సాహితీ వైభవం చాటిచెప్పేలా మహాసభలు
ABN, Publish Date - Dec 23 , 2023 | 11:26 PM
జిల్లా భాషా సాహిత్య సాంస్కృతిక వైభవాన్ని చాటిచెబుతూ విద్యార్థులను రచయితలుగా తీర్చిదిద్దేలా మహాసభలు సాగాలని వైవీయూ వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసరు చింతా సుధాకర్ ఆకాంక్షించారు.
కడప (ఎడ్యుకేషన్), డిసెంబరు 23: జిల్లా భాషా సాహిత్య సాంస్కృతిక వైభవాన్ని చాటిచెబుతూ విద్యార్థులను రచయితలుగా తీర్చిదిద్దేలా మహాసభలు సాగాలని వైవీయూ వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసరు చింతా సుధాకర్ ఆకాంక్షించారు. శనివా రం కడప నగరం జడ్పీ సభాభవనంలో జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ప్రారంభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రచయితల కలం నుంచి జాలువారిన అక్షరాలు మనసుకు తాకి మనిషిని చైతన్యవంతులను చేస్తాయన్నారు. రచయితల సంఘం ఏర్పాటు చేయడం ఆయా జిల్లాల అస్తిత్వ సాహితీ ఉద్యమాలకు నాందన్నారు. ఇలాంటి వేదికల ద్వారా రచయితల రచనలు కవి సమ్మేళనాలు బాహ్య ప్రపంచంలోకి వెళతాయన్నారు. జిల్లా రచయితల సఘం గౌరవాధ్యక్షులు షేక్ హుసేన్ (సత్యాగ్ని) మాట్లాడుతూ మూడున్నర దశాబ్ధా ల కిందట కడప జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో శ్రీశ్రీ, ఆరుద్ర వంటి మహామహులను కడపగడపలో అడుగిడేలా చేశామని ఆ వైభవాన్ని తిరిగి నేటి యువతకు అందించే ప్రయత్నమిదన్నారు.
గౌరవ సలహాదారు రామిరెడ్డి మా ట్లాడుతూ ప్రాచీన సాహిత్యం మొదలుకుని అభ్యుదయ సాహిత్యం దాకా జిల్లా కవులు, రచయితలు వైభవంచాటు తూ అనేక రచనలు చేశారన్నారు. ప్రొఫెసరు రాచపాలెం చంద్రశేఖరరెడ్డి కీలకోపన్యాసం చేస్తూ తొలి తెలుగు శాసనం పుట్టిన నేల అని అన్నమయ్య, వేమన పోతులూరి వీరబ్ర హ్మం వంటి సంఘ సంస్కర్తలు నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొలిపి చైతన్య పరిచారన్నారు. రారా, గజ్జల మల్లారెడ్డి, వైసీవీ రెడ్డి, కేతువిశ్వనాధరెడ్డి, సొదుం జయరాం వంటి రచయితలు తమ రచనల ద్వారా అభ్యుదయ సాహిత్యానికి న్విరచనం ఇచ్చారన్నారు. ఆత్మీయ అతిధి డాక్టర్ తులసిరెడ్డి మాట్లాడుతూ భాషా సాంస్కృతిక రంగాల్లో జిల్లా అరుదైన ముద్ర కలిగి ఉందన్నారు.
రాజాస్థానాలు అంతరించవచ్చేమో కానీ కవులు రాసిన కావ్యాలు సజీవాలన్నారు. అనంతరం జిల్లా రచయితల సంఘం ఉపాధ్యక్షుడు విద్వాన్ గానుగపెం ట హనుమంతరావు గౌరవాధ్యక్షుడు అలపర్తి పిచ్చయ్య చౌద రి, ప్రిన్సిపాల్ సంజీవమ్మ, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సం ఘం సభ్యులు తవ్వ వెంకటయ్య, రచయితల సంఘం అధ్యక్షులు ప్రొఫెసరు మూల మల్లికార్జునరెడ్డి ఉపన్యసించారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
సోమిశెట్టి సరళ పర్యవేక్షణలో నిర్వహించిన సాంస్కృతికాలు సందర్శకులను మంత్ర ముగ్దులను చేశాయి. కరతాళ ధ్వనులతో ప్రాంగణం మార్మోగి ఆనందం విరాజిల్లింది.
Updated Date - Dec 23 , 2023 | 11:26 PM