అడవిలో హాహాకారాలు
ABN, Publish Date - Dec 22 , 2023 | 03:26 AM
నేడు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు తమ ఉనికి చాటుకోవడం కోసం పలు వాహనాలను తగలబెట్టారు. బుధవారం రాత్రి ఛత్తీ్‌సగఢ్ సుక్మా జిల్లా ఎర్రబోరు,
మావోయిస్టుల చేతిలో గన్నవరం బస్సు దగ్ధం
విజయవాడ, డిసెంబరు 21(ఆంధ్ర జ్యోతి): నేడు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు తమ ఉనికి చాటుకోవడం కోసం పలు వాహనాలను తగలబెట్టారు. బుధవారం రాత్రి ఛత్తీ్‌సగఢ్ సుక్మా జిల్లా ఎర్రబోరు, కుంట గ్రామాల మధ్య ఎన్‌హెచ్ - 30పై మావోయిస్టులు రెండు లారీలను, ఒక బస్సును దహనం చేశారు. గన్నవరం డిపోకు చెందిన ఆర్టీసీ డిపోలోని 35 మంది ప్రయాణికులను దించేసి, వారు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. మహిళలు, చిన్న పిల్లలు ఉండడంతో వారంతా ఏం జరుగుతుందో అర్థంకాక బిక్కచచ్చిపోయారు. ఘటనాస్థలం నుంచి బిక్కుబిక్కుమంటూ, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వారంతా సుమారు ఐదు కిలోమీటర్లు నడిచారు. కొందరు ప్రాణభయంతో పరుగుపెట్టారు. ఆ రాత్రంతా సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్‌లో రక్షణ పొందారు. బస్సు దహనంపై గురువారం ఉదయం ఎర్రబోరు పోలీసు స్టేషన్‌లో ఆర్టీసీ డ్రైవర్ రామ్ ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆర్టీసీ గన్నవరం డిపో మేనేజర్ చెప్పిన కథనం మేరకు... కృష్ణా జిల్లా ఆర్టీసీ పరిధిలో గన్నవరం డిపో బస్సు బుధవారం ఛత్తీ్‌సగఢ్ నుంచి విజయవాడకు ప్రయాణికులను ఎక్కించుకుని బయలుదేరింది.
ఆంధ్ర సరిహద్దు ప్రాంతానికి రావటానికి మరో 15 కిలోమీటర్ల దూరం ఉండగా.. సుక్మా జిల్లా ఎర్రబోరు, కుంట మధ్యన ఎన్‌హెచ్ - 30పై రాత్రి 7.30 గంటల సమయంలో అసిర్‌గూడ సమీపంలో అనూహ్యంగా నక్సల్స్ ప్రేరేపిత వ్యక్తులు రాడ్లు, కత్తులు పట్టుకుని బస్సును అడ్డగించారు. అప్పటికే అదే ప్రాంతంలో ఒక ట్రాలీ, ఒక లారీ నిలిపేసి ఉన్నాయి. ఆర్టీసీ సిబ్బందిని, ప్రయాణికులను బస్సు నుంచి కిందకు దించి, తక్షణం సెల్‌ఫోన్లు ఆఫ్ చేయాలని హెచ్చరించారు. ఆ సమయంలో బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు ముందు ఉన్న ట్రాలీ, లారీని తగలపెట్టారు. అనంతరం ఆర్టీసీ బస్సుకూ నిప్పు పెట్టారు. ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఐదు కిలోమీటర్ల అవతల ఉన్న సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్‌లో ఉన్నారు. అదే సమయంలో ఆంరఽధ సరిహద్దుకు ఐదు కిలోమీటర్ల దూరంలో తట్టి దగ్గర మరో కారును మావోయిస్టులు దహనం చేశారన్న సమాచారం అందింది. దాంతో ప్రయాణికులను ఆ రాత్రి పంపడం శ్రేయస్కరం కాదని భావించిన పోలీసులు వారిని బేస్ క్యాంపులోనే ఉంచేశారు. తెల్లవారిన తరువాత వారిని చింతూరు నుంచి కుంట చేర్చారు. పాడేరు నుంచి అధికారులు పంపిన బస్సులో వారిని భద్రాచలం పంపించారు. అక్కడ నుంచి మరో బస్సులో ప్రయాణికులను విజయవాడకు తీసుకువచ్చారు.
రాజమండ్రి వాసిపై దాడి..
అల్లూరి జిల్లా, చింతూరు మండలం, వీరాపురం వద్ద బుధవారం రాత్రి ఏపీ నుంచి ఛత్తీ్‌సగఢ్ వైపు వెళుతున్న కారుకు నిప్పు అంటించిన విషయం తెలిసిందే. రాజమహేంద్రవరంకు చెందిన మల్లికార్జునరావు ఒక ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. కార్యాలయం పనిపై ఆయన రాయపూర్‌కు కారులో వెళుతున్న క్రమంలో మావోయిస్టులు అడ్డగించారు. కర్రలు అడ్డుపెట్టి ఎవరో డబ్బులు వసూలు చేసుకుంటున్నారని ఆయన భావించినట్లు సమాచారం. దీంతో వారిని తప్పించుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేసినట్లు తెల్సింది. దీంతో ఆగ్రహించిన మావోయిస్టులు మల్లికార్జునరావు కారుకు అడ్డంగా వెళ్లి ఆయన్ను కిందకు దింపి కర్రతో దాడి చేశారు. కారుకు నిప్పు అంటించారు.
రెండో రోజూ విధ్వంసం
బస్సును తగులబెట్టిన మావోయిస్టులు
చింతూరు, డిసెంబరు 21: సూరజ్‌ఖండ్ దమన కాండను నిరసిస్తూ ఈ నెల 22 న భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు రెండో రోజు గురువారం కూడా విధ్వంసాన్ని కొనసాగించారు. ఛత్తీ్‌సగఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఆపుపల్లి, తిమ్మాపూర్ వద్ద 22 కిలోమీటర్ల వ్యవధిలోనే రెండు బస్సులను ఆపి వాటికి నిప్పు అంటించారు. సూరజ్‌ఖండ్ దమనఖాండకు నిరసనగా డిసెంబరు 16 నుండి 22 వరకు ఆందోళనలు చేపట్టాలని, 22న భారత్ బంద్ పాటించాలని మావోయిస్టులు పలు ప్రదేశాలలో కరపత్రాలు, బ్యానర్లు, పోస్టర్లను ఏర్పాటు చేశారు.
Updated Date - Dec 22 , 2023 | 03:26 AM