట్లో పత్తి ధర దారుణంగా పడి పోయింది. క్వింటాలు రూ.ఐదు వేలకు మించి ధర రావటం లేదు. తుఫాన్‌కు పత్తి తడి సిందన్న సాకుతో వ్యాపారులు ధర తగ్గించారు.
ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు రూ.7,020
తుఫానుకు తడిసిందన్న సాకుతో రూ.5 వేలకు మించి కొనని వ్యాపారులు
వారం నుంచి సీసీఐ యార్డుల్లోనూ నిలిచిన కొనుగోళ్లు
కంచికచర్ల, డిసెంబరు 23: బహిరంగ మార్కెట్లో పత్తి ధర దారుణంగా పడి పోయింది. క్వింటాలు రూ.ఐదు వేలకు మించి ధర రావటం లేదు. తుఫాన్‌కు పత్తి తడి సిందన్న సాకుతో వ్యాపారులు ధర తగ్గించారు. వారం నుంచి సీసీఐ మార్కెట్ యార్డు ల్లోనూ కొనటం లేదు. మార్కెట్ పతనమైనప్పటికీ పాలకులు, మార్కెటింగ్ అధికారుల్లో స్పందన లేదు. దీంతో వ్యాపారులు, రైతులను అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు నియోజకవర్గాల పరిధిలో లక్ష ఎకరాల్లో రైతులు పత్తి సాగుచేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి ప్రతికూల వాతా వరణ పరిస్థితుల వల్ల ఆశించిన దిగుబడులు రావటం లేదు. ఎకరానికి రూ.50 వేలకు పైగా పెట్టుబడి అయింది. కేంద్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ.7,020 వంతున మద్దతు ధర ప్రకటించినా రైతులకు దక్కటం లేదు. నిన్నటి దాకా బహిరంగ మార్కెట్లో వ్యాపారులు క్విం టాలు రూ.ఆరువేల నుంచి రూ.ఆరు వేల మూడు వందల లోపు కొన్నారు. ఈనెల మొదటి వారంలో తుఫాన్ ప్రభావంతో జిల్లాలో విస్తారంగా కురిసిన వర్షాలకు చేలల్లో తీయాల్సిన పత్తి తడిసింది. పత్తి తడవటం వల్ల రంగు మారిందని, నాణ్యత తగ్గిందని, పింజ పొడవు తక్కువగా వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. గ్రామాల్లో రైతుల వద్దకు వెళ్లి తడిసిందన్న సాకు చూపుతున్నారు. క్వింటాలు రూ. ఐదు వేలకే కొంటున్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో కొద్ది రోజుల నుంచి సీసీఐ పత్తి కొనడం లేదు. ఈ నెల 16 నుంచి 25 వరకు కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్టు సీసీఐ బయ్యర్లు ప్రకటించారు.
గుంటూరులో కొంటున్నా తూకంలో కోత
గుంటూరు జిన్నింగ్ మిల్లుల వద్దకు పత్తిని తీసుకు వెళితే సీసీఐ కొంటోంది. నిబంధనల ప్రకారం పత్తి నాణ్యత లేదంటూ ధరలో కోత విధిస్తోంది. తరుగు పేరుతో క్వింటాలుకు మూడు కిలోలకు పైగా తూకం తగ్గిస్తున్నారు. గుంటూరు తీసుకువెళ్లేందుకు ఒక్కో బోరాకు రూ.మూడు వందలకు పైగా వ్యయ మవుతోంది. పైగా బయోమెట్రిక్ వేసేందుకు రైతులు తప్పనిసరిగా గుంటూరు వెళ్లాలి. దీంతో ధర తక్కు వైనప్పటికీ రైతులు మరో గత్యంతర లేక వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. పత్తి మార్కెట్ దారుణంగా దిగజా రినప్పటికీ రైతులను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధి ఏమైందని, రైతులు ఆర్థికంగా దెబ్బ తినటానికి పాలకుల అసమర్థత కూడా కారణమని నందిగామ ఏఎంసీ మాజీ చైర్మన్ కోట వీరబాబు ఆరోపించారు.
Updated Date - Dec 24 , 2023 | 12:47 AM