ఉద్యోగ, ఉపాధి కల్పన టీడీపీతోనే సాధ్యం
ABN, Publish Date - Dec 30 , 2023 | 11:36 PM
రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం టీడీపీతోనే సాధ్యమని ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఉద్యోగం వచ్చేవరకూ అర్హులైన నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున భృతిని చెల్లిస్తామని తెలిపారు. స్థానిక పంచాయతీ పరిధి బాలయోగినగర్‌లో శనివారం రాత్రి బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో ఎమ్మెల్యే స్వామి పాల్గొని మాట్లాడారు.
ఐదేళ్లలో 20 లక్షల
ఉద్యోగాలు సృష్టిస్తాం
ఎమ్మెల్యే స్వామి హామీ
వైసీపీ పాలనలో ఉన్న పరిశ్రమలూ
పరారయ్యాయని ధ్వజం
సింగరాయకొండ, డిసెంబరు 30 : రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం టీడీపీతోనే సాధ్యమని ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఉద్యోగం వచ్చేవరకూ అర్హులైన నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున భృతిని చెల్లిస్తామని తెలిపారు. స్థానిక పంచాయతీ పరిధి బాలయోగినగర్‌లో శనివారం రాత్రి బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో ఎమ్మెల్యే స్వామి పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి నిరుద్యోగులను అన్ని విధాలా మోసం చేశారన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైసీపీ అధికారంలోకి వస్తే 2.30 లక్షల ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేస్తానని ఆయన హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఏటా మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రగల్భాలు పలికారని తెలిపారు. నిరుద్యోగుల ఓట్లు దండుకొని గద్దెనెక్కిన తరువాత నోటిఫికేషన్ల ఊసే పట్టించుకోలేదని స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో నిరుద్యోగులకు ఇచ్చిన రూ.2వేల భృతికి కూడా మంగళం పాడారని దుయ్యబట్టారు. ఉద్యోగాలను సృష్టించలేక వారి రిటైర్మెంట్ వయసును రెండేళ్లు పొడిగించి అటు ఉద్యోగులను ఒత్తిడికి గురిచేస్తూ, ఇటు నిరుద్యోగులను ఉసూరుమనిపించారని దుయ్యబట్టారు. వైసీపీ అరాచకపాలన, దుందుడుకు చర్యలను చూసి రాష్ట్రానికి ఈ నాలుగున్నరేళ్లలో ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదన్నారు. పైగా ఉన్నవి కూడా పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చదువుకున్న యువత భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. వైసీపీ పాలకులు గంజాయి, మాదకద్రవ్యాల మాఫియాను ప్రోత్సహిస్తూ వేలాది మంది యువకుల జీవితాలను కాలరాస్తున్నారని మండిపడ్డారు. మరలా రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు సృష్టించాలన్నా, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబుకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఇంటింటికీ తిరిగి భవిష్యత్ గ్యారెంటీ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా పలువురు పారిశుధ్యం, డ్రైనేజీ, తాగునీటి సమస్యలను స్వామి దృష్టికి తీసుకొచ్చారు. వీటిపై ఆయన స్పందిస్తూ మరో 100 రోజులు ఓపికపడితే టీడీపీ ప్రభుత్వం వస్తుందని, ఆ వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు వేల్పుల సింగయ్య, నేతలు చీమకుర్తి కృష్ణ, షేక్ సంధానీబాషా, సన్నెబోయిన శ్రీనివాసులు, కూనపరెడ్డి సుబ్బారావు, సుదర్శి చంటి, గాంధీచౌదరి, రామారావు, గుదే వెంకటేశ్వర్లు, మించల బ్రహ్మయ్య, బ్రహ్మేశ్వరరావు, కళ్లగుంట నరసింహ, పసుపులేటి శేషారావు, అబ్దుల్ సుభాన్, యస్థాని, సనావుల్లా, సన్నెబోయిన మాలకొండయ్య, మోటుపల్లి వెంకటేశ్వర్లు, రావులపల్లి వెంకటేశ్వర్లు, శీలం చంటి, కాకా శ్రీనివాసులు, మేకల నరేష్, జమ్ము శంకర్, వల్లెపు రవి, తుమ్మా కోటేశ్వరరావు పాల్గొన్నారు.
Updated Date - Dec 30 , 2023 | 11:37 PM