అంగన్వాడీలపై అరాచకం
ABN, Publish Date - Dec 28 , 2023 | 01:02 AM
అంగన్వాడీలపై అరాచకాన్ని ప్రదర్శించారు. అడుగడుగునా అడ్డుపడ్డారు. అడ్డొచ్చిన వారిని ఈడ్చిపడేశారు. ఆడవారనే కనికరం కూడా చూపకుండా వ్యానుల్లో కుక్కి అరెస్టు చేశారు. తమ న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి 16 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలు బుధవారం ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ నిరసనకు ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుపడటంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. విజయవాడ ధర్నాచౌక్‌లో పరిస్థితిని దారుణంగా మార్చారు. అంగన్వాడీలకు గాయాలైనా కనికరించకుండా అరెస్టు చేశారు. జగ్గయ్యపేట, నందిగామలోనూ ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. గుడివాడలో ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లకుండా అంగన్వాడీలకు పోలీసులు అడ్డుపడి అరెస్టులు చేశారు.
విజయవాడలో దద్దరిల్లిన ధర్నాచౌక్
అంగన్వాడీలు, పోలీసులకు మధ్య తోపులాట
600 మంది అంగన్వాడీల అరెస్టు.. పలువురికి స్వల్పగాయాలు
నందిగామ, జగ్గయ్యపేట ఎమ్మెల్యేల కార్యాలయాలు ముట్టడి
సమ్మె గురించి తెలియదన్న మంత్రి జోగి రమేశ్
బందరులో దీక్షా శిబిరానికి వెళ్లి మాట్లాడిన ఎమ్మెల్యే పేర్ని నాని
విజయవాడ/మచిలీపట్నం, ధర్నాచౌక్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : ధర్నాచౌక్‌లో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె బుధవారం ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వం ఎంతకీ స్పందించకపోవడంతో ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించుకున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. శిబిరం వద్ద నుంచి అంగన్వాడీలు బయటకు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ అంగన్వాడీలు వాటిని ఛేదించుకుని బయటకు వచ్చారు. అప్పటికే పోలీసులు వారిని చుట్టుముట్టారు. అడుగు ముందుకు పడకుండా అడ్డుకున్నారు. తాము రూపొందించుకున్న ఉద్యమ ప్రణాళిక ప్రకారం కచ్చితంగా ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి వినతిపత్రాలు అందజేస్తామని అంగన్వాడీలు పట్టుబట్టారు. అందుకు పోలీసులు అంగీకరించలేదు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు చిక్కిన వారిని చిక్కినట్టుగా అరెస్టు చేశారు. వాహనాల్లోకి ఎక్కించారు. మొత్తం 500 నుంచి 600 మందిని అరెస్టు చేసి అజిత్‌సింగ్‌నగర్‌లోని షాదీఖానా ప్రాంగణానికి తరలించారు. పోలీసుల తోపులాటలో కొంతమంది అంగన్వాడీలకు స్వల్పంగా గాయాలయ్యాయి. అంగన్వాడీలను అరెస్టు చేసిన పోలీసులు పక్కనే శిబిరంలో ఉన్న అవుట్ సోర్సింగ్ సిబ్బందిని కూడా అరెస్టు చేయడానికి సిద్ధమయ్యారు. అక్కడే ఉన్న అధికారులు వద్దని వారించారు. కాగా, అంగన్వాడీలను మొత్తం అరెస్టు చేశాక పోలీసులు అక్కడ శిబిరం లేకుండా చేశారు. ధర్నా చేయడానికి వేసుకున్న టెంట్‌ను తొలగించారు. అంగన్వాడీలకు మద్దతు ప్రకటించడానికి వచ్చిన వివిధ సంఘాల నేతలనూ వ్యానుల్లోకి ఎక్కించారు.
జగ్గయ్యపేట, నందిగామలో ఉద్రిక్తం
నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు కార్యాలయాన్ని అంగన్వాడీలు ముట్టడించారు. నందిగామ డివిజన్‌లో ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు ర్యాలీగా ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు చేరుకున్నారు. పోలీసులు అడ్డుకున్నా తప్పించుకుని ముందుకు అడుగు వేశారు. ఎమ్మెల్యే కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేశారు. ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుమారు గంటకు పైగా ధర్నా జరిగింది. తర్వాత పోలీసులు వారిని అక్కడి నుంచి పంపేశారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఇంటిని కూడా అంగన్వాడీలు ముట్టడించారు. అంగన్వాడీలు అక్కడికి వెళ్తారని తెలియడంతో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాటిని ఛేదించుకుని అంగన్వాడీలు ముందుకు సాగారు. ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించి నినాదాలు చేశారు. కొద్దిసేపటికి ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు సుధాకర్ బయటకు వచ్చి వినతిపత్రం అందుకున్నారు. అనంతరం అంగన్వాడీలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అడుగడుగునా అడ్డంకులే..
మచిలీపట్నంలోని కలెక్టరేట్ వద్ద ఉన్న ధర్నాచౌక్‌లో అంగన్వాడీలు 15 రోజులుగా దీక్ష చేస్తున్నారు. అయినా స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని ఎప్పుడూ దీక్షా శిబిరం వద్దకు రాలేదు. బుధవారం అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు తన ఇంటికి వచ్చి ఆందోళన చేస్తారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విషయం తెలుసుకున్న పేర్ని నాని అంగన్వాడీల కంటే ముందే దీక్షా శిబిరం వద్దకు వెళ్లి వారితో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్, మంత్రి బొత్స సత్యనారాయణతో మాట్లాడి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అవనిగడ్డలోని ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు బుధవారం దీక్ష చేశారు. స్థానిక ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో ఆయన ఇంటికి వెళ్లి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమాన్ని గురువారం నాటికి వాయిదా వేశారు.
పామర్రు నియోజకవర్గం జడ్పీ ఉన్నత పాఠశాల నుంచి స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం వరకూ అంగన్వాడీలు ర్యాలీగా వెళ్లారు. ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ అందుబాటులో లేకపోవడంతో వైసీపీ పామర్రు మండల అధ్యక్షుడు కాకర్ల వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు.
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్దకు వెళ్లేందుకు అంగన్వాడీలు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీక్షకు మద్దతు తెలియజేసిన గుడివాడ సీఐటీయూ నాయకులు ఆర్‌సీ రెడ్డి, బి.శ్రీనివాస్‌ను గుడివాడ సీఐ తులసీదాస్ అదుపులోకి తీసుకున్నారు. దీంతో టూటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట 200 మందికి పైగా అంగన్వాడీలు బుధవారం రాత్రి ఆందోళనకు దిగారు. దీంతో అరెస్ట్ చేసిన సీఐటీయూ నాయకులను పోలీసులు విడిచిపెట్టారు.
పెడనలో మంత్రి జోగి రమేశ్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన అంగన్వాడీలు వేతనాలు పెంచాలని, గ్రాడ్యుటీ అమలు చేయాలని కోరారు. స్పందించిన ఆయన అంగన్వాడీలు 15 రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తనకు తెలియదని అనడంతో అంగన్వాడీలు అవాక్కయ్యారు. సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషిచేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
కంకిపాడులోని వైసీపీ కార్యాలయం వద్ద పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి అంగన్వాడీలు వినతిపత్రం అందజేశారు.
సీఎంను ఎలా ఒప్పిస్తారు..?
‘మంత్రి బొత్స సత్యనారాయణ జీతాలు పెంచలేమని మా రాష్ట్ర నాయకులకు తేల్చి చెప్పారు. 16 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా మా సమస్యపై ప్రభుత్వం స్పందించలేదు. మీరు సీఎం జగన్‌కు మా సమస్యను ఎలా చెప్తారు, ఎలా ఒప్పిస్తారు.‘ అని మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నానీని అంగన్వాడీలు నిలదీశారు. దీక్షా శిబిరం వద్ద దాదాపు గంటసేపు ఆయన అంగన్వాడీలతో మాట్లాడారు. సంఘ నాయకులు ఏ.రమాదేవి, రెజీనారాణి, సీపీఎం నేత కొడాలి శర్మతో చర్చలు జరిపారు. ‘జీతాలు ఎలా పెంచాలనేది సీఎం చూసుకుంటారు.’ అని వారికి పేర్ని నాని సమాధానం ఇచ్చారు. అలాగే, సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘ నాయకులతో కూడా ఆయన చర్చలు జరిపారు. మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ మాడపాటి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 28 , 2023 | 01:02 AM