జగన్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు: అశోక్‌బాబు
ABN, Publish Date - Dec 18 , 2023 | 02:55 AM
బ్రిటీష్ పాలన కంటే ఘోరంగా ఉన్న జగన్ పాలనలో రైతులు, కార్మికులు, ఉద్యోగులు.
అమరావతి, డిసెంబరు17 (ఆంధ్రజ్యోతి): బ్రిటీష్ పాలన కంటే ఘోరంగా ఉన్న జగన్ పాలనలో రైతులు, కార్మికులు, ఉద్యోగులు.. ఏ వర్గం సంతోషంగా లేదని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు ధ్వజమెత్తారు. విశ్వసనీయత గురించి పదేపదే మాట్లాడే జగన్‌రెడ్డి అన్ని వర్గాల్లో విశ్వాసాన్ని కోల్పోయాడని స్పష్టం చేశారు. ఆదివారం టీడీపీ జాతీయ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో 13.42 లక్షల మంది ఉద్యోగులుండగా, 6 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులున్నారు. వారి పరిస్థితి ఘోరంగా ఉంది. ఉద్యోగులు హెల్త్‌కార్డుతో ఆసుపత్రులకు వెళ్తే పురుగుల్ని చూసినట్లు చేస్తున్నారు. డబ్బులు కట్టని ఆరోగ్యశ్రీ రోగులు, డబ్బులు కట్టే ఉద్యోగుల పరిస్థితి ఒకేలా ఉంది. ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలిచ్చే పరిస్థితి లేదు. ఉద్యోగులకు జగన్ హామీలు ఒక్కటీ నెరవేరలేదు. ఉద్యోగ కల్పన అసలే లేదు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన జగన్‌రెడ్డి ఉద్యోగుల్ని, నిరుద్యోగుల్ని ఎంత మోసం చేశాడో గమనించాలి. చంద్రబాబు ఉద్యోగులకు ఎంత మేలు చేశాడో ఇప్పుడు తెలుస్తుంది’ అని అశోక్‌బాబు వాఖ్యానించారు.
Updated Date - Dec 18 , 2023 | 02:55 AM