హిందు కమిషన్ ఏర్పాటు చేయాలి
ABN, Publish Date - Dec 18 , 2023 | 01:01 AM
రాష్ట్రంలో హిందూ దేవాలయాల పరిరక్షణ, హిందువుల సంరక్షణ కోసం కమిషన్‌ను తక్షణం ఏర్పాటు చేయాలని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు డిమాండ్ చేశారు. దేవదాయ శాఖ ఏర్పడినప్పటి నుంచి స్వాధీనం చేసుకున్న ఆలయాల ఆస్తులు, ఆదాయాలకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని స్పష్టం చేశారు.
విజయవాడ, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో హిందూ దేవాలయాల పరిరక్షణ, హిందువుల సంరక్షణ కోసం కమిషన్‌ను తక్షణం ఏర్పాటు చేయాలని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు డిమాండ్ చేశారు. దేవదాయ శాఖ ఏర్పడినప్పటి నుంచి స్వాధీనం చేసుకున్న ఆలయాల ఆస్తులు, ఆదాయాలకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని స్పష్టం చేశారు. విజయవాడలోని ప్రైవేటు హోటల్‌లో హిందూ ధార్మిక పరిషత్ ఆత్మీయ సమావేశం ఆదివారం నిర్వహించారు. సమావేశం అనంతరం ఐవైఆర్‌తోపాటు స్వామి కమలానంద భారతి తదితరులు మీడియాతో మాట్లాడారు. హిందూ అజెండాను ఆమోదించిన పార్టీల జెండాలనే తాము భుజాన వేసుకుంటామని స్పష్టం చేశారు. ఇతర మతాల అధిపతులకు అమలు చేస్తున్న పథకాలను అర్చకులకూ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. హిందూ మతాన్ని రాజకీయ పార్టీలు కులాల వారీగా విభజించి లబ్దిపొందుతున్నాయన్నారు. రాష్ట్రంలో హిందూమతం ఇబ్బందుల్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో అర్చకులను హిందూ మతం ప్రచారకర్తలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. మరో ప్రతినిథి కల్యాణ్ కుమార్ మాట్లాడుతూ, త్వరలో తిరుపతి, విశాఖపట్నంలో ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తామన్నారు. తర్వాత లక్షమంది హిందువులతో బహిరంగ సభను నిర్వహిస్తామని వెల్లడించారు. సమావేశంలో పలువురు వక్తలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. పాఠశాల స్థాయి నుంచే సనాతన ధర్మంపై పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. సేవ్ టెంపుల్స్ ప్రతినిథి గజల్ శ్రీనివాస్, ఉత్తరాంధ్ర జిల్లాల ఎమ్మెల్సీ రఘువర్మ, హిందూ ధార్మిక పరిషత్ ప్రతినిథి శివాజీ, శ్రీశైలం శివస్వామి, అరుణాచలం ఆదిశంకరాచార్య నిత్యాన్నదాన పీఠం స్వామి అనిల్, కాశీకి చెందిన కిరణ్‌నాథ్‌జీ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 18 , 2023 | 01:01 AM