ఆదివాసీల సమస్యలపై నోరు విప్పని జగన్
ABN, Publish Date - Dec 22 , 2023 | 02:58 AM
ముఖ్యమంత్రి వస్తున్నారని.. మన్యంలోని ప్రధాన సమస్యలపై మాట్లాడతారని ఎంతో ఆశతో చింతపల్లిలో గురువారం జరిగిన జగన్మోహన్‌రెడ్డి సభకు విచ్చేసిన
చింతపల్లి, డిసెంబరు 21: ముఖ్యమంత్రి వస్తున్నారని.. మన్యంలోని ప్రధాన సమస్యలపై మాట్లాడతారని ఎంతో ఆశతో చింతపల్లిలో గురువారం జరిగిన జగన్మోహన్‌రెడ్డి సభకు విచ్చేసిన గిరిజనులకు నిరాశే మిగిలింది. జగన్ ప్రసంగం ఆద్యంతం రాజకీయ ఉపన్యాసం మాదిరిగా సాగిందే తప్ప, ఎక్కడా ఆదివాసీల ప్రయోజనాలు, సమస్యలను ప్రస్తావించలేదు. గిరిజనులు ఏడాదికాలంగా యర్రవరం హైడ్రో పవర్ ప్రాజెక్టు, జీవో నంబరు 3, బోయవాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు వల్ల సుమారు 23 గిరిజన గ్రామాలు ముంపునకు గురికావడంతోపాటు 4వేల ఎకరాల వ్యవసాయ భూములను ఆదివాసీలు నష్టపోవాల్సి వస్తుంది. స్థానిక ప్రజాప్రతినిధులు హైడ్రో పవర్ ప్రాజెక్టు పొరుగు రాష్ట్రానికి తరలిపోయిందని చెబుతున్నప్పటికీ ఆదివాసీలు నమ్మడం లేదు. ఈ ప్రాజెక్టుపై సీఎం జగన్ స్పష్టత ఇస్తారని ఆశించినా నిరాశే ఎదురైంది. అలాగే జీవో నంబరు-3కు చట్టబద్ధత కల్పించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఎస్టీ జాబితాలో బోయ వాల్మీకులను చేర్చవద్దని వినతిపత్రం అందజేసేందుకు జేఏసీ నాయకులు మొట్టడం రాజబాబు, లోచలి రామకృష్ణ తదితరులు సభాస్థలి వద్దకు వెళ్లే ప్రయత్నం చేయగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో చాలామంది ఆదివాసీలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. ఇదిలావుంటే, సీఎం పర్యటన నేపథ్యంలో యర్రవరంలో హైడ్రో పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆదివాసీలు గురువారం ఆందోళన చేపట్టారు. దీనిపై సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలని నినాదాలు చేశారు.
ఆకలితో అలమటించిన గిరిజన విద్యార్థులు
సీఎం జగన్ చింతపల్లి పర్యటన సందర్భంగా గురువారం గిరిజన విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. చింతపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు చింతపల్లి, జీకేవీధి మండలాల పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ఉదయం తొమ్మిది గంటలకే అధికారులు తీసుకువచ్చారు. సీఎం ప్రసంగం మధ్యాహ్నం రెండు గంటలకు ముగిసింది. అప్పటి వరకు విద్యార్థినీ, విద్యార్థులకు ఎటువంటి ఆహారం అందించలేదు. సభ ముగిశాక విద్యార్థులను ఆటోల్లో తరలించారు. వారిలో కొందరు దూర ప్రాంతాల్లోని వసతి గృహాలకు వెళ్లేసరికి సాయంత్రం ఆరు గంటలు కాగా, అప్పుడు రాత్రి భోజనం చేశారు. మరోవైపు.. సీఎం పర్యటన నేపథ్యంలో చింతపల్లిలో ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు దుకాణాలను పోలీసులు మూసివేయించారు.
బస్సులన్నీ సీఎం సభకు..
ప్రయాణికులకు ఇక్కట్లు
పాడేరు రూరల్, డిసెంబరు 21: సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో పాడేరు పీటీడీ డిపోలోని బస్సులను చింతపల్లికి తరలించడంతో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పాడేరు డిపోలో 45 బస్సులు ఉండగా, అందులో 32 బస్సులను జనం తరలింపునకు వినియోగించారు. దీంతో పాడేరు నుంచి సమీప మండలాల్లోని ప్రభుత్వ కార్యాలయాలకు విధులకు వెళ్లే ఉద్యోగులు బస్సులు లేక అవస్థలు పడ్డారు. అలాగే అరకులోయ, డుంబ్రిగుడ, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు, చోడవరం, అనకాపల్లి, విశాఖ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులకూ ఇబ్బందులు తప్పలేదు.
Updated Date - Dec 22 , 2023 | 02:58 AM