Vijayawada: డ్రైనేజీలో పడిన బాలుడి మృతదేహం గుర్తింపు
ABN, First Publish Date - 2023-05-05T16:40:49+05:30
నగరంలోని గురునానక్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. డ్రైనేజీలో పడిన బాలుడు అభిరామ్ మృతదేహం లభ్యమైంది.
విజయవాడ: నగరంలోని గురునానక్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. డ్రైనేజీలో పడిన బాలుడు అభిరామ్ మృతదేహం లభ్యమైంది. ఘటనాస్థలం నుంచి కిలో మీటర్ దూరంలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. ఈరోజు ఉదయం అభిరామ్ అనే ఆరేళ్ల బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు అక్కడే ఉన్న డ్రైనేజీలో పడిపోయాడు. ఉదయం నుంచి నగరంలో భారీ వర్షం కారణంగా డ్రైనేజీ పొంగిపొర్లుతుండటంతో బాలుడు కొట్టుకుపోయాడు. వెంటనే స్థానికులు, మున్సిపల్ సిబ్బంది బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కొన్ని గంటల తర్వాత బాలుడు పడిపోయిన ప్రాంతం నుంచి కొంతదూరంలో మృతదేహాన్ని గుర్తించారు. విగతజీవిగా పడి ఉన్న బాలుడిని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
కుటుంబసభ్యుల ఆగ్రహం..
కాగా.. కాలువలను పూర్తిస్థాయిలో మూసివేయడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ దారుణం జరిగిందని కుటుంబసభ్యులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలువలను పూర్తిస్థాయిలో మూసివేయమని కోరినప్పటికీ మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదని వాపోయారు. ఇలాంటి ఘటన రెండో సారి జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
జోరు వాన..
మరోవైపు విజయవాడలో భారీగా వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. మోకాళ్ళ లోతు నీళ్లతో బెజవాడ పొంగిపొర్లుతోంది. లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో మునిగిపోయాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు స్వల్ప అంతరాయం ఏర్పడింది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో రోడ్లపై వర్షపు నీరు పొంగిపొర్లుతున్నాయి. బెంజ్ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, మొగల్రాజపురం, సూర్యారావుపేట, సింగ్ నగర్, పాయకపురం ప్రాంతాల్లో వర్షపునీరు రోడ్లపైకి వచ్చి చేరారు. రోడ్లపైకి వర్షపు నీరు భారీగా చేరడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
Updated Date - 2023-05-05T16:44:19+05:30 IST