కన్నీటి సాగు!
ABN, First Publish Date - 2023-12-11T01:27:47+05:30
తుఫాన్ వెళ్లి ఐదురోజులైనా చేలలో నీళ్లు కదలకపోవటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. పంటకోసే అవకాశంలేక పలువురు రైతులు దున్నేస్తున్నారు. 400 ఎకరాల్లో పంట నీటమునిగి రోజులు గడుస్తున్నా నీరుపోయేందుకు అధికారులు ఏవిధమైన చర్యలు చేపట్టకపోవటంతో ధాన్యం మెలకెత్తుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెడన రూరల్/పామర్రు, డిసెంబరు 10 : తుఫాన్ వెళ్లి ఐదురోజులైనా చేలలో నీళ్లు కదలకపోవటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. పంటకోసే అవకాశంలేక పలువురు రైతులు దున్నేస్తున్నారు. 400 ఎకరాల్లో పంట నీటమునిగి రోజులు గడుస్తున్నా నీరుపోయేందుకు అధికారులు ఏవిధమైన చర్యలు చేపట్టకపోవటంతో ధాన్యం మెలకెత్తుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి పనుల్లో మురుగు బోదెలు సక్రమంగా తవ్వకాలు జరపలేదని రైతులు విమర్శిస్తున్నారు. వర్షం నీరు చేలలోచురటంతో పంట దక్కే పరిస్థితి లేదని రైతులకు చెబుతున్నారు.
మానికొండ రేష్‌నాయుడుకు గల 11 ఎకరాల పంట నీటమునగటంతోమూడు లక్షల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. రైతులు, కౌలు రైతులు నష్టపోయారు. రెవెన్యూ అధికారులు కొందరికి కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్దో గొప్పో చేతికి పంట వస్తుందని దిరిశవల్లిలో, నరసప్పచెరువు రైతులు ఆశతో రాత్రి వేళల్లోకూడా మిషన్‌లతో కోతలు కోయిస్తు రోడ్లపైనే గుట్టలుగా వేస్తున్నారు. ధాన్యంలో తేమ ఉండటంతో దళారులు అడిగినకాడికి అమ్మేస్తున్నారు.
పామర్రు మండలంలో కొన్నిచోట్ల పొలాల్లో కోతలు కోసిన వరిపనలు కుళ్లిపోతున్నాయి. ప్రభుత్వం ఆదుకోవాలని, పంటనష్టపోయిన రైతులకు విత్తనాలతోపాటు ఆర్థికసాయం అందించాలని కోరుతున్నారు. కృష్టాడెల్టాలో పంటకాల్వలు మరమ్మతులకు నోచక గుర్రపుడెక్క, తూటుకాడ వ్యర్ధాలతో డ్రెయిన్లు పూడుకుపోయి దర్శనమిస్తున్నాయి. పొలాల్లో నీరు వెలుపలికి మార్గం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సబ్సిడీపై విత్తనాలు అందించాలి
తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందిస్తామని రైతుల నుంచి ప్రతి గింజా కోనుగోలు చేస్తామని ఇటీవల పర్యటనలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇచ్చిన హామీ ఇంకా ఆచరణలోకి రాలేదన్నారు. మిల్లులకు తరలించిన ధాన్యం ఇంకా వాహనాల్లోనే ఉండిపోవడంతో మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు.
రైతులను తక్షణం ఆదుకోవాలి : వేదవ్యాస్
కృత్తివెన్ను/మచిలీపట్నం టౌన్ : తుఫాన్ ప్రభావంతో మండలంలో వరి చేలన్నీ వర్షపు నీటిలో నానుతున్నాయని, పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ డిమాండ్ చేశారు. గాంధీనగరం, మునిపెడ, యండపల్లి తదితర గ్రామాల్లో ఆయన పర్యటించి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారులకు ముందు చూపు లేకపోవడం వల్లే రైతులకు తీవ్ర నష్టం కలిగిందన్నారు. నేటికీ చేలల్లో నీరు బయటకు పోలేదన్నారు. జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని ఇప్పటి వరకు వ్యవసాయ శాఖాధికారులకు నిర్ధారించకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. బందరు, పెడన నియోజకవర్గాల్లో వరి పంట పూర్తిగా ధ్వంసమైందని, రైతులకు ఒక్క వేరుశెనగ కాయ కూడా చేతికందే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఆయనతో పాటు పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.
Updated Date - 2023-12-11T01:27:49+05:30 IST