అమ్మ సొమ్మునూ వదలరు..!
ABN, Publish Date - Dec 24 , 2023 | 12:48 AM
అమ్మ సొమ్ముకు ఎసరు పెడుతున్నారు. కమీషన్ల కోసం దుర్గమ్మ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కన్నేస్తున్నారు. ఓవైపు ఎన్నికల వేళ అభివృద్ధి కార్యక్రమాలను అరచేతిలో చూపి, మరోవైపు చాటుగా ఫిక్స్‌డ్ డిపాజిట్లను కరిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నపళంగా మల్లికార్జునపేట వైపు ఉన్న మెట్లమార్గ అభివృద్ధికి పావులు కదపడం, ఇందుకోసం సుమారు రూ.100 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లను బయటకు తీయాలని ప్రయత్నిస్తుండటం వెనుక అధికార పార్టీ పెద్దల హస్తం ఉందని కొండంతా చర్చ నడుస్తోంది.
27న జరిగే పాలకమండలి భేటీలో ఇదే ప్రధానాంశం
ఉన్నట్టుండి మల్లికార్జున మెట్లవైపు ఇళ్ల తొలగింపునకు సన్నాహాలు
పరిహారం ఇచ్చి స్వాధీనం చేసుకోవాలని యోచన
కమీషన్ల కోసమే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కన్ను
మాజీమంత్రి కనుసన్నల్లో రూ.100 కోట్ల స్కెచ్
(విజయవాడ-ఆంధ్రజ్యోతి/వన్‌టౌన్) : దుర్గగుడికి ప్రస్తుతం సుమారు రూ.256 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. ఈ డిపాజిట్లలో సుమారు రూ.100 కోట్లు విత్‌డ్రా చేసేందుకు ఈ నెల 27న ముహూర్తంగా నిర్ణయించారు. దుర్గగుడి ప్రాంగణ విస్తరణ పేరుతో ఈ డిపాజిట్లకు ఎసరు పెడుతున్నారు. మల్లేశ్వరస్వామి ఆలయానికి వెనుకవైపున మల్లికార్జునపేటకు వెళ్లేందుకు మెట్లమార్గాలు ఉన్నాయి. వీటిలో ఒకటి వాడకంలో లేదు. వాడకంలో లేని దానిని తిరిగి వినియోగంలోకి తీసుకురావాలనుకుంటున్నారు. ప్రస్తుత ట్రస్ట్‌బోర్డు తన తొలి సమావేశంలోనే ఈ మెట్ల మార్గాన్ని పునరుద్ధరిస్తామని పేర్కొంది. మల్లికార్జున మెట్లుగా పరిగణనలో ఉన్న ఈ మార్గంలో ఒకపక్క ఉన్న నివాసాల వారికి పరిహారం చెల్లించి తొలగించాలన్న ప్రతిపాదనను సిద్ధం చేస్తున్నారు. వీరికి పరిహారం చెల్లించేందుకు ఆలయ ఫిక్స్‌డ్ డిపాజిట్లను వినియోగించాలనుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు ఈనెల 27న జరగనున్న ట్రస్ట్‌బోర్డు సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
అవసరం లేకున్నా..
మల్లేశ్వరాలయం వెనుకవైపు భక్తులు కిందకు దిగి వెళ్లిపోవడానికి దక్షిణం వైపున ఓ మెట్లమార్గం ఉంది. ఈ మార్గంలో భక్తులు కనకదుర్గానగర్ మీదుగా రథం సెంటర్‌కు చేరుకుంటారు. ఈ మార్గాన్ని కొంతకాలం క్రితం విస్తరించారు. అలాగే, ఉత్తరం వైపు మల్లికార్జునపేటకు వెళ్లే మెట్ల మార్గం ఉంది. ఇటుగా వెళ్తే బ్రాహ్మణవీధిలోని జమ్మిదొడ్డి వరకు చేరుకుంటారు. రద్దీ సమయాల్లో మినహా మిగిలిన సమయంలో ఈ మెట్ల మార్గం మూసే ఉంచుతారు. ఇప్పుడు ఈ మార్గాన్ని విస్తరించాలని ఆలోచన చేస్తున్నారు. ఈ మెట్లను విస్తరించడం వల్ల భక్తుల రాకపోకలకు అనువుగా ఉంటుందంటున్నారు. ఇక్కడ నివాసాలవారు చాలాకాలం నుంచి ఉంటున్నారు. వీరికి పరిహారం చెల్లించాలంటే ఆర్‌అండ్‌బీ అధికారులు మదింపు చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు ఎంత మొత్తం అవుతుందో వేచి చూడాలి. ఆర్‌అండ్‌బీ అధికారుల మదింపు కన్నా యజమానులు ఇంకా ఎక్కువ పరిహారం అడిగే అవకాశం ఉంటుంది. గతంలో రాజగోపురం, మహామండపం నిర్మాణాల నిమిత్తం తొలగించిన నివాసాలకు పరిహారంపై ఒప్పందం చేసుకునేందుకు అనే కమార్లు రెవెన్యూ అఽధికారులు సమావేశాలు నిర్వహించాల్సి వచ్చింది. ఈసారి ఎంత సమయం పడుతుందో తెలియదు. వీటన్నింటి కంటే ఓంకారం మలుపు నుంచి నేరుగా దిగువకు ప్రత్యామ్నాయ మార్గాన్ని అభివృద్ధి చేయడం సులువు. దీనికి ఖర్చు కూడా తక్కువ అవుతుందని ఇంజనీరింగ్ విభాగ అధికారులే చెబుతున్నారు.
కమీషన్లపై శ్రద్ధతోనే..
కేవలం కమీషన్లపై శ్రద్ధతోనే ఉత్తరంవైపు మల్లికార్జునపేట మార్గానికి పాలకమండలి మొగ్గు చూపుతోంది. దీని వెనుక మాజీ మంత్రి ప్రమేయం ఉండటంతో ఆగమేఘాలపై పావులు కదులుతున్నాయి. సుమారు 14 సంవత్సరాల క్రితం దుర్గగుడి రాజగోపురం, మహామండపం తదితర నిర్మాణాల కోసం కొండపై ఉన్న అసైన్‌మెంట్ భూముల్లోని ఇళ్లను తొలగించడానికి దుర్గగుడి ఫిక్స్‌డ్ డిపాజిట్లను విత్‌డ్రా చేశారు. ఆ తర్వాత తలపెట్టిన నిర్మాణ పనులకు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లను కరిగించేశారు. అప్పట్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల తరుగుపై ఆందోళన వ్యక్తమైంది. తాజాగా తలపెట్టిన నిర్మాణ పనుల కోసం మళ్లీ ఫిక్స్‌డ్ డిపాజిట్లను కరిగించాలన్న ఆలోచనను అధికార పార్టీ నాయకులు తెరపైకి తెచ్చారు. కేవలం కమీషన్ల కోసమే ఈసారి ఎఫ్‌డీలపై దృష్టి సారించారన్న చర్చ దుర్గగుడి అధికారుల్లో నడుస్తోంది.
Updated Date - Dec 24 , 2023 | 12:48 AM